
‘నమస్తే అన్నా..’ అంటూ ఆప్యాయంగా సంభాషణ మొదలుపెట్టే అగ్గిపెట్టె మచ్చా, అవతలి వాళ్లు రెచ్చగొట్టడం, అటుపై తనదైన స్టైల్లో వాళ్లపై తిట్ల పురాణం అందుకోవడం ద్వారా ఫేమస్ అయ్యాడని తెలిసిందే. చిత్తూరుకు చెందిన కిరణ్ కుమార్ అలియాస్ అగ్గిపెట్టె మచ్చా.. ఇప్పుడు అరుదైన ఘనతను దక్కించుకున్నాడు. ప్లేస్టోర్‌లో అతని పేరిట రిలీజ్ అయిన ఓ గేమ్.. లక్షకు పైగా డౌన్లోడ్లు సాధించడం విశేషం.
ఒక మీమ్ క్యారెక్టర్.. అందునా తెలుగు మీమ్ క్యారెక్టర్ మీద వీడియో గేమ్ ఈ ఘనత సాధించడం ఇదే మొదటిసారి. ప్లే స్టోర్‌లో Game on Aggipettimacha అనే ఈ గేమ్.. ‘గేమ్ ఆన్ మీమ్’ తరపున డెవలప్ అయ్యింది. లక్షకు పైగా డౌన్ లోడ్స్, 4.4 రేటింగ్(మచ్చా ఫ్యాన్సే అయి ఉండొచ్చు) దక్కించుకోగా, 20 ఎంబీ సైజ్ ఉన్న ఈ గేమ్‌ను ఆదరిస్తుండడం విశేషం. ఇందులో కోపధారి మనిషి, జాంబీరెడ్డి, తమిళ మీమ్ క్యారెక్టర్ ఎంజీఆర్ నగర్ బిజిలీ కూడా ఉండగా.. తెలుగు నుంచి మచ్చానే టాప్ డౌన్లోడ్లతో నిలిచాడు. సాధారణంగా సెలబ్రిటీలు, సినిమాల విషయంలో ఇలాంటి గేమ్స్ ఆదరణ దక్కించుకుంటున్నప్పటికీ.. ఒక తెలుగు ఇంటర్నెట్ సెలబ్రిటీ, అది కూడా మచ్చా ఖాతాలో ఈ ఘనత చేరడం విశేషం.
చిరు సాయం
కాగా, మానసిక స్థితి సరిగా లేని కిరణ్ అలియాస్ అగ్గిపెట్టె మచ్చా.. తన చేష్టలతో అవతలివాళ్లకు హాస్యాన్ని పంచుతున్న విషయం తెలిసిందే. అయితే అతన్ని క్యాష్ చేసుకోవాలని యూట్యూబ్ ఛానెల్స్, కొన్ని టీవీ ఛానెల్స్ కూడా అతన్ని జనాల ముందుకు తీసుకొచ్చాయి. అయినప్పటికీ ఎంతో కొంత ఆర్థిక సాయం ద్వారా అతను ఊరట చెందుతుండగా.. మరోవైపు తనదైన చేష్టలతో, ఇంటర్వ్యూలతో పాపులారిటీ పెంచుకుంటున్నాడు. ఇక ఈ గేమ్ నిర్వాహకులు కూడా మచ్చాకు ఎంతో కొంత సాయం చేయడం మంచిదేమోనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
కొన్ని మార్చండి
మచ్చాకి ఉన్న ఫేమ్‌తో ఈ గేమ్ బాగుందని కొందరు అంటున్నప్పటికీ.. సాంకేతికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఫ్రెండ్లీ ఫీచర్లను ఇంకా డెవలప్ చేయాల్సి ఉందని రివ్యూలు ఇస్తున్నారు. ఇక ఈ గేమ్‌లో నమస్తే అన్నా.. అంటూ మొదలుపెట్టే మచ్చా, తన స్టైల్ పాట పాడడం, ‘ఎగిరి తంతా’.., ‘పోతే పోయిందని గానీ యెధవ ప్రాణం’ లాంటి డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. లెవెల్స్‌ను పెంచడంతో పాటు ఖతర్ పాప లాంటి కొన్ని మీమ్ క్యారెక్టర్లను కూడా ఇంట్రడ్యూస్ చేసి అప్డేట్ చేయాలని పలువురు రివ్యూల ద్వారా రిక్వెస్ట్ చేస్తుండడం విశేషం.
చదవండి: సుఖం కోసం కష్టమెందుకు!
Comments
Please login to add a commentAdd a comment