
మేదరమెట్ల: అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడు ఇక తనకు పెళ్లి కాదని భావించి మనస్తాపం చెంది ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని మేదరమెట్లలో శనివారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన సాతులూరి భరత్‌కుమార్ (32) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో అతడికి పెళ్లి కాలేదు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాడుతో దూలానికి ఉరేసుకున్నాడు. పోలీసుల సమాచారం ప్రకారం భరత్‌కు కీళ్లవ్యాధి ఉంది.
పెళ్లి చేసుకునేందుకు ఎవరూ పిల్లను ఇవ్వడం లేదు. తల్లిదండ్రులు కూడా దూరంగా ఉండటంతో ఇక తనకు పెళ్లి కాదని భావించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బజారు నుంచి వచ్చిన తాత నిర్జీవంగా ఉరికి వేలాడుతున్న మనుమడిని చూసి ఇరుగు పొరుగు వారికి సమాచారం ఇచ్చాడు. సమాచారం తెలుసుకున్న మేదరమెట్ల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ పాండురంగారావు తెలిపారు.