సమైక్యాంధ్ర సాధనలో భాగంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం తలపెట్టిన బంద్ ప్రభావం తమిళనాడుపైనా పడింది. ఆంధ్రప్రదేశ్ వైపు ప్రయాణించే ప్రభుత్వ బస్సులన్నీ బస్టాండ్లలో నిలిచిపోయాయి.
చెన్నై, సాక్షి ప్రతినిధి:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు ముక్కలుగా విడిపోకుండా కాపాడుకునేందుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా పోరాడుతోంది. సమైక్యాంధ్ర నినాదానికి అన్ని పార్టీల మద్దతు కూడగట్టేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పలు రాష్ట్రాల్లో పర్యటించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఏపీ విభజన సమస్య తమ ఒక్క రాష్ట్రానిదే కాదని, భవిష్యత్తులో మిగిలిన రాష్ట్రాల్లో సైతం విభజన వివాదం తలెత్తవచ్చని పార్టీల నేతలను కలుసుకుని వివరించారు. ఇందులో భాగంగా ఇటీవల వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెన్నైకి చేరుకుని ముఖ్యమంత్రి జయలలిత, డీఎంకే అధినేత కరుణానిధిని కలుసుకుని వారి మద్దతు కూడగట్టారు. విభజన విషయంలో యూపీఏ ప్రభుత్వ ఏకపక్ష వైఖరిని జాతీయ స్థాయిలోని అనేక పార్టీలు ఎండగడుతున్నాయి. అయినప్పటికీ కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మొండిగా ముందుకు సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సమగ్ర చర్చకు సైతం అనుమతించని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్‌లో బంద్ సంపూర్ణ విజయం సాధించింది. ప్రధానంగా సమైక్యాంధ్రను కోరుకుంటున్న 13 జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, వాణిజ్య, వ్యాపార కేంద్రాలను స్వచ్ఛందంగా మూసివేసి ప్రజలు మద్దతు తెలిపారు.
నిలిచిన బస్సులు
ఆంధ్రప్రదేశ్‌లో బంద్ కారణంగా తమిళనాడు నుంచి ఆవైపు వెళ్లే ప్రభుత్వ బస్సులను నిలిపివేశారు. హైదరాబాద్, విశాఖపట్నం, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, శ్రీశైలం, మంత్రాలయం, వైఎస్‌ఆర్ కడప జిల్లా, కర్నూలుకు కోయంబేడు బస్‌స్టేషన్ నుంచి ప్రతిరోజూ బస్సు సర్వీసులున్నాయి. వాటన్నింటినీ రద్దు చేశారు. కొన్ని ప్రయివేటు బస్సులు, కార్లు ప్రయాణికులతో బయలుదేరగా వాటిని రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలైన తిరుత్తణి, వేలూరు, తడ వద్ద ఉద్యమకారులు నిలిపివేసి తిప్పిపంపారు. బంద్ ప్రభావంతో బస్సులు నిలిచిపోవడంతో కోయంబేడు బస్‌స్టేషన్ ఆంధ్ర ప్రయాణికులతో కిటకిటలాడింది.
ఆగిన బస్సులు
Published Sat, Jan 4 2014 2:15 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
Advertisement
Advertisement