ప్రియురాలి కళ్లెదుటే డ్రెయిన్‌లో దూకిన ప్రియుడు | Young man jump to drian infornt of his lover | Sakshi
Sakshi News home page

ప్రియురాలి కళ్లెదుటే డ్రెయిన్‌లో దూకిన ప్రియుడు

Published Fri, Aug 23 2013 4:01 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM

Young man jump to drian infornt of his lover

 భీమవరం క్రైం, న్యూస్‌లైన్ : సహజీవనం చేస్తున్న ప్రియురాలితో గొడవపడి ఆమె కళ్లెదురుగానే  డ్రెయిన్‌లో దూకిన ప్రియుడి ఉదంతమిది. అందరూ చూస్తుండగానే నీటిలో మునిగి ఆ వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ ఘటన గురువారం భీమవరంలో సంచలనం సృష్టించింది. స్థానిక బేతనీపేటకు చెందిన లోకంటి కృష్ణ (26) ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె ఉండగానే అప్పటికే భర్తతో విడాకులు తీసుకున్న సౌభాగ్య నాలుగేళ్ల క్రితం కృష్ణకు పరిచయమైంది. సౌభాగ్యకు కూడా అప్పటికే ఒక కుమార్తె ఉంది.
 
 వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. అయితే కృష్ణ ఇటీవల పనికి వెళ్లకుండా, ఇంట్లో డబ్బులు ఇవ్వకుండా మద్యానికి బానిసవ్వడంతో వీరిద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో కృష్ణ ప్రియురాలు సౌభాగ్యతో కలిసి యనమదుర్రు బ్రిడ్జిపై నుంచి నడుచుకుని వెళుతున్న సమయంలో హఠాత్తుగా డ్రెయిన్‌లోకి దూకేశాడు. ఊహించని పరిణామానికి బిత్తరపోయిన సౌభాగ్య నీటిలో కొట్టుకుంటున్న ప్రియుడిని రక్షించమని బోరున విలపించింది. చూస్తుండగానే కొద్దిదూరం వెళ్లిన తర్వాత కృష్ణ కనిపించకుండా పోయాడు.
 
 స్థానికుల సమాచారంతో భీమవరం వన్‌టౌన్ ఎస్సై విజయకుమార్ హుటాహుటిన ఘటనాస్థలం వద్దకు చేరుకున్నారు. అగ్నిమాపక అధికారులు, సిబ్బంది కూడా అక్కడకు చేరుకున్నారు. అయితే డ్రెయిన్‌లో ఊబి ఉండడం వల్ల వారు దిగడానికి సాహసించలేకపోయారు. సౌభాగ్యను వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించి వివరాలు సేకరించారు. కృష్ణకు అతడి భార్యకు ఇటీవల మనస్పర్థలు రావడంతో ఆమె తన పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయిందని, ఆమె వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. సౌభాగ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విజయకుమార్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement