సాక్షి, న్యూఢిల్లీ: పలు ఆవిష్కరణలకు ఆద్యుడిగా ప్రచారం చేసుకునే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పరిశోధనలకు పేటెంట్ హక్కులను పొందితే కేంద్ర ప్రభుత్వానికి రూ.వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. 1962 నుంచి అంతరిక్ష పరిశోధనలను ప్రోత్సహించినట్లు కాంగ్రెస్ చెబుతుండగా 2014 నుంచి తమ సహకారంతో ఇస్రో ఘన విజయాలు సాధిస్తోందని బీజేపీ పేర్కొంటోందన్నారు. అయితే వీరిద్దరూ కాకుండా అనేక వినూత్న ఆవిష్కరణలకు నాంది పలికినట్లు చెప్పుకునే మూడో వ్యక్తి కూడా ఉన్నారని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు తాను ఐటీ విప్లవం తెచ్చానని, కంప్యూటర్, సెల్‌ఫోన్‌ను కనిపెట్టానని వందలసార్లు ప్రకటించుకున్నారని తెలిపారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం విచారణ చేయాలని, అదే నిజమైతే భారత్ వాటిపై పేటెంట్ హక్కులు పొందవచ్చన్నారు. తద్వారా ఐటీ కంపెనీలు, కంప్యూటర్ల తయారీ కంపెనీలు, సెల్ ఫోన్ కంపెనీల నుంచి రూ.వేల కోట్లు రాయల్టీ కింద పొందవచ్చని వ్యాఖ్యానించారు. చంద్రయాన్ 3 విజయవంతం కావడంపై బుధవారం రాజ్యసభలో విజయసాయిరెడ్డి మాట్లాడారు.
అంతరిక్ష పరిశోధనలకు నిధుల కోత సరికాదు..
ఒక బ్లాక్ బస్టర్ సినిమా బడ్జెట్ కంటే తక్కువ ఖర్చుతో చంద్రయాన్ 3 చేపట్టి భారత కీర్తి పతాకాన్ని విశ్వవ్యాప్తంగా ఎగురవేసిన ఇస్రోకు పరిశోధనల నిమిత్తం పెద్ద ఎత్తున నిధులను కేటాయించి ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజయసాయిరెడ్డి కోరారు. భారత అంతరిక్ష కార్యక్రమాల కోసం కేవలం 2 బిలియన్ డాలర్ల బడ్జెట్ కేటాయించగా అమెరికాకు చెందిన నాసాకు 62 బిలియన్ డాలర్ల బడ్జెట్ ఉందని తెలిపారు. అంగారక గ్రహంపై పరిశోధనల కోసం ఇస్రో చేపట్టిన మంగళయాన్ మిషన్ అత్యంత తక్కువ వ్యయంతో పూర్తయిందని తెలిపారు. 2023–24 బడ్జెట్‌లో అంతరిక్ష ప్రయోగాలు, పరిశోధనలకు 8% కోత విధించడం సరికాదన్నారు.
తప్పుడు కేసులతో వేధింపులు కాంగ్రెస్‌కు అలవాటే..
వైజ్ఞానిక మేధను చెరబట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని విజయసాయిరెడ్డి విమర్శించారు. కేంద్రం, కేరళలో అధికారంలో ఉన్నప్పుడు ప్రసిద్ధ అంతరిక్ష శాస్త్రవేత్త నంబి నారాయణ్‌పై తప్పుడు కేసులు బనాయించి 50 రోజులపాటు జైలులో నిర్బంధించి తీవ్రంగా హింసించిందని గుర్తుచేశారు.
రాజకీయ ప్రత్యర్ధులనే కాకుండా శాస్త్రవేత్తలను సైతం తప్పుడు కేసులతో వేధించి హింసించడం కాంగ్రెస్‌కి వెన్నతో పెట్టిన విద్యలాంటిదన్నారు. పెరుగుతున్న అంతరిక్ష కార్యక్రమాల అవసరాలకు తగినట్లుగా మానవ వనరులను సమకూర్చుకునేందుకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్సెస్ లాంటి సంస్థలను దేశంలో మరిన్ని స్థాపించాలని సూచించారు. శాస్త్రవేత్తల వలసలను నిరోధించడానికి తగిన చర్యలు చేపట్టాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
కేంద్ర ఆర్థిక మంత్రితో ఎంపీ విజయసాయిరెడ్డి భేటీ
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు. బుధవారం ఢిల్లీలో కేంద్రమంత్రిని ఆమె కార్యాలయంలో కలిసిన విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన బకాయిల విషయంలో ఆరి్థక శాఖ చొరవ తీసుకోవాలని కోరారు. విభజన హామీలకు సంబంధించిన పెండింగ్ అంశాలపై వీరిద్దరు చర్చించినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment