
సాక్షి, కమలాపురం : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర రెండోరోజు ముగిసింది. తొలిరోజు 8.9 కిలోమీటర్లు యాత్ర చేసిన ఆయన ఇవాళ (మంగళవారం) 12.6 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఈ రోజు ఉదయం ఇడుపులపాయ వేంపల్లి రోడ్డు వద్ద రెండోరోజు పాదయాత్రను జగన్ ప్రారంభించారు. రాజన్న తనయుడికి తమ కష్టాలకు చెప్పుకునేందుకు జనాలు పోటెత్తారు. ప్రతిపక్షనేత అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ.. వారి కష్టాలను అడిగి తెలుసుకుంటూ ఓపిగ్గా ముందుకు సాగారు. తనకోసం తరలివచ్చిన ప్రతి ఒక్కరినీ పలకరించాకే ముందడుగు వేశారు.
మధ్యాహ్న భోజన విరామం దాటిపోయినా.. జనం కోసం జగన్ యాత్రను కొనసాగించారు. శ్రీనివాస కళ్యాణ మండపంలో రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులు, విద్యార్థులు, యువత తమ సమస్యలను ఆయనకు విన్నవించారు. అనంతరం వైఎస్ జగన్ పత్తిచేలను పరిశీలించారు. నేరుగా రైతులతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాగా వేంపల్లి పట్టణంలో ఏడున్నర గంటలపాటు యాత్ర చేపట్టిన వైఎస్ జగన్.. పులివెందుల దాటి కమలాపురం నియోజకవర్గంలోకి ప్రవేశించారు. ఓబుల్‌రెడ్డిపల్లి జంక్షన్ దాటుకుని నేలతిమ్మాయపల్లి గ్రామ సమీపంలో 2వరోజు పాదయాత్రను ముగించారు.
మరోవైపు రేపు (బుధవారం) మూడోరోజు 16.2 కిలోమీటర్ల మేర వైఎస్ జగన్ పాదయాత్ర చేయనున్నారు.నీలితిమ్మయపల్లి నుంచి వీఎన్ పల్లి, సంగాలపల్లి, గంగిరెడ్డిపల్లి, అయ్యవారిపల్లి మీదగా ఉరుటూరు వరకూ యాత్ర చేయనున్నారు.