నేడు జగన్ రాక
చెన్నై, సాక్షి ప్రతినిధి:వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బుధవారం చెన్నై వస్తున్నారు. సమైక్యాంధ్ర సాధనపై అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత, డీఎంకే అధినేత కరుణానిధి మద్దతు కోరనున్నారు. ఉదయం 9.45 గంటలకు చెన్నై విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా తన సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి ఇంటికి వెళతారు. అక్కడ పార్టీ ప్రతినిధులు, బంధుమిత్రులను కలుసుకుంటారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు ప్రముఖులు జగన్‌మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు చెన్నై సచివాలయంలో సీఎం జయలలితను కలుసుకుంటారు. అక్కడి నుంచి గోపాలపురంలోని డీఎంకే అధినేత కరుణానిధి ఇంటికి సాయంత్రం 5, 6 గంటల మధ్యలో వెళ్లే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్ విభజనలో కేంద్రం అనుసరిస్తున్న ఏకపక్ష వైఖరిని జయలలిత, కరుణానిధికి వివరిస్తారు. తెలంగాణ ఏర్పడితే రాష్ట్రం ఎడారిగా మారి తెలుగు ప్రజలంతా నష్టపోయే అవకాశం ఉన్నందున సమైక్యాంధ్ర ఉద్యమాన్ని బలపరచాలని కోరుతారు.
బుధవారం రాత్రి జగన్‌మోహన్ రెడ్డి చెన్నైలోనే బసచేస్తారు.ఏపీని తలపిస్తున్న చెన్నై: జగనన్న వస్తున్నాడన్న ఆనందంతో ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన వందలాది ఫ్లెక్సీలతో చెన్నై నగరం ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తలపిస్తోంది. వైఎస్సార్ సీపీ కేంద్ర కమిటీ సభ్యులు బాలినేని శ్రీనివాస రెడ్డి, బీ రాఘవేంద్రరెడ్డి, చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నగరంలో భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. చెన్నైలో జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరనున్న వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, తమిళనాడు విభాగం నేతలు శరత్‌కుమార్, శరవణన్, జాకీర్‌హుస్సేన్ తదితరులు నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తమిళ ప్రజలు కొద్దిసేపు వాటి ముందు నిలబడి మరీ వీక్షిస్తున్నారు. విమానాశ్రయం నుంచి గిండీ, ఆళ్లారుపేట, మైలాపూరు, రాధాకృష్ణన్‌శాలై, సచివాలయం మీదుగా జగన్ పయనించే మార్గమంతా వెలిసిన ఫ్లెక్సీలు, కటౌట్‌లు, వాల్‌పోస్టర్లను గమనిస్తే ఇది తమిళనాడా, ఆంధ్రప్రదేశా అనే సందేహం రాకమానదు. కోడంబాక్కం పరిధిలో వందలాదిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పతాకాలు రెపరెపలాడుతున్నాయి.