పాతపట్నం:రాష్ట్రంలో టీడీపీ అధికారం చేపట్టిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాకు అనేక సార్లు వచ్చి వెళ్లారు తప్ప జిల్లాకు ఓరిగేది ఏమీ లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. శనివారం పాతపట్నంలో ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ స్థాయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ధర్మాన మాట్లాడారు. రైతులను, డ్వాక్రా మహిళలను, నిరుద్యోగులను, ఉద్యోగస్తులను, ఒప్పంద ఉద్యోగులను ఇలా అనేక వర్గాల ప్రజలను మోసగిస్తూ చంద్రబాబు పబ్బం గడుపుకుంటున్నారని దుయ్యబట్టారు.
విదేశాల పర్యటనలకు కోట్లు ఖర్చు
అధికారంలోనికి వచ్చిన వెంటనే రైతు, డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని హామీలు గుప్పించి, ఎనిమిది నెలలుగా కాలక్షేపన చేస్తున్నారని ఆరోపించారు. బాబు సింగపూర్, జపాన్ వంటి విదేశాల పర్యటనకు వెళ్లి కోట్లు ఖర్చుచేస్తున్నారని, ఆ డబ్బుతో డ్వాక్రా మహిళల అప్పులు తీరిపోతాయని చెప్పారు. జిల్లాలో ఒక మంత్రి, ప్రభుత్వ విప్, ఎంపీ, ఏడుగురు శాసన సభ్యులు ఉన్నప్పటికీ ఒక మంచి పనిచేశారా? అని ప్రశ్నించారు. వంశధార, తోటపల్లి, ఆఫ్‌షార్ ప్రాజెక్టులు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని, వీటి కోసం ఒక్క పైసా తెచ్చుకోలేని దౌర్భాగ్యం వీరిది అని ధర్మాన ఎద్దేవా చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తున్నారనే భయంతో కొంతైనా చేస్తున్నారని వివరించారు.
గ్రామస్థాయిలో నిలదీయాలి : రెడ్డి శాంతి
ప్రజలను మోసం చేస్తున్న పాలకులు గ్రామాలకు వస్తే నిలదీయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షరాలు రెడ్డి శాంతి అన్నారు. పాలనలో ప్రభుత్వం విఫలమైందని అందరు గ్రహించారని, ఈ సయంలో మనమంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు.
ప్రజలతో ఎన్నికైన వారిని నిర్వీర్యం చేస్తున్నారు: కృష్ణదాస్
ప్రజలు నేరుగా ఎన్నుకున్న సర్పంచ్‌లు, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులను తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్వీర్యం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాసు అన్నారు. జన్మభూమి కమిటీ చెప్పిందే చేస్తున్నారని సర్పంచ్ చెప్పినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. జన్మభూమి కమిటీని ఎవరు ఎన్నుకున్నారని ప్రశ్నించారు.
ఎవరి కోసం ఇసుక విధానం : ఎమ్మెల్యే కలమట
రాష్ట్రంలో అమలవుతున్న ఇసుక విధానం ఎవరి కోసమని పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ నిలదీశారు. ఇసుక ధరలు పెరగడంతో పాటు సుధూర ప్రాంతాల నుంచి ఇసుకను తెచ్చుకోలేక సామాన్యులు ఇళ్లు కట్టుకోవడం మానేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణ రంగం కుదేలైందని, ఎంతో కూలీలు రోడ్డున పడ్డారని వివరించారు. పాలకొండ, రాజాం ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, కంబాల జోగులు, ఎచ్చెర్ల, ఇచ్ఛాపురం, టెక్కలి నియోజకవర్గాల వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జిలు గొర్లె కిరణ్‌కుమార్, నర్తు రామారావు, దువ్వాడ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే కలమట మోహనరావు తదితరులు చంద్రబాబు పాలనలోని వైఫల్యాలను ప్రజలకు వివరించారు. అంతకు ముందు ఆస్పత్రి కూడలి వద్ద ఉన్న దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మామిడి శ్రీకాంత్, గొర్లె కృష్ణారావు, పి.బుజంగరావు, జెడ్పీటీసీ సభ్యులు పాలక ధనలక్ష్మి, బమ్మిడి ఉష, లోలుగు కృష్ణవేణి, ఎంపీపీలు ఆరిక రాజేశ్వరి, సలాన రాజేశ్వరి, పార్టీ నాయకులు సలాన మోహనరావు, అందవరపు అబ్బాయి, గేదెల జగన్మోహనరావు, కొండల అర్జునుడు, గంగు వాసు, శివ్వాల కిశోర్, కొల్ల గోవిందరావు, కొమరాపు చిరంజీవి, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
బాబూ.. జిల్లాకు ఏం చేశావ్?
Published Sun, Feb 22 2015 1:50 AM | Last Updated on Wed, Oct 3 2018 7:31 PM
Advertisement