ఏసీబీ వలలో యాంకరేజ్ పోర్టు హెచ్‌సీఎస్
కాకినాడ క్రైం : కాకినాడ యాంకరేజ్ పోర్టు హార్బర్ క్రాఫ్ట్స్ సూపరింటెండెంట్(హెచ్‌సీఎస్) పి.సత్యం అవినీతి నిరోధక శాఖ అధికారుల వలలో చిక్కారు. ఏసీబీ డీఎస్పీ ఎన్.రమేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పోర్టుకు విదేశాల నుంచి వచ్చే సరుకు రవాణా నౌకల్లో చమురు వ్యర్థాల్ని, నీటిని తొలగించేందుకు కొన్ని ప్రైవేటు సంస్థలు కాంట్రాక్టు కుదుర్చుకుంటాయి. దానిలో భాగంగా కాకినాడకు చెందిన ఎస్‌వీ లాజిస్టిక్స్ సంస్థ భాగస్వామి బి.శ్రీనివాసరావు అందుకు దరఖాస్తు చేసుకున్నారు. పోర్టు కార్యాలయం నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు హెచ్‌సీఎస్ పాక సత్యం రూ.15 వేలు డిమాండ్ చేశారు. రెండు రోజుల క్రితం రూ.10 వేలకు ఒప్పందం కుదరగా శ్రీనివాసరావు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారు రూ.10 వేల నగదును శ్రీనివాసరావుకు ఇచ్చి సోమవారం పోర్టు కార్యాలయానికి పంపారు. శ్రీనివాసరావు నుంచి హెచ్‌సీఎస్ సత్యం సొమ్ము తీసుకుని జేబులో పెట్టుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆయనను విజయవాడలోని ఏసీబీ కోర్టుకు తరలించనున్నారు.
పోర్టు కార్యాలయంలో అవినీతి లంగరు
కాగా నిత్యం రూ.కోట్లలో లావాదేవీలు జరిగే యాంకరేజ్ పోర్టులో అవినీతి నిత్యకృత్యమే. ఇక్కడి అధికారులు ప్రతి పనికీ సొమ్ములు డిమాండ్ చేయడం రివాజుగా మారింది. ఐదేళ్ల క్రితం ఇదే విధంగా క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు లంచం అడిగిన పోర్టు అధికారి కృష్ణ మోహన్ ఏసీబీకి చిక్కిన సంగతి తెలిసింది. అయినప్పటికీ పోర్టు అధికారులు, సిబ్బందిలో ఏ మాత్రం మార్పు రావడం లేదని కార్యాలయంతో లావాదేవీలు సాగించే బోట్లు, బార్జిలు, ఓడలు, ఇతర కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. పోర్టు కార్యాలయ అధికారులు, ఉద్యోగుల చేయి తడపనిదే ఏ ఫైలూ కదలడం లేదంటూ గగ్గోలు పెడుతున్నారు.
హెచ్‌సీఎస్ సత్యం రూ. పది వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు సోమవారం చిక్కడమే ఇందుకు నిదర్శనమంటున్నారు. ప్రతి పనికీ డబ్బు డిమాండ్ చేస్తున్న ఆయనపై గతంలోనే ఏసీబీకి ఫిర్యాదు చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. గతంలో పోర్టు అధికారిగా పనిచేసిన ఆదినారాయణపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. మొత్తం మీద హెచ్‌సీఎస్ సత్యం ఏసీబీకి పట్టుబడడం పోర్టు కార్యాలయంలో తీవ్రకలకలం రేపింది. కాగా ఇకనైనా ఈ కార్యాలయం సిబ్బందిలో మార్పు వస్తే బాగుండునని సంబంధిత వర్గాలు ఆశిస్తున్నాయి. ఉద్యోగుల్లో ఉత్కంఠ నెలకొంది. ఏసీబీ డీఎస్పీ రమేష్, సీఐ రాజశేఖర్ తమ సిబ్బందితో కలిసి హెచ్‌సీఎస్ చాంబర్‌లో సోదాలు నిర్వహించడం చర్చనీయాంశమైంది.