
నేడు తమిళనాడు సీఎం జయలలితతో భేటీకానున్న వైఎస్ జగన్
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం చెన్నైలో భేటీ కానున్నారు. సమైక్యాంధ్రకు మద్దతు ఇవ్వాలని జయలలితను ఈ సందర్బంగా వైఎస్ జగన్ కోరనున్నారు. ఆంధప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించడం వల్ల వచ్చే ఇబ్బందులను ఆయన జయలలితకు వివరిస్తారు. అలాగే రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ తనదైన శైలీలో ముందుకు వెళ్తున్న తీరును కూడా వైఎస్ జగన్ ఈ సందర్బంగా వివరించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ విభజనపై కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరిని, సమైక్యంగా ఉంచేందుకు మద్దతు ఇవ్వాలని వైఎస్ జగన్ ఇప్పటికే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయిక్ ను ఆ రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ లో కలసి వివరించారు. అలాగే శివసేన నాయకుడు ఉద్దవ్ ఠాక్రేలతోపాటు కేంద్ర మంత్రి శరద్పవర్ను ముంబైలో కలసి విజ్ఞప్తి చేశారు. ఇదే విషయంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీని వైఎస్ జగన్ కలసిన సంగతి తెలిసిందే. అలాగే ఇదే అంశంపై సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్, ఆయన కుమారుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ను కూడా సాధ్యమైనంత త్వరలో వైఎస్ జగన్ కలవనున్నారు.