
పసుపు, కాషాయాల మధ్య మంటలు!
- టీడీపీ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడనన్న కేంద్ర మంత్రి
- అవాక్కైన తమ్ముళ్లు.. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు
పాలకొల్లు: రాష్ట్రం, దేశంలో మిత్రపక్షాలుగా ఉన్న టీడీపీ, బీజేపీల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. సాక్షాత్తూ కేంద్ర మంత్రి సమక్షంలోనే ఇరు పార్టీల నేతలూ ఒకరిపై ఒకరు వాదులాడుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన సందర్భంగా ఆదివారం అధికార టీడీపీ దాని మిత్రపక్షం బీజేపీ మధ్య విభేదాలు బయటపడ్డాయి. వివరాలు.. పాలకొల్లు శివారులో కొత్తగా నిర్మించిన రైలు ఓవర్ బ్రిడ్జి, రహదారులను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించాలని నిర్ణయించారు. ఈ మేరకు శిలాఫలకం ఆవిష్కరణ, రోడ్డు ప్రారంభోత్సవాలకు ఏర్పాట్లు చేశారు.
ముందుగా మంత్రి సీతారామన్ పట్టణంలోని ఎమ్మెల్యే రామానాయుడు వ్యక్తిగత కార్యాలయం వద్దకు వచ్చి అల్పాహారం స్వీకరించాక సమీపంలోని టీడీపీ సమావేశ మందిరం వద్ద విలేకర్లతో సమావేశానికి ఎమ్మెల్యే ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో కార్యాలయాన్ని పూర్తిగా పసుపు జెండాలతో అలంకరించారు. అక్కడికి చేరుకున్న సీతారామన్.. టీడీపీ జెండాలు, బాబు ఫ్లెక్సీల మధ్య కూర్చుని విలేకరులతో మాట్లాడేందుకు నిరాకరించారు. ఈ ఘటనతో అవాక్కైన ఎమ్మెల్యే రామానాయుడు అసహనానికి గురయ్యారు.
ఈ నేపథ్యంలో టీడీపీకి చెందిన ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు కేంద్ర మంత్రి కార్యక్రమాన్ని బహిష్కరించాలంటూ.. బీజేపీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇది మంత్రి సీతారామన్, ఎంపీ గోకరరాజులకు కూడా తెలిసింది. ఇంతలో ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఎమ్మెల్యే రామానాయుడుతో ఫోన్లో చర్చించారు. ఈ క్రమంలో మెత్తబడ్డ రామానాయుడు కార్యక్రమానికి హాజరై.. తమను అవమానపర్చే రాజకీయాలు మంచిది కాదంటూ ఎంపీ గంగరాజుపై మండిపడ్డారు.
శిలాఫలకం ఆవిష్కరణను సీతారామన్ తిరస్కరించి.. ఎమ్మెల్యే రామానాయుడినే చేయమన్నారు. ఆయన కూడా తిరస్కరించడంతో కొద్దిసేపు వారిద్దరూ వాదించుకున్నారు. కేంద్ర మంత్రి మెట్టు దిగకపోవడంతో రామానాయుడే ఆవిష్కరించారు. అనంతరం రోడ్డు ప్రారంభోత్సవంలో రిబ్బన్ కటింగ్‌ను కేంద్ర మంత్రి కాకుండా ఎమ్మెల్యేలు రామానాయుడు, పితానిలు చేశారు. ఎమ్మెల్యే రామానాయుడు మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో తనను ఓడించడానికి పాటుపడ్డ నేతలను బీజేపీలో చేర్చుకునే యత్నం మంచిది కాదన్నారు.