చెన్నై విమానాశ్రయంలో జగన్కు ఘన స్వాగతం
చెన్నై : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఉదయం చెన్నై చేరుకున్నారు. ఆయనకు చెన్నై విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. సమైక్యాంధ్ర సాధనపై అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, డీఎంకే అధినేత కరుణానిధి మద్దతు కోరనున్నారు.
మధ్యాహ్నం 2 గంటలకు చెన్నై సచివాలయంలో సీఎం జయలలితను కలుసుకుంటారు. అక్కడి నుంచి గోపాలపురంలోని డీఎంకే అధినేత కరుణానిధి ఇంటికి సాయంత్రం 5, 6 గంటల మధ్యలో వెళ్లే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్ విభజనలో కేంద్రం అనుసరిస్తున్న ఏకపక్ష వైఖరిని జయలలిత, కరుణానిధికి వివరిస్తారు. తెలంగాణ ఏర్పడితే రాష్ట్రం ఎడారిగా మారి తెలుగు ప్రజలంతా నష్టపోయే అవకాశం ఉన్నందున సమైక్యాంధ్ర ఉద్యమాన్ని బలపరచాలని కోరుతారు.
కాగా జగన్ చెన్నై విమానాశ్రయం నుంచి నేరుగా తన సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి ఇంటికి వెళతారు. అక్కడ పార్టీ ప్రతినిధులు, బంధుమిత్రులను కలుసుకుంటారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు ప్రముఖులు జగన్‌మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఈ రోజు రాత్రికి ఆయన చెన్నైలోనే బస చేస్తారు.