రూటు మార్చిన ‘కరుణ’!
సాక్షి, చెన్నై: డీఎంకే అధినేత ఎం కరుణానిధి రాచతంత్రాల్ని ప్రయోగించడంలో దిట్ట. ఎప్పుడు స్పందించాలో స్పందించ కూడదో అన్న విషయంలో ఆయనకు ఆయనే సాటి. శ్రీలంకలోయుద్ధం పేరుతో సాగుతున్న నరమేధంలో ఈలం తమిళులు హతమైనా పెదవి విప్పని ఆయన యుద్ధం ముగిసే క్షణంలో నిరాహార దీక్షతో నాటకాన్ని రచించి మార్కులు కొట్టేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో విద్యుత్, తాగునీరు తదితర ప్రజా సమస్యలపై ప్రతి పక్షాలు గగ్గోలు పెడుతున్నా పట్టించుకోని ఆయన, చివరి క్షణంలో తనదైన ముద్ర వేయించుకోవడంలో నేర్పరి. ఇదే ఆ పార్టీకి గడ్డు పరిస్థితులను తీసుకొచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, లోక్ సభ ఎన్నికల్లో డిపాజిట్ల గల్లంతు ఆయనకు పెద్ద గుణపాఠాన్నే నేర్పినట్టున్నాయి. అందుకే తన రూటును మార్చినట్టున్నారు.
ఇటు ప్రక్షాళన-అటు సమస్యలు: ఓ వైపు పార్టీలో ప్రక్షాళనలపై దృష్టి కేంద్రీకరిస్తూనే, మరో వైపు ప్రజా సమస్యల్ని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించే విధానాలను అందరి కన్నా ముందుగా పసిగట్టి వాటిపై గళం విప్పే పనిలో పడ్డారు. ప్రధాన మంత్రులకు లేఖాస్త్రాలు సంధించడంలో సీఎం జయలలితకు సరి రారెవ్వరు అని పదే పదే చెప్పుకొచ్చే కరుణానిధి, ఇప్పుడు అదే బాటలో పయనిస్తున్నారు. కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈలం తమిళుల సమస్య, జాలర్లపై దాడులు, కావేరి సంక్షేమ బోర్డు, ముల్లై పెరియార్ వివాదాలను అస్త్రంగా చేసుకుని, తమిళులను ఆదుకోవాలంటూ పీఎం నరేంద్ర మోడీకి లేఖాస్త్రాల్ని సంధించే పనిలో పడ్డారు.
అందరి కన్నా ముందు తానే ఉండాలన్నట్టుగా , ప్రజా సమస్యలపై తనకే చిత్త శుద్ది ఉన్నట్టు నిరూపించుకునే విధంగా ఆయన ముందుకు సాగుతోన్నారు. నిన్న హిందీ-నేడు పాలారు : సామాజిక వెబ్ సైట్లలో హిందీకి ప్రాధాన్యతను ఇస్తూ కేంద్రం ప్రకటించిందో లేదో, అందరికన్నా ముందుగా ఈవిషయమై పెదవి విప్పింది కరుణానిధే. హిందీకి వ్యతిరేక ంగా ఒకప్పుడు తాను చేసిన ఉద్యమాన్ని వివరిస్తూ కేంద్రానికి హెచ్చరికలు చేశారు. ఆయన ప్రకటనతోనే తమిళనాడులోని ఇతర పార్టీలకు కేంద్రం తీసుకున్న నిర్ణయం తెలియ వచ్చింది. ఇప్పుడు పాలారు నినాదాన్ని సైతం ఆయనే తొలుత అందుకున్నారు. ఎక్కడో కుప్పంలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన హెచ్చరికను అస్త్రంగా చేసుకుని పాలారు నినాదాన్ని అందుకోవడం విశేషం.
డ్యాంకు నో ఛాన్స్: పాలారు నదిపై డ్యాం నిర్మిస్తానం టూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను అస్త్రం గా చేసుకుని శనివారం కరుణానిధి ప్రకటనాస్త్రంతో ప్రజల్ని ఆకర్షించే యత్నం చేయడం గమనార్హం. నాలు గు రోజుల క్రితం తనను గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపేందుకు వెళ్లిన చంద్రబాబు నాయుడు పాలారు నీరుచుక్క కూడా వృథా కాకుండా, కుప్పం ప్రజలకు అన్నదాతలకు అందిస్తానని పేర్కొనడాన్ని కరుణానిధి తీవ్రంగా ఖండించారు. పాలారు నదీపై తమిళనాడుకు ఉన్న హక్కులు, గతంలో జరిగిన సంఘటనలు, కేంద్రం నియమించిన కమిటీ సూచనను చం ద్రబాబుకు వివరించారు.దీంతో తిరువణ్ణామలై, వేలూ రు, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాల ప్రజల మదిలో మార్కులు కొట్టేందుకు కరుణానిధి రెడీ అయ్యారు.
ఇదీ పాలారు వివాదం: కర్ణాటకలో 93 కి.మీ, ఆంధ్రప్రదేశ్‌లో 33 కి.మీ దూరం పయనించి అత్యధిక భాగం తమిళనాడులో ప్రవహిస్తున్న నది పాలారు. డీఎంకే అధికారంలో ఉన్న సమయంలో ఓ మారు పాలారు నదిపై డ్యాం నిర్మించే నినాదాన్ని ఆంధ్రప్రదేశ్ పాలకు లు తెరపైకి తెచ్చారు. అప్పడు కాంగ్రెస్ నేతృత్వంలోని వైఎస్సార్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు డీఎంకే అడ్డుపడింది. కోర్టుకు వెళ్లిన తమిళనాడు ప్రభుత్వం తన వాదనను విన్పించింది. చివరకు కోర్టు ఉత్తర్వులతో కేంద్ర నీటి పారుదల శాఖ నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు కుప్పం వద్ద డ్యాం నిర్మాణ ప్రయత్నం కాస్త పక్కన పడింది. ఇప్పుడు ఆ డ్యాం నిర్మాణ నినాదాన్ని చంద్రబాబు అందుకోవడం కరుణలో ఆగ్రహాన్ని రేపినట్టుంది. తన హయూంలో తీసుకున్న చర్యలతో అప్పట్లో డ్యాం నిర్మాణానికి పడ్డ తెరను ఎత్తి చూపుతూ చంద్రబాబుకు చురకలు అంటించడంతో పాటుగా ప్రజల్ని ఆకర్షించే యత్నం చేయడం విశేషం.