
సాక్షి, కమలాపురం : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడోరోజు ప్రజాసంకల్పయాత్ర ముగిసింది. ఇవాళ 16.2 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఆయన బుధవారం రాత్రి ఉరుటూరులో ఏర్పాటు చేసిన శిబిరం వద్ద యాత్రను ముగించారు. ఈరోజు ఉదయం 8.40 గంటలకు వైఎస్ జగన్ మూడో రోజు 'ప్రజాసంకల్పయాత్ర'ను నేలతిమ్మాయిపల్లి నుంచి ప్రారంభించారు. జననేత వెంట నడిచేందుకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారందరినీ పలకరిస్తూ ఆయన ముందుకు సాగారు. నేలతిమ్మాయిపల్లిలో జెండాను వైఎస్ జగన్ ఆవిష్కరించారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు.
మార్గమధ్యలో రామిరెడ్డిపల్లె గ్రామస్థులు ఆయనను కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వారికి జగన్ హామీయిచ్చారు. అక్కడి నుంచి పాలగిరి జంక్షన్‌కు చేరుకున్నారు. తర్వాత వీఎన్ పల్లికి వచ్చారు. అనంతరం వీఎన్‌పల్లి సంగమేశ్వరాలయం జంక్షన్‌లో భారీగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి వైఎస్ జగన్ మాట్లాడారు. పాదయాత్రలో భాగంగా ఆయనను వివిధ వర్గాల ప్రజలు కలిసి తమ సమస్యలను విన్నవిస్తున్నారు. బ్రాహ్మణసంఘం నేతలు వైఎస్ జగన్‌ను కలిసి వినతిపత్రం అందించారు. భోజన విరామం అనంతరం మరలా యాత్రను ప్రారంభించారు.
పాదయాత్రలో భాగంగా గంగిరెడ్డిపల్లి చేరుకున్న జగన్ వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేశారు. ఈ కార్యక్రమంలో గంగిరెడ్డిపల్లి గ్రామస్తులు భారీగా పాల్గొన్నారు. అంతకుముందు అదే గ్రామంలోని సాయిబాబా మందిరాన్ని జగన్ దర్శించుకుని, ఆశీర్వాదం తీసుకున్నారు. అయ్యవారిపల్లి మీదగా ఉరుటూరు చేరుకున్నారు. కాగా సోమవారం వైఎస్సార్ జిల్లాలో ఇడుపులపాయ నుంచి పాదయాత్ర మొదలు పెట్టిన వైఎస్ జగన్ మొదటి రోజు 10 కిలోమీటర్లు, రెండో రోజు 12.8, మూడోరోజు 16.2 కిలోమీటర్లు నడిచారు. ఇక నాలుగోరోజు అయిన గురువారం వైఎస్ జగన్ జమ్మలమడుగు నియోజకవర్గంలో యాత్ర కొనసాగించనున్నారు.