ఉదయగిరి, న్యూస్‌లైన్ : దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన ఉచిత విద్యుత్‌ను దశలవారీగా ఎత్తివేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ప్రపంచ బ్యాంకు షరతులకు లోబడి ఉచిత విద్యుత్‌ను ఎత్తివేసేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. దీనికి నగదు బదిలీ పథకాన్ని అమలు చేసి దశలవారీగా ‘ఉచితానికి’ మంగళం పాడేందుకు కుయుక్తులు పన్నుతోంది. ప్రపంచ బ్యాంకు తయారు చేసిన వ్యవసాయానికి నేరుగా నగదు బదిలీ అనే ముసాయిదా నివేదికకు రాష్ర్ట ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
దీన్ని అమలులోకి తెచ్చే ప్రయత్నం జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. అందులో భాగంగా రైతుల ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగిస్తున్నారు. జిల్లాలోని ప్రస్తుతం జరుగుతున్న హెచ్‌డీవీఎస్ పనుల్లో భాగంగా ఏర్పాటు చేస్తున్న ట్రాన్స్‌ఫార్మర్లకు మీటర్లు బిగిస్తున్నారు. ప్రతి ట్రాన్స్‌ఫార్మర్‌కు మీటరు ఏర్పాటు చేస్తున్నారు. ఫీడర్‌కు కూడా మీటరు ఏర్పాటు చేసి ఆ వ్యవసాయ కనెక్షన్‌కు ఎంత మేర విద్యుత్ వినియోగం అవుతుందో లెక్క తేల్చేందుకు రీడింగ్ పరికరాలను ఏర్పాటు చేస్తున్నారు.
రైతులపై పెరగనున్న భారం
ప్రస్తుతం జిల్లాలో 1.36 లక్షల వ్యవసాయ ఉచిత కనెక్షన్లు ఉన్నాయి. వీటికి విద్యుత్ మీటర్లు లేవు. కేవలం వినియోగ అంచనా ప్రకారం లెక్కించి ఆ మేరకు ప్రభుత్వం డిస్కంలకు సబ్సిడీ ఇస్తోంది. ప్రస్తుతం 5 హార్స్ పవర్ మోటారు రోజుకు ఏడు గంటలు విద్యుత్ వినియోగిస్తే 5.25 యూనిట్లు విద్యుత్ కాలుతుందని అంచనా వేస్తున్నారు. ఏడాదికి 300 రోజులకు ఒక్కో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌కు 1,775 యూనిట్లు విద్యుత్ వినియోగిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. ఆ మొత్తం సబ్సిడీని ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు అందజేస్తూ వస్తోంది.
అదే మీటర్ల ద్వారా రీడింగ్ లెక్కకట్టినట్లయితే కచ్చితంగా ఖర్చయిన రీడింగ్‌కు సబ్సిడీ చెల్లించడం ద్వారా కొంత లాభం ఉంటుంది. మరో విధంగా లాభపడేందుకు ప్రభుత్వం నగదు బదిలీ పథకాన్ని అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఖర్చవుతున్న యూనిట్లలో కొంత మేరకే తాము సబ్సిడీ భరిస్తామని, మిగతాది రైతు భరించాలనే వ్యూహంతో అడుగులు ముందుకేస్తోంది. ముందుగా రైతు వినియోగించిన యూనిట్ల మొత్తానికి విద్యుత్ సంస్థలకు బిల్లు చెల్లించాలి.
అందులో సబ్సిడీని రైతు బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని ప్రభుత్వం నమ్మబలకనుంది. పథకం పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చిన మీదట సబ్సిడీ రైతు ఖాతాలో జమ చేయడం మానేసే అవకాశముంది. ఇప్పటికే ఈ విధానాన్ని సబ్సిడీ గ్యాస్ సిలిండర్లలో అమలు చేసి వినియోగదారుల నుంచి అధిక మొత్తంలో వసూలు చేస్తున్న విషయం విదితమే. ఒక్కొక్క సిలిండరు రూ.418 కే అందించాల్సి ఉన్నా, అదనంగా రూ.70 వ్యాట్‌తో కలిపి మరో రూ.130 అదనంగా వినియోగదారుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తోంది. ఇదే తరహాలోనే ఉచిత విద్యుత్‌లో కూడా అమలు చేయనుందనే అన్నదాతల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
చంద్రబాబు పాలన
గుర్తు చేయనుంది..
చంద్రబాబు హయాంలో ప్రపంచ బ్యాంకు ఆదేశాలు తు.చ తప్పకుండా విద్యుత్ పంపిణీ అమలు జరిగింది. ఎన్టీఆర్ హయాంలో రైతులకు బాసటగా హార్స్ పవర్‌కు రూ.50 వసూలు చేయగా, చంద్రబాబు దాన్ని రద్దు చేసి రైతుల నుంచి అధిక మొత్తంలో విద్యుత్ చార్జీలు వసూలు చేశారు.
రైతుల వెతలను ప్రతిపక్ష నేతగా క్షేత్రస్థాయిలో పరిశీలించిన వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో అధికారంలోకి రాగానే ఉచిత విద్యుత్ అమలు చేసి రైతులను ఆదుకున్నారు. విద్యుత్ సంస్థలు ఎంత ఒత్తిడి తెచ్చినా రైతు ప్రయోజనాల దృష్ట్యా చార్జీల పెంపునకు, ఉచితం ఎత్తివేతకు అంగీకరించలేదు. మహానేత వైఎస్సార్ మరణానంతరం రాష్ట్ర విద్యుత్ రంగంపై ప్రపంచ బ్యాంకు పెత్తనం ప్రారంభమైంది. ఇందులో భాగంగానే కిరణ్ ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకానికి మంగళం పాడేందుకు వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించి నగదు బదిలీ పథకాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.
సర్కారు దొంగదెబ్బ
Published Mon, Nov 4 2013 2:50 AM | Last Updated on Mon, Aug 27 2018 9:19 PM
Advertisement
Advertisement