నేటినుంచి జిల్లాలో షర్మిల ఎన్నికల ప్రచారభేరి | y.s sharmila tour starts on to day in nellore district | Sakshi
Sakshi News home page

నేటినుంచి జిల్లాలో షర్మిల ఎన్నికల ప్రచారభేరి

Published Mon, Mar 17 2014 3:45 AM | Last Updated on Sat, Sep 2 2017 4:47 AM

y.s sharmila tour starts on to day in nellore district

సాక్షి, నెల్లూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల జనపథం పేరుతో జిల్లాలో ఎన్నికల ప్రచారభేరి మోగించనున్నారు. ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు నాలుగు రోజులపాటు ఆమె ప్రచారం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఆత్మకూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట, నాయుడుపేట, గూడూ రు, నెల్లూరు, కావలి నియోజకవర్గాల్లో జరిగే రోడ్‌షో, పలు బహిరంగ సభలలో షర్మిల ప్రసంగిస్తారు.  తొలిరోజు ఆత్మకూరు బహిరంగ సభతో ఆమె జిల్లాలో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. రెండోరోజు వెంకటగిరి, సూళ్లూరుపేట, నాయుడుపేట, మూడో రోజు గూడూరు, నెల్లూరు, నాలుగోరోజు కావలిలో నిర్వహించే ప్రచార కార్యక్రమాల్లో షర్మిల పాల్గొంటారు. మున్సిపల్ ఎన్నికలతో పాటు జిల్లాపరిషత్, మండలపరిత్ ఎన్నికలు సైతం జరగనున్నాయి.
 
 ఇప్పటికే లోక్‌సభ, శాసనసభ ఎన్నికలకూ షెడ్యూల్ విడుదలైంది. ఈ నేపథ్యంలో వరుస ఎన్నికలతో జిల్లాలో పార్టీ శ్రేణులు బిజీ అయ్యాయి. జరగబోయే అన్ని ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను  గెలిపించాలని కోరుతూ షర్మిల ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. దివంగతనేత వైఎస్సార్ తన పాలనలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసి రాష్ట్ర ప్రజలకు చేసిన సేవలను షర్మిల గుర్తు చేయనున్నారు. వైఎస్సార్ మరణానంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన పథకాలను ఎలా నీరు గార్చిందీ ఆమె ప్రజలకు వివరించనున్నారు.  సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోషించిన పాత్రను సైతం షర్మిల ప్రజలకు తెలియజెప్పనున్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసిన పార్టీలకు బుద్ధి చెప్పాలని షర్మిల జనపథం ఎన్నికల ప్రచారభేరిలో ప్రజలకు పిలుపునివ్వనున్నారు.
 
 అన్ని విధాలా రాష్ట్రం చితికి పోయిన ఈ తరుణంలో వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రమే సమర్థవంతమైన నాటి వైఎస్సార్ పాలనను అందించగలదని షర్మిల ప్రజలకు వివరించనున్నారు. షర్మిల ఎన్నికల ప్రచారానికి రానుండడంతో వైఎస్సార్‌సీపీ జిల్లా శ్రేణుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. ఇప్పటికే పలు కార్యక్రమాల ద్వారా నిత్యం ప్రజల్లో ఉంటున్న పార్టీ సమన్వయకర్తలు, మిగిలిన శ్రేణులకు షర్మిల ప్రచారం రెట్టించిన ఉత్సాహాన్ని, బలాన్ని ఇస్తుందని పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement