ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కల సాకారం | YS Jagan Cabinet approval for RTC merger in government | Sakshi
Sakshi News home page

రైట్‌.. రైట్‌.. 

Published Thu, Sep 5 2019 4:26 AM | Last Updated on Thu, Sep 5 2019 11:53 AM

YS Jagan Cabinet approval for RTC merger in government - Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వంలో ఏపీఎస్‌ ఆర్టీసీ విలీనానికి రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో 52,813 మంది ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కల సాకారం కానుంది. బుధవారం సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్‌ ఆర్టీసీ ఉద్యోగులను రీ డిజిగ్నేట్‌ చేయాలన్న మాజీ ఐపీఎస్‌ అధికారి ఆంజనేయరెడ్డి కమిటీ సిఫార్సులను ఆమోదించడంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దీంతో ఇకపై ఆర్టీసీలోని ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తారు. వీరంతా కొత్తగా ఏర్పాటయ్యే ప్రజా రవాణా శాఖ కిందకు వస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే అన్ని సౌకర్యాలు, నియమ నిబంధనలు ప్రజా రవాణా శాఖలో విలీనం తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకు వర్తిస్తాయి. 

ఈ ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలని రవాణా, ఆర్థిక, న్యాయ, సాధారణ పరిపాలన శాఖలను సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. కొనసాగనున్న సర్వీస్‌ రూల్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ నేతృత్వంలో ప్రజా రవాణా శాఖ పని చేయనుంది. ఆర్టీసీకి వీసీ అండ్‌ ఎండీ ఎక్స్‌ అఫీషియోగా కొనసాగుతారు.  ఆర్టీసీలో ఈడీలు అడిషనల్‌ డైరెక్టర్లుగా, రీజనల్‌ మేనేజర్లు జాయింట్‌ డైరెక్టర్లుగా, డివిజనల్‌ మేనేజర్లు డిప్యూటీ డైరెక్టర్లుగా, డిపో మేనేజర్లు అసిస్టెంట్‌ డైరెక్టర్లుగా రీ డిజిగ్నేట్‌ కానున్నారు. ప్రజా రవాణా శాఖ ఏర్పాటయ్యాక ఓ తీర్మానం చేస్తారు. ఆర్టీసీ ఆస్తులను, సంస్థను ప్రజా రవాణా శాఖకు బదిలీ చేస్తూ ఈ తీర్మానం ఉంటుంది. ఈ శాఖలో సర్వీస్‌ రూల్స్, రెగ్యులేషన్స్‌ అన్నీ కొనసాగుతాయి. ప్రస్తుతం ఉన్న ఇంటెన్సివ్‌లు, పే స్కేళ్లలో ఎలాంటి నష్టం లేకుండా కొనసాగుతాయి. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచుతారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే వీఆర్‌ఎస్‌ ఆప్షన్‌ వర్తిస్తుంది. ప్రస్తుతం ఆర్టీసీ ఉద్యోగులు తమ పీఎఫ్‌ ఖాతాలను పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌)లో ఉంచాలా? లేక నోషన్‌ పెన్షన్‌ స్కీంలో ఉంచాలా? అనేది వారి ఇష్టానికి వదిలేస్తారు.   

ఆంజనేయరెడ్డి కమిటీ నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు 
– విభజన తర్వాత కూడా ఏపీఎస్‌ఆర్టీసీ మంచి పనితీరు కనపరుస్తోంది. ప్రమాణాలను అందుకుంటోంది.  
– 108 మేజర్, 311 మైనర్‌ బస్‌ స్టేషన్ల ద్వారా 12,027 బస్సులను నడుపుతోంది. 
– మొత్తం 14,123 గ్రామాలకు బస్సులు నడుస్తున్నాయి. 
– రోడ్డు ప్రమాదాల రేటు కూడా ఆర్టీసీలో చాలా తక్కువ. లక్ష కిలోమీటర్ల దూరంలో ప్రమాదాలు 0.08 శాతం మాత్రమే. 
– ప్రతి పది వేల కిలోమీటర్లకు బ్రేక్‌ డౌన్స్‌ రేటు 0.04 శాతం 
– ప్రస్తుతం ఆక్యుపెన్సీ రేటు 78 శాతం 
– ప్రతి రోజూ 43.02 లక్షల కిలోమీటర్ల మేర సర్వీసులు తిప్పుతూ 62 లక్షల మంది ప్రయాణికుల్ని వారి గమ్యస్థానాలకు చేరుస్తోంది.  
– ప్రతి రోజూ నిర్వహణ ఆదాయం రూ.15 కోట్లు. 
– దేశంలోని ఇతర రవాణా సంస్థల కన్నా ఏపీఎస్‌ ఆర్టీసీ మంచి ప్రమాణాలు సాధిస్తోంది. 
– ప్రస్తుతం ప్రతి కిలోమీటరుకు అవుతున్న ఖర్చు రూ.44.72.. ఆదాయం రూ.38.19 
– 2019 జూన్‌ 30 నాటికి ఆర్టీసీపై అప్పులు ఇతరత్రా భారం రూ.6,639 కోట్లు 
– ప్రతి నెలా ఆర్టీసీకి వాటిల్లుతున్న నష్టం రూ.100 కోట్లు 
– డీజిల్‌ ధర నాలుగేళ్లలో రూ.49 నుంచి రూ.71కి పెరిగింది. ప్రతి ఏటా డీజిల్‌పై భారం రూ.660 కోట్లు 
– ఇప్పుడున్న బస్సుల స్థానంలో దశల వారీగా విద్యుత్‌ బస్సులు ప్రవేశపెట్టాలి. 

చంద్రబాబు ఆర్టీసీ విలీనం కుదరదన్నారు   
ఆర్టీసీలో ఓ పెద్ద యూనియన్‌ గతంలో చంద్రబాబును పిలిచి సత్కరించి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయండని కోరితే అస్సలు కుదరదన్నారని రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. అయితే పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సీఎం వైఎస్‌ జగన్‌ తన వంద రోజుల పాలనలోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారన్నారు. బుధవారం ఆయన వెలగపూడిలోని సచివాలయంలో కేబినెట్‌ నిర్ణయాలను మీడియాకు వివరించారు. బస్‌ చార్జీలపై స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన నియంత్రణ కమిటీని ఏర్పాటు చేసేందుకు కేబినెట్‌ ఆమోదించిందన్నారు. ఈ విలీనం ద్వారా రూ.3,300 కోట్ల ఆర్టీసీ ఆర్థిక భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు.

సీఎంగా వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారం చేసే సమయానికి ఎంత మంది కాంట్రాక్టు కార్మికులు సంస్థలో పని చేస్తున్నారో.. వారంతా ప్రజా రవాణా శాఖలో కాంట్రాక్టు కార్మికులుగా కొనసాగుతారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం తాత్కాలిక రాజధాని నిర్మాణ భవనాలను రూ.6 వేల కోట్లతో నారాయణ కళాశాలల హాస్టల్స్‌ మాదిరిగా కట్టిందని, అసెంబ్లీలో బాత్రూమ్‌ కోసం పై అంతస్తుకు వెళ్లాల్సి వస్తోందన్నారు. రూ.4 వేల కోట్లకు 8.5 శాతం వడ్డీ, రూ. 2 వేల కోట్లకు 10.50 శాతం వడ్డీ చెల్లించాలని, ప్రతి ఏడాది రూ.570 కోట్ల వడ్డీ తమ ప్రభుత్వం కట్టాల్సి వస్తుందన్నారు. తాత్కాలిక నిర్మాణాలే కదా.. ఆ తర్వాత నారాయణ కళాశాలల హాస్టల్స్‌కు వాడుకోవచ్చన్న ఉద్దేశంతోనే చంద్రబాబు తాత్కాలిక రాజధాని నిర్మాణం చేపట్టినట్లు ఉందని మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. గతంలో ఎన్నడూ, ఏ ప్రభుత్వం చేయలేని విధంగా మూడు నెలల్లో 1.30 లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం జగన్‌కు దక్కుతుందన్నారు. ‘చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం అంటారు.. గడచిన ఐదేళ్లలో మెగా డీఎస్సీ, పవర్‌ స్టార్‌ డీఎస్సీలని ఊదరగొట్టారు? ఏమైనా చేశారా?’ అని ప్రశ్నించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement