సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.విగ్రహాలే లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వం పావులు కదుపుతోందా!... కోర్టు తీర్పు, నిబంధనల అమలుపేరుతో ఇందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందా!... జీవీఎంసీ పరిధిలో అధికార యంత్రాంగం నడుపుతున్న తతంగం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. ఈ అంశంపై జీవీఎంసీ అధికారులు స్పందిం చేందుకు నిరాకరిస్తుండటం సందేహాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.
నోటీసులే.. నోటీసులే : అనుమతిలేని విగ్రహాలను తొలగించాలని జీవీఎంసీ అధికారులు రెండు రోజులుగా నోటీసులు జారీ చేస్తున్నారు. ప్రభుత్వ ప్రదేశాలలో అనధికారికంగా ఉన్న విగ్రహాలకు ఈ నోటీసులు జారీ చేస్తున్నామని జీవీఎంసీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. జీవీఎంసీ పరిధిలో 109 విగ్రహాలలో 99 విగ్రహాలు అనధికారికంగా ఉన్నాయని గుర్తించారు. ఆ విగ్రహాలన్నింటికీ నోటీసులు జారీ చేసినట్లు చెబుతున్నారు. ఇలా భీమిలి నియోజకవర్గ పరిధిలోని మధురవాడ, కొమ్మాది పరిధిలోని నాలుగు చోట్ల నెలకొల్పిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాల తొలగింపునకు నోటీసులు జారీ చేశారు. వాటిని ఏర్పాటు చేసిన నిర్వాహకుల ఇళ్లకు వెళ్లి నోటీసులు అందిస్తున్నారు.
ఆ విగ్రహాలను తొలగించాలని స్పష్టం చేశారు. లేకపోతే తామే తొలగించి ఆ వ్యయాన్ని నిర్వాహకుల నుంచి రాబడతామనితేల్చిచెప్పారు. అనకాపల్లిలో ఉన్న 28 విగ్రహాలలో 25 విగ్రహాల తొలగింపునకు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇవ్వని మూడు విగ్రహాలు జవహర్‌లాల్ నెహ్రూ, అంబేద్కర్, ఎన్టీ రామారావులది. మిగిలిన అన్ని విగ్రహాలకు నోటీసులు ఇచ్చారు. వాటిలో అత్యధికంగా వై.ఎస్.రాజశేఖరరెడ్డివే కా వడం గమనార్హం.త్వరలోనే జీవీఎంసీ పరిధిలోని మిగిలిన ప్రాంతాల్లో ఉన్న విగ్రహాలకు కూడా నోటీసులు ఇచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. తదనంతరం జిల్లాలోని విగ్రహాలపై కూడా అధికారులు గురిపెట్టనున్నారు.
పారదర్శకత ఏదీ!: న్యాయస్థానం తీర్పును అమలు చేయడాన్ని ఎవరూ తప్పుబట్టరు. కానీ ఆ పేరుతో ప్రభుత్వం సాగిస్తున్న వ్యవహారంలో పారదర్శకత లోపించడమే సందేహాలకు తావిస్తోంది. కేవలం వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాలను తొలగించడమే లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. అంతగా పారదర్శకంగా చేయదలచుకుంటే జీవీఎంసీ అధికారులే తొలగించాల్సిన విగ్రహాల జాబితాను అధికారికంగా ప్రకటించేవారు. అసలు ఏ విగ్రహాలకు నోటీసులు ఇచ్చారనే విషయాన్ని వెల్లడించేవారు. దాంతో ఏ నేతల విగ్రహాలు జాబితాలో ఉన్నాయనే విషయం అందరికీ తెలిసేది.
కానీ అధికారులు అలా చేయలేదు. అంతా గోప్యంగా చేస్తుండటంతోనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉదాహరణకు కొమ్మాది జంక్షన్‌లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహం ఏర్పాటుకు అప్పట్లో జీవీఎంసీ మేయర్, కలెక్టర్లకు దరఖాస్తు చేశారు. అప్పటి ప్రజాప్రతినిధులే ఈ మేరకు అధికారులతో మాట్లాడారు. కానీ ఆ విగ్రహాన్ని తొలగిస్తామని ప్రస్తుతం జీవీఎంసీ అధికారులు నోటీసులు జారీ చేయడంతో నిర్వాహకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అనకాపల్లిలో కూడా అధికారుల వ్యవహార శైలి అలాగే ఉంది. విగ్రహాల తొలగింపు అంశంపై స్పందించేందుకు అధికారులు విముఖత చూపుతుండటం జీవీఎంసీ తీరుపై సందేహాలు బలపడుతున్నాయి.
వైఎస్ విగ్రహాలే లక్ష్యమా..?
Published Tue, Mar 31 2015 3:14 AM | Last Updated on Sat, Jul 7 2018 3:19 PM
Advertisement