- నాలుగో రోజూ అదే జోరు
- జగన్‌ను చూసేందుకు జనం పరుగులు
- జీడీనెల్లూరు నియోజకవర్గంలో ఓదార్పు, సమైక్యయాత్ర
- వైఎస్సార్ సీపీ ఉచిత మినరల్ ప్లాంట్ ప్రారంభోత్సవం
సాక్షి, చిత్తూరు: ‘మీ ఆప్యాయతను మరువ లేను, ఒక రోజు ఆలస్యంగా కార్యక్రమానికి వచ్చినా మీరు చూపిన అభిమానం, ఆప్యాయత, అనురాగానికి వందనం’ అని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం నాలు గో విడత నాలుగో రోజు ఓదార్పు, సమైక్య శంఖారావం యాత్ర జీడీ నెల్లూరు మండలంలో జరిగింది. హైదరాబాద్ నుంచి విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడ నుంచి జీడీ నెల్లూరు నియోజకవర్గ ఓదార్పు, సమైక్య శంఖారావ యాత్రను కొనసాగించారు.
జీడీ నెల్లూరు నియోజకవర్గంలో ఎస్‌ఆర్.పురం, జీడీనెల్లూరు మండలాల్లో నిర్వహించిన పర్యటనలో జనం జోరు పెరిగింది. కాన్వాయ్ వెంట పరుగులు తీసే యువకులు, ఆటోగ్రాఫ్‌ల కోసం పోటీలు పడిన విద్యార్థిని, విద్యార్థులతో ఆయన పర్యటన ప్రత్యేక ఆకర్షణగా మారింది. కొత్తపల్ల్లె మిట్టలో మహిళలు పెద్దసంఖ్యలో వైఎస్సార్ సీపీ రంగులైన పచ్చ, నీలం, తెలుపు రంగులతో తయారు చేసిన చీరలను ధరించి ఆకట్టుకున్నారు. కొటార్లపల్లెలో మిట్టపల్ల్లె పెద్దబ్బ కుటుంబాన్ని ఓదార్చారు. మధ్యాహ్నం ఎస్‌ఆర్.పురం మండలం మంగుంట గ్రామం నుంచి ఆయన సమైక్య శంఖారావ యాత్ర, ఓదార్పును ప్రారంభించారు.
మంగుంట లో వైఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రసంగిస్తూ గ్రామస్తులు పెద్దమనస్సుతో ఈ కార్యక్రమం కోసం వేచి ఉండడం వారి ఆప్యాయత, అనురాగాలకు నిదర్శనమన్నారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులతో ముచ్చటించారు. యువకులకు షేక్ హ్యాండ్ ఇచ్చి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. అక్కడ నుంచి అరిమాకులపల్లె చేరుకున్నారు. ఈ పల్లెలో మహిళలు రోడ్డుపైకి వచ్చి జగన్‌ను చూసేందుకు కాన్వాయ్ వద్దకు పరుగులు తీశారు. జగన్ కారుదిగి మహిళలను పలకరించారు.
అభిమాన నేతను చూసేందుకు యువకులు బస్టాప్ పైకి ఎక్కి నిలబడ్డారు. జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు 150 మంది తమ అభిమాన నాయకుడి ఆటోగ్రాఫ్ కోసం క్యూలో నిలబడడం కనిపించింది. అక్కడి నుంచి వడ్డిపల్లె చేరుకుని జగన్ రోడ్డుషో నిర్వహించారు. సమీపంలోని పల్లెల నుంచి కూ డా ప్రజలు గంగమ్మగుడి గ్రామం వద్దకు వచ్చి జగన్‌ను చూశారు. మహిళలు చంటి బిడ్డలను తీసుకెళ్లి జగన్ చేతికిచ్చి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అక్కడ నుంచి వడ్డిపల్లెకు చేరుకున్న జగన్‌మోహన్‌రెడ్డి రోడ్డుషోలో పాల్గొన్నారు. తన కోసం వేచి ఉన్న గ్రామస్తులకు అభివాదం చేస్తూ పలకరిం చారు. ఇక్కడ పార్టీ గ్రామ కమిటీ ఏర్పాటు చేసిన జెండాను ఆవిష్కరించారు. స్కూల్ పిల్లల్ని పలకరించారు. రోడ్డుపై ఉన్న గొర్రెలకాపరి మహిళలతో మాట్లాడారు.
పర్లాంగు దూరం గంట సమయం
కొత్తపల్ల్లెమిట్ట శివారులో నడవలేని స్థితిలో ఉన్న మునిలక్ష్మమ్మ అనే వృద్ధురాలిని కుటుంబ సభ్యులు తీసుకొచ్చి రోడ్డుపై కుర్చీలో కూర్చోబెట్టారు. ఆమెను చూసిన జగన్ వాహనం దిగివచ్చారు. అవ్వ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అమెకు పింఛన్ ఇవ్వడం లేదని కుటుంబ సభ్యులు జగన్ దృష్టికి తీసుకొచ్చారు. ఆమెకు పింఛన్ వచ్చేలా చూడాలని పార్టీ నాయకులకు సూచించారు.
ఇక్కడే మరొక వికలాంగుడు తనకు కాలు లేదని, ఆదుకోవాలని కోరాడు. త్వరలోనే సమస్యలు పరిష్కారమవుతాయని, పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంటే పార్టీ నాయకులు అధికారులతో మాట్లాడి ఇప్పిస్తారని అన్నారు. అక్కడ నుంచి కొత్తపల్ల్లెమిట్టలో మహిళలు, యువకులు పార్టీ జెండాలను ఊపుతూ ఆపేయడంతో ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ ముందు కు సాగాల్సి వచ్చింది. పర్లాంగు దూరం దాటేందుకు గంటకు పైగా సమయం పట్టింది. కాలేజీ విద్యార్థినులు జగన్ ఆటోగ్రాఫ్ తీసుకునేందుకు పోటీపడ్డారు. అందరికీ ఓపిగ్గా ఆటోగ్రాఫ్ ఇచ్చారు. పార్టీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు విజయానందరెడ్డి ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్సార్ ఉచిత మంచినీటి మినరల్ వాటర్‌ప్లాంట్‌ను ప్రారంభించారు.
కొటార్లపల్లెలో ఓదార్పు
ఎస్‌ఆర్.పురం మండలం కొటార్లపల్లెలో వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పులో పాల్గొన్నారు. గ్రామంలో మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి మరణానంతరం మృతి చెందిన మిట్టపల్ల్లె పెద్దబ్బరెడ్డి కుటుంబాన్ని ఓదార్చారు. అక్కడ నుంచి లక్ష్మీరెడ్డిగారిపల్లె చేరుకుని పెద్దసంఖ్యలో వేచి ఉన్న మహిళలను, గ్రామస్తులను పలకరించారు. నెల్లెపల్లె చిన్నమిట్టలో గ్రామస్తులు ఏర్పాటు చేసిన మహానేత డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఎట్టేరి, వీరకనెల్లూరు, మోతరంగనపల్లె, బొమ్మవారిపల్లె క్రాస్, కోటాగారం మీదుగా పల్లెపల్లెకూ కాన్వాయ్ ఆపుతూ జనాన్ని పలకరిస్తూ అభివాదం చేస్తూ చిరునవ్వుతో ముందుకు సాగారు. నెల్లేపల్లె చర్చిలో ప్రార్థనలు చేశారు. వినాయకుడి గుడిలో పూజలు చేశారు. ఎట్టేరిలో పెద్ద ఎత్తున మహిళలు స్వాగతం పలికారు. మోతరంగనపల్లె, బొమ్మావారిపల్లె క్రాసులో చలిమంట వేసుకుని మరీ జననేత కోసం వేచి ఉండడం కనిపించింది. ఎట్టేరి, మోతరంగనపల్లెలో భారీ ఎత్తున బాణసంచా కాల్చారు.
బొమ్మావారిపల్లె దాటి ముందుకు రాగానే జైన్ డ్రిప్ ఇరిగేషన్ ఫ్యాక్టరీ సమీపంలో స్థానికులు పార్టీ జెండా పట్టుకుని జగన్‌కు స్వాగతం పలికారు. జీడీ నెల్లూరు శివారు నుంచి బహిరంగ సభ వరకూ కోలాహలంగా రోడ్‌షో సాగింది. జీడీనెల్లూరు సభ ముగిసిన తర్వాత జగన్‌మోహన్‌రెడ్డి గొల్లపల్లెకు చేరుకున్నారు.
జగన్ వెంట మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా కన్వీనర్, జీడీ నెల్లూరు సమన్వయకర్త కే.నారాయణస్వామి, మాజీ ఎంపీ జ్ఞానేం ద్రరెడి,్డ చంద్రగిరి సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తిరుపతి పార్టీ కన్వీనర్ పాలగిరి ప్రతాప్‌రెడ్డి, రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, మహిళ కన్వీనర్ గాయత్రీదేవి, యువత కన్వీనర్ ఉదయ్‌కుమార్, వైఎస్సార్‌సీపీ కార్మికవర్గ విభాగం కన్వీనర్ బీరేంద్రవర్మ, పార్టీ నాయకులు వై.సురేష్, విరూపాక్ష జయచంద్రారెడ్డి పాల్గొన్నారు.