రావుల ఆరోపణలు నిరూపించు: అవినాష్ రెడ్డి
రాష్ట్రంలోని తన బ్యాంకు ఖాతాలోకి విదేశాల నుంచి నిధులు భారీగా వచ్చి చేరాయంటూ టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి చేసిన ఆరోపణలను కడప లోక్సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి ఖండించారు. తనపై రావుల నిరాధారమైన ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. ఆదివారం కడపలో వైఎస్ అవినాష్ రెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... రావుల చంద్రశేఖర్ రెడ్డి చెప్పిన మూడు దేశాలలో తనకు రెండు దేశాల వీసానే లేదని తెలిపారు. సింగపూర్కు కూడా ఒక్కసారి మాత్రమే వెళ్లానని వివరించారు. తనకు అసలు విదేశాలలో బ్యాంక్ అకౌంట్లే లేవన్నారు. టీడీపీ ఆఫీసులో రాసిచ్చిన స్క్రిప్ట్ను రావుల చంద్రశేఖర రెడ్డి చదివారే కానీ... అసలు వాస్తవాలు తెలుసుకోలేదని వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపించారు.
సింగపూర్ నుంచి తనకు ఆంధ్రప్రదేశ్లోని ఏ బ్యాంక్ అకౌంట్కు నగదు బదిలీ అయిందో చెప్పాలని ఈ సందర్బంగా రావుల చంద్రశేఖరరెడ్డిని ఆయన డిమాండ్ చేశారు. అన్యాయంగా తమపై బురద జల్లి... ఆ తర్వాత కడుక్కోమనడం సమంజసం కాదన్నారు. తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని రావుల చంద్రశేఖరరెడ్డిని వైఎస్ అవినాశ్ రెడ్డి డిమాండ్ చేశారు. లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రావులని వైఎస్ అవినాష్ రెడ్డి హెచ్చరించారు. కడప లోక్సభ స్థానం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన వైఎస్ అవినాష్ రెడ్డి బ్యాంకు ఖాతాలలోకి విదేశాల నుంచి రూ.100 కోట్లు వచ్చాయని రావుల చంద్రశేఖరరెడ్డి శనివారం ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్ అవినాష్ రెడ్డి ఆదివారం స్పందించారు.