
ఘన నివాళి
పులివెందులలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి దివంగత వైఎస్ రాజారెడ్డి 16వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
పులివెందుల, న్యూస్‌లైన్: పులివెందులలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి దివంగత వైఎస్ రాజారెడ్డి 16వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం పులివెందులలోని లయోలా డిగ్రీ కళాశాల రహదారిలో ఉన్న సమాధి ఘాట్ ప్రాంతంలో పలువురు వైఎస్‌ఆర్ అభిమానులు, స్థానికులు నివాళులర్పించారు.
వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డిలు ఉదయాన్నే వచ్చి వైఎస్ రాజారెడ్డి, వైఎస్ జయమ్మ, వైఎస్ జార్జిరెడ్డి సమాధుల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్‌సీపీఎల్పీ నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేరుగా సమాధి ఘాట్‌కు చేరుకొని తాత వైఎస్ రాజారెడ్డి, అవ్వ వైఎస్ జయమ్మ, వైఎస్ జార్జిరెడ్డి సమాధుల వద్ద పుష్ప గుచ్ఛాలు ఉంచి నివాళులర్పించడంతోపాటు కొద్దిసేపు మౌనం పాటించారు.
అనంతరం మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు ఈసీ గంగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పురుషోత్తమరెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చెర్మైన్ వైఎస్ మనోహర్‌రెడ్డి తదితరులు వచ్చి వైఎస్ రాజారెడ్డి ఘాట్ వద్ద పుష్ప గుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. సమాధి ఘాట్ వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగారు. వృద్ధులను ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని పలకరించారు.
పార్కులో వైఎస్ రాజారెడ్డి
విగ్రహం వద్ద నివాళి :
పులివెందులలోని వైఎస్ రాజారెడ్డి సమాధి ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేరుగా లయోలా డిగ్రీ కళాశాల రోడ్డు సమీపంలో ఉన్న రాజారెడ్డి పార్కుకు చేరుకున్నారు. వైఎస్ జగన్‌తోపాటు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చెర్మైన్ వైఎస్ మనోహర్‌రెడ్డి తదితరులు వెళ్లారు. పార్కులో వైఎస్ రాజారెడ్డి విగ్రహం వద్ద పూలమాలలువేసి నివాళులర్పించడంతోపాటు కొవ్వొత్తులను వెలిగించి నమస్కరించారు.
వైఎస్‌ఆర్ ఆడిటోరియంలో
ప్రత్యేక ప్రార్థనలు..
పులివెందులలోని బాకరాపురంలో ఉన్న వైఎస్‌ఆర్ ఆడిటోరియంలో వైఎస్ కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముందుగా వైఎస్ రాజారెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం ప్రత్యేక ప్రార్థన కార్యక్రమం ప్రారంభమైంది. సీఎస్‌ఐ చర్చి ఫాస్టర్ ఐజాక్ వరప్రసాద్ ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు.
పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్సార్‌సీపీఎల్పీ నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డి, చిన్నాన్నలు వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ ప్రకాష్‌రెడ్డి, వైఎస్ జోసఫ్‌రెడ్డి, ఈసీ గంగిరెడ్డి, సతీమణి ఈసీ సుగుణమ్మ, వైఎస్ మనోహర్‌రెడ్డి, వైఎస్ మేనేత్తలు కమలమ్మ, విమలమ్మ, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఆయన సతీ మణి సమతారెడ్డి, సోదరి శ్వేతారెడ్డి, మా జీ ఎమ్మెల్యే పురుషోత్తమరెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి ప్రమీలమ్మ, వైఎస్ భాస్కర్‌రెడ్డి సతీమణి లక్షుమ్మ తదితరులు ప్రత్యేక ప్రార్థనలలో తదితరులు పాల్గొన్నారు.