సమైక్యమే మా లక్ష్యం
Published Sun, Nov 17 2013 1:27 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
చెన్నై, సాక్షి ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పార్టీలు విభజనపై దోబూచులాడుతుండగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే స్పష్టమైన సమైక్యనినాదంతో ముందుకు సాగుతోందని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, నెల్లూరు జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. చెన్నైలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రెండువైపులా రాజకీయ లబ్ధిపొందాలనే ఆలోచనతో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయన్నారు. 1972లో జై ఆంధ్రా ఉద్యమం సాగినపుడు విభజనకు ప్రభుత్వం ససేమిరా అందని గుర్తుచేశారు. ఆనాడే విభజన జరిగి ఉంటే సీమాంధ్ర ను ఈ పాటికి సస్యశ్యామలం చేసుకుని ఉండేవారమన్నారు. రాష్ట్ర విభజనతో సీమాంధ్ర భవిష్యత్తులో ఎడారిగా మారిపోతుందని ఆయన ఆందోళనవ్యక్తం చేశారు. కాంగ్రెస్ తన రాజకీయ లబ్ధికోసం సీఎం కిరణ్‌ను అడ్డంపెట్టుకుని డ్రామాలు ఆడుతోందని విమర్శించారు.
రాష్ట్రంలో సమైక్యగానం, కేంద్రంలో విభజన రాగం ఆలపించే కిరణ్‌ను ప్రజలు సాగనంపే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. విభజనపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నా పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ పూనుకోవడం దురదృష్టకరమన్నారు. తెలంగాణపై ఎటూ తేల్చుకోలేని చంద్రబాబు ఢిల్లీకి, గల్లీకి మధ్య తిరుగాడుతున్నారని వ్యాఖ్యానించారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, కుతంత్రాలు పన్నినా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్న సంగతిని ప్రజలు గ్రహించారని తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తన సుపరిపాలనతో రాష్ట్ర ప్రజల మనస్సులో చెరగని ముద్రవేశారని, తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని సీఎం చేయడమే ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని సమస్యలకు పరిష్కారంగా భావిస్తున్నారని అన్నారు. సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ తమిళనాడు విభాగం ఇన్‌చార్జ్ శరత్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement