public transport services
-
దరి చేర్చని దారి!.. గ్రేటర్లో 80లక్షలు దాటిపోయిన వాహనాల సంఖ్య
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ మెట్రోరైల్‌స్టేషన్‌కు 2 కిలోమీటర్ల దూరంలో సుమారు 1500కుపైగా కాలనీలు ఉంటాయి. ఆ కాలనీల నుంచి ప్రతి రోజూ వేలాది మంది నగరంలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారు. కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే మెట్రో ఉన్నా వినియోగించుకొనే పరిస్థితి లేదు. దానికి కారణం ఫస్ట్‌మైల్, లాస్ట్‌మైల్ కనెక్టివిటీ సరిగా లేకపోవడమే. అంటే కాలనీ నుంచి మెట్రో స్టేషన్‌కు.. రైలు దిగాక మెట్రోస్టేషన్ నుంచి ఆఫీసుకో, మరేదైనా చోటికో వెళ్లడానికి సరైన ప్రజా రవాణా సదుపాయాలు లేకపోవడమే. మెట్రోలో అయితే త్వరగా వెళ్లగలిగినా.. ఇంటి నుంచి స్టేషన్‌కు, స్టేషన్ నుంచి ఆఫీసుకు వెళ్లడానికి ఆటో ఎక్కితే ఖర్చు అడ్డగోలుగా పెరిగిపోతోంది. దీంతో జనం సొంత వాహనాలతో రోడ్డెక్కుతున్నారు. ఇది నగరంలో భారీగా ట్రాఫిక్, పొల్యూషన్ పెరిగిపోవడానికి కారణమవుతోంది.ఉదాహరణకు..: ఉప్పల్ సమీపంలోని కాలనీ వ్యక్తి రాయదుర్గంలోని ఆఫీసుకు వెళ్లాలంటే.. కాలనీ నుంచి మెట్రోస్టేషన్‌కు వెళ్లేందుకు రూ.75 నుంచి రూ.100 చార్జీతో ఆటోలో ప్రయాణించాలి. అక్కడి నుంచి మెట్రోలో రాయదుర్గం వరకు రూ.55 చార్జీ ఉంటుంది. రైలు దిగి ఆఫీసుకు చేరేందుకు మరో రూ.50 వెచ్చించాలి. తిరిగి ఇంటికి వెళ్లడానికి మళ్లీ ఖర్చు తప్పదు. ఉప్పల్ మెట్రోస్టేషన్‌కు ఫస్ట్‌మైల్, లాస్ట్‌మైల్ కనెక్టివిటీ లేకపోవడం వల్ల వచి్చన దుస్థితి ఇది. ఒక్క ఉప్పల్ మెట్రోస్టేషన్ మాత్రమే కాదు. మూడు మెట్రో కారిడార్లలోని అన్ని మెట్రో స్టేషన్లు, ప్రధాన రైల్వేస్టేషన్లు, బస్స్టేషన్లు, ఎంఎంటీఎస్ స్టేషన్లకు సరైన కనెక్టివిటీ లేకపోవడం వల్ల ప్రయాణం భారంగా మారుతోంది. దీంతో నగరవాసులు సొంత వాహనాల వినియోగానికే మొగ్గుచూపుతున్నారు.సవాల్‌గా మారిన సమన్వయం..గ్రేటర్లో మొదటి నుంచీ ప్రజారవాణా సదుపాయాల మధ్య సమన్వయం లేదు. సిటీబస్సులు, ఎంఎంటీఎస్ రైళ్లు, మెట్రో రైళ్ల సేవలు ఇప్పటికీ విడివిడిగానే ఉన్నాయి. 2017లో మెట్రో సేవలను ప్రారంభించినప్పుడు అన్ని స్టేషన్లకు చేరేందుకు బస్సులను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు. చుట్టుపక్కల కాలనీలకు చెందిన ప్రయాణికులను స్టేషన్లకు చేరవేసేందుకు ఆర్టీసీ మినీ బస్సులను ప్రతిపాదించింది. ఫీడర్ చానళ్లను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. కానీ ఇప్పటివరకు అవేవీ అమల్లోకి రాలేదు. గతంలో ఎంఎంటీఎస్ స్టేషన్లకు అనుసంధానంగా ప్రత్యేకంగా సిటీబస్సులను ప్రవేశపెట్టినా ఎంతో కాలం కొనసాగలేదు. దీంతో ఫస్ట్‌మైల్, లాస్ట్‌మైల్ కనెక్టివిటీ సమస్య అలాగే ఉండిపోయింది.మెట్రోకు అనుసంధానం లేక..నాగోల్–రాయదుర్గం, ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్ మధ్య ప్రస్తుతం ప్రతిరోజూ 5 లక్షల మంది మెట్రో రైళ్లలో ప్రయాణం చేస్తున్నారు. రోజుకు 1,000 ట్రిప్పులకుపైగా మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. కానీ ఫస్ట్‌మైల్, లాస్ట్‌మైల్ కనెక్టివిటీ లేక ఇంకా లక్షలాదిమంది మెట్రోకు దూరంగానే ఉంటున్నారు. మెట్రోస్టేషన్‌కు కనీసం 5 కిలోమీటర్ల పరిధిలో ఫీడర్ చానల్స్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన పూర్తిగా అటకెక్కింది.ఓలా, ఉబర్, ర్యాపిడో,యారీ వంటి యాప్ ఆధారిత క్యాబ్‌లు, ఆటోలు మినహాయిస్తే మెట్రోస్టేషన్ల నుంచి ఫస్ట్‌మైల్, లాస్ట్‌మైల్ కనెక్టివిటీ చాలా తక్కువ. 16 ఆర్టీసీ సైబర్ లైనర్ బస్సులు, 135 మెట్రో సువిధ (12 సీట్లవి) వాహనాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. హైటెక్‌సిటీ, రాయదుర్గం స్టేషన్ల నుంచి ఐటీ కారిడార్‌లోని ప్రాంతాలకు వెళ్లే సైబర్ లైనర్లు, సువిధ వాహనాలకు డిమాండ్ ఉంది.జనాభా పెరుగుతున్నా.. సదుపాయాలు అంతే! గ్రేటర్ హైదరాబాద్ జనాభా సుమారు 2 కోట్లకు చేరువైంది. ఏటా లక్షలాది మంది నగరానికి వచ్చి స్థిరపడుతున్నారు. అన్ని వైపులా పెద్ద సంఖ్యలో కొత్త కాలనీలు ఏర్పడుతున్నాయి. కానీ ఇందుకు తగినట్టుగా ప్రజారవాణా సదుపాయాలు పెరగడం లేదు. బెంగళూరు వంటి నగరాల్లో సుమారు 6,000 బస్సులు అందుబాటులో ఉంటే.. గ్రేటర్ హైదరాబాద్‌లో 2,550 బస్సులే ఉన్నాయి. ఇక 70 ఎంఎంటీఎస్ సర్వీసులు మాత్రమే నడుస్తున్నాయి. నగర అవసరాల మేరకు మరో 100 ఎంఎంటీఎస్ రైళ్లను నడపాల్సి ఉంది. మెట్రో రైళ్లు కూడా మూడు కోచ్‌లతోనే నడుస్తున్నాయి. అన్ని సర్వీసులు కిటకిటలాడుతున్నాయి.‘వాహన విస్ఫోటనం’!హైదరాబాద్ నగరంలో వాహన విస్ఫోటనం ఆందోళన కలిగిస్తోంది. ఏటా 2 లక్షలకు పైగా కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. ప్రస్తుతం వాహనాల సంఖ్య 80 లక్షలకుపైనే ఉంది. వీటిలో 70 శాతానికిపైగా వ్యక్తిగత వాహనాలే కావడం గమనార్హం.కోవిడ్ అనంతరం 2022 నుంచి ఫస్ట్‌మైల్, లాస్ట్‌మైల్ కనెక్టివిటీ అవసరం బాగా పెరిగింది. మొదట 15 రూట్లలో ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టారు. ప్రస్తుతం 58 స్టేషన్లకు విస్తరించినట్లు అధికారులు చెప్తున్నారు. మెట్రో రైడ్ ఆఫ్ ఇండియా (ఎంఆర్ఐ), ఈవీ ఆటోలు నడుపుతున్నట్టు పేర్కొంటున్నారు. కానీ ఫస్ట్‌మైల్, లాస్ట్‌మైల్ కనెక్టివిటీ సదుపాయం ఉన్న మెట్రో స్టేషన్లు చాలా తక్కువ. కనెక్టివిటీ పెరిగితే మరో 5 లక్షల మందికిపైగా మెట్రోలో ప్రయాణం చేసేందుకు అవకాశం ఉంది.నగరంలో ప్రతి కిలోమీటర్‌కు 1,732 ద్విచక్రవాహనాలు, మరో 1,000 కార్లు ప్రయాణిస్తున్నాయి. అన్ని మార్గాల్లో కలిపి ఒకే సమయంలో సుమారు 55,000 బైకులు, మరో 30,000 కార్లు వెళ్తున్నాయి. రవాణా నిపుణుల అంచనా మేరకు రోడ్లపై వాహనాల సంఖ్య 25,000 దాటితే అత్యధిక వాహన సాంద్రత ఉన్నట్లుగా పరిగణించాలి. సొంత బండితోనూ.. తప్పని కష్టాలుమెట్రోలు, ఎంఎంటీఎస్లలో ప్రయాణించలేక.. చాలా మంది సొంత కారు, ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. దీనితో వాహనాల రద్దీ భారీగా పెరిగిపోతోంది. గంటల తరబడి రోడ్లపైనే ఉండాల్సి వస్తోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో మెట్రోలో నాగోల్ నుంచి రాయదుర్గం చేరుకొనేందుకు 45 నిమిషాల సమయం పడితే.. బైక్ జర్నీకి గంటన్నర, కారులో అయితే 2 గంటలకుపైగా సమయం పడుతుంది. పైగా మానసిక ఒత్తిడి, పొల్యూషన్ సమస్య. ముంబైలో కనెక్టివిటి బాగుండటంతో.. ఎక్కువ దూరం ప్రయాణించేవారిలో చాలా మంది రైళ్లలోనే వెళ్తారు.కామన్ మొబిలిటీ టికెట్ ప్రవేశపెట్టాలి ప్రజారవాణా సదుపాయాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకొనేలా ప్రభుత్వం ప్రోత్సహించాలి. నేషనల్ కామన్ మొబిలిటీ టికెట్ (ఎన్‌సీఎంటీ)ను ప్రవేశపెట్టాలి. సిటీ బస్సులు, మెట్రో, ఎంఎంటీఎస్, క్యాబ్‌లు, ఆటోలు, బైక్ ట్యాక్సీలు తదితర అన్ని రవాణా సదుపాయాలను ఒకే కార్డుతో వినియోగించుకొనే అవకాశం ఉండాలి. దాని వల్ల ప్రయాణికులు ఒక రవాణా సదుపాయం నుంచి మరో రవాణా సదుపాయానికి ఈజీగా మారుతారు. ప్రస్తుతం మెట్రో కనెక్టివిటీ లేని ఎల్బీనగర్– నాగోల్ వంటి రూట్లలో ఆర్టీసీ ఉచిత బస్సులను ప్రవేశపెడితే ప్రయాణికులకు ఎంతో సదుపాయంగా ఉంటుంది. – మురళి వరదరాజన్, ఎల్అండ్టీ మెట్రో చీఫ్ స్ట్రాటజీ అధికారి రవాణా అవసరాలు తేల్చేందుకు ఇంటింటి సర్వే.. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రజారవాణా అవసరాలపై హుమ్టా సంస్థ ప్రత్యేక అధ్యయనం చేపట్టింది. లీ అసోసియేషన్ ద్వారా ఈనెల 18 నుంచి ఇంటింటి సర్వే నిర్వహించనున్నాం. ప్రతి ఇంటి రవాణా అవసరాలు, వినియోగిస్తున్న వాహనాలపై ఈ అధ్యయనం ఉంటుంది. అలాగే ఏయే ప్రాంతాల్లో ఏ విధమైన ట్రాఫిక్ రద్దీ ఉత్పన్నమవుతోందనేది కూడా పరిశీలిస్తాం. లీ అసోసియేషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా ఏ ప్రాంతంలో ఏ రకమైన రవాణా సదుపాయాలను అభివృద్ధి చేయాల్సి ఉందనేదానిపై స్పష్టత వస్తుంది. తదనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. 3 నెలల్లో లీ అసోసియేషన్ నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. – జీవన్‌బాబు, హుమ్టా ఎండీ ప్రజా రవాణా విస్తరించకపోవడం వల్లే.. ప్రజారవాణా విస్తరించకపోవడం వల్ల కూడా సొంత వాహనాల వినియోగం పెరిగింది. బ్యాంకుల నుంచి తేలిగ్గా రుణాలు లభించడం, వడ్డీరేట్లు తక్కువగా ఉండటం వల్ల కూడా వాహనాల కొనుగోళ్లు పెరిగాయి. సొంత కారు, సొంత బైక్ సిటీ కల్చర్‌లో ఒక భాగంగా మారింది. ఒకప్పుడు సైకిళ్ల నగరంగా పేరొందిన హైదరాబాద్ ఇప్పుడు బైక్‌ల నగరంగా మారింది. – ఎం.చంద్రశేఖర్‌గౌడ్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, రంగారెడ్డి -
Delhi Air pollution: ఉదయం నడక మానండి.. టపాసులు కాల్చకండి..
న్యూఢిల్లీ: ఉదయం నడక మానండి..టపాసులు కాల్చకండి..ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకోండి.. వాయు కాలుష్యం కొనసాగుతున్న వేళ దేశ రాజధాని వాసులకు ఢిల్లీ ఆరోగ్య శాఖ జారీ చేసిన సూచనలివి. శనివారం అన్ని ప్రధాన వార్తాపత్రికల్లో ఈ మేరకు సూచనలు ప్రచురించింది. ఇక కాలుష్యంతో రెండు వారాలుగా ఇబ్బంది పడుతున్న జనానికి వర్షం ఊరట ఇచ్చింది. దేశ రాజధాని ప్రాంతంలో గురువారం వాయు నాణ్యత ఇండెక్స్(ఏక్యూఐ) 437 కాగా, శనివారం ఉదయం ఏక్యూఐ 219కి పడిపోయింది. -
APSRTC: ఆర్టీసీ జనతా గ్యారేజ్‌లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజా రవాణా విభాగం డిపోలు త్వరలో ‘జనతా గ్యారేజ్’లుగా మారి.. ఆర్టీసీతో పాటు ప్రైవేటు వాహనాలకు కూడా సర్వీసింగ్ సేవలందించనున్నాయి. ఆదాయ వనరులను పెంపొందించుకునే ప్రణాళికలో భాగంగా జనతా గ్యారేజ్ విధానానికి ఆర్టీసీ రూపకల్పన చేసింది. రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా ఉన్న మౌలిక వసతులను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక స్వయం సమృద్ధి సాధించేందుకు ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో దాదాపు 1.50 కోట్ల వాహనాలుండగా.. వాటిలో సుమారు 17 లక్షల వరకు ప్రైవేటు వాణిజ్య వాహనాలే ఉన్నాయి. వాటి యజమానులు ప్రస్తుతం ప్రైవేటు సెంటర్లలో తమ వాహనాలకు సర్వీసింగ్ చేయిస్తున్నారు. ఈ భారీ ‘సర్వీసింగ్’ మార్కెట్లోకి ఇప్పుడు ఆర్టీసీ కూడా జనతా గ్యారేజ్‌ల ద్వారా ప్రవేశించబోతోంది. నిపుణుల కమిటీ సూచనల మేరకు కార్యాచరణ చేపట్టింది. మూడు దశల్లో 12 డిపోల్లో.. జనతా గ్యారేజ్ విధానాన్ని మూడు దశల్లో 12 డిపోల్లో ప్రవేశపెట్టాలని ఆర్టీసీ నిర్ణయించింది. మొదటి దశలో విజయనగరం, విజయవాడ, నెల్లూరు, కడప డిపోల్లో ప్రైవేటు వాహనాలకు సర్వీసింగ్ సేవలందిస్తారు. ఈ డిపోల్లో ఇప్పటికే ఆర్టీసీ బస్సు టైర్ల రీట్రేడింగ్ యూనిట్లున్నాయి. వీటి ద్వారా ప్రైవేటు వాహనాల టైర్లను కూడా రీట్రేడింగ్ చేసే సేవలను ప్రవేశపెడతారు. వాహనాల సాధారణ సర్వీసింగ్, అన్ని రకాల రిపేర్లు, బాడీ పెయింటింగ్, వాటర్ సర్వీసింగ్ తదితర సేవలను అందుబాటులోకి తెస్తారు. ఇందుకోసం అవసరమైన అదనపు యంత్ర పరికరాలను కొనుగోలు చేయనున్నారు. ఇప్పటికే ఆర్టీసీ టెక్నికల్ స్టాఫ్‌కు శిక్షణ కార్యక్రమం కూడా పూర్తయ్యింది. ఇతర సేవల కోసం అవుట్ సోర్సింగ్ విధానంలో సిబ్బందిని నియమించాలని భావిస్తున్నారు. అవకతవకలకు ఆస్కారం లేకుండా ఆర్టీసీ వాహనాల స్పేర్ పార్టులు, ప్రైవేటు వాహనాల స్పేర్ పార్టులకు వేర్వేరుగా స్టోర్ రూమ్‌లు, రికార్డులు నిర్వహిస్తారు. తొలి దశలో భారీ వాహనాలకు సర్వీసింగ్ సేవలందిస్తారు. అనంతరం కార్లు, ఎస్‌యూవీలు, ఇతర వాహనాలకు సర్వీసింగ్ సేవలందుబాటులోకి వస్తాయి. రాష్ట్రంలో ఐటీఐ, ఆటోమొబైల్ డిప్లొమా విద్యార్థులకు అప్రెంటీస్ విధానాన్ని మరింత విస్తృతంగా అందుబాటులోకి తెచ్చేందుకు ఈ డిపోలు ఉపయోగపడతాయి. రెండో దశలో విశాఖ, కాకినాడ, రాజమహేంద్రవరం, గుంటూరు, తిరుపతి డిపోల్లో, మూడో దశలో శ్రీకాకుళం, అనంతపురం, కర్నూలు డిపోల్లో జనతా గ్యారేజ్ విధానాన్ని ప్రవేశపెడతారు. మూడు నెలల్లో జనతా గ్యారేజ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీసీ కృషి చేస్తోంది. -
బస్సెక్కం.. బస్కీలు తీయం!
సాక్షి, హైదరాబాద్ : ‘చుక్‌చుక్ రైలూ వస్తోంది.. దూరం దూరం జరగండీ..’ చిన్నప్పుడు పాడుకున్న ఈ పాట గుర్తుంది కదా! కొంచెం అటూఇటూగా ఇప్పుడు సీన్ అలాగే ఉంది. కరోనా భయంతో బస్సు, రైలు ప్రయాణాలంటేనే ‘దూరం.. దూరం’అంటున్నారు జనం. ఇప్పట్లో ప్రజా రవాణా అవసరంలేదని తేల్చేస్తున్నారు. ఇక, జిమ్, స్విమ్మింగ్‌పూల్, హోటల్, హాలీడే స్పాట్లంటారా?.. అటుపక్కకే వెళ్లబోమన్నారు. ‘లోకల్ సర్కిల్స్’అనే సంస్థ ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా 241 జిల్లాల నుంచి 24 వేల మందికిపైగా అభిప్రాయాలను సామాజిక మాధ్యమాల ద్వారా సేకరించింది. ఇందులో 68% పురుషులు, 32% మహిళలు ఉన్నారు. 49% మంది మెట్రో, 36% ద్వితీయ శ్రేణి నగరాలు, 15 శాతం 3, 4వ శ్రేణి పట్టణాల ప్రజల నాడి తెలుసుకుంది. -
త్వరలో ప్రజా రవాణాకు పచ్చజెండా
న్యూఢిల్లీ: దేశంలో ప్రజా రవాణా వ్వవస్థలో కార్యకలాపాలను త్వరలోనే పున:ప్రారంభించనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పా రు. ఆయన బుధవారం ‘బస్సు, కార్ ఆపరేటర్స్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడా రు. ప్రజారవాణాను ప్రారంభించే విష యంలో భౌతిక దూరం పాటించడం, ఫేసు మాస్కులు, శానిటైజర్లు వాడడం వంటి నిబంధనలతో మార్గదర్శకాలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఆపరేటర్లు ఈ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుందన్నారు. గ్లోబల్ మార్కెట్లో పాగా వేయండి కరోనా వల్ల తలెత్తిన విపత్తును అవకాశంగా మార్చుకోవాలని ప్రజా రవాణా రంగంలోని పెట్టుబడిదారులకు గడ్కరీ సూచించారు. గ్లోబల్ మార్కెట్లో పాగా వేయడంపై దృష్టి పెట్టాలన్నారు. కరోనాపై, దిగజారుతున్న ఆర్థిక పరిస్థితిపై భారత్ తప్పనిసరిగా విజయం సాధిస్తుందన్నారు. ప్రభుత్వ పెట్టుబడి స్వల్పంగా, ప్రైవేట్ వ్యయం అధికంగా ఉండే లండన్ తరహా ప్రజా రవాణాను మన దేశంలోనూ ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. హైవే ప్రాజెక్టుల పనులను పున:ప్రారంభించడంపై ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. -
రైలు ప్రయాణాలు ఇప్పట్లో వద్దు
సాక్షి, హైదరాబాద్: మే మొదటి వారం నాటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడం ప్రారంభిస్తే లాక్డౌన్ ఎత్తేసే అవకాశముంది. దేశవ్యాప్తంగా కేంద్రం విధించిన లాక్డౌన్ మే 3వ తేదీతో పూర్తి కానుంది, తెలంగాణలో మాత్రం 7 వరకు కొనసాగుతుంది. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే లాక్డౌన్ వచ్చే నెల మొదటి వారంతో ముగుస్తుంది. ఒకవేళ అలాగే జరిగినా కూడా వెంటనే రైళ్లు పట్టాలెక్కే పరిస్థితి కనిపించట్లేదు. లాక్డౌన్ ముగిసినా రైళ్లు నడిపేందుకు రైల్వే బోర్డు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. కరోనా మన దేశంలో ప్రారంభమైన కొత్తలో, ఆ వైరస్ విస్తరించేందుకు వాహకంగా రైళ్లు పనిచేశాయన్న విషయం తెలిసిందే. మన రాష్ట్రంలో కూడా ఇదే జరిగింది. ఇండోనేసియా నుంచి కరీంనగర్‌కు వచ్చి స్థానికంగా వైరస్ అంటించిన ఇండోనేసియా బృందం ఢిల్లీ నుంచి వచ్చింది కూడా రైళ్లలోనే.. ఇప్పుడు వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టినా వెంటనే రైళ్లను నడిపితే పరిస్థితి మళ్లీ అదుపు తప్పే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే విషయాన్ని రైల్వే బోర్డు కూడా పేర్కొంటున్నట్లు సమాచారం. ఒకేసారి లక్షలుగా స్టేషన్లకు వచ్చే ప్రయాణికుల్లో కరోనా పాజిటివ్ వ్యక్తులను గుర్తించటం కష్టమని, వారు బోగీల్లోకి చేరితే, రైలు గమ్యస్థానానికి చేరుకునే లోపు వారి ద్వారా చాలామందికి వైరస్ సోకే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. దీన్ని నియంత్రించే వ్యవస్థ తమకు లేదని రైల్వే దాదాపు చేతులెత్తేసింది. కేంద్రం కూడా దీన్ని తీవ్రంగానే పరిగణిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య శరవేగంగా విస్తరిస్తున్నందున వెంటనే రైళ్లు నడపొద్దని రైల్వే బోర్డు దాదాపు నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే ప్రస్తుతం ఆన్లైన్ రిజర్వేషన్లను రద్దు చేసింది. చదవండి: సడలింపుల పర్వం! తొలి విడత లాక్డౌన్ ప్రకటించినప్పుడు, స్టేషన్ బుకింగ్స్ రద్దు చేసినా.. ఆన్లైన్లో రిజర్వేషన్లను కొనసాగించింది. లాక్డౌన్ ముగిసిన రోజు అర్ధరాత్రి నుంచి రైళ్లకు బుకింగ్స్ తెరిచి ఉంచింది. కానీ, రెండో విడత లాక్‌డౌన్‌ను ప్రకటించిన తర్వాత మాత్రం రూటు మార్చింది. అప్పటికే పరిస్థితి కొంత అదుపు తప్పేలా ఉండటంతో ముందుజాగ్రత్తగా ఆన్లైన్ రిజర్వేషన్లను రద్దు చేసింది. వచ్చే నెల మూడో తేదీతో కేంద్రం ప్రకటించిన లాక్డౌన్ గడువు పూర్తవుతుంది. అంటే అదే రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత రైళ్లు ప్రారంభం కావాల్సి ఉంటుంది. కానీ మూడో తేదీ తర్వాత రైళ్లకు సంబంధించి ఆన్లైన్ రిజర్వేషన్ రద్దు చేయడంతో లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవేళ పొడిగించకుండా, ఆంక్షలతో అమలు చేసినా.. రైళ్లు మాత్రం నడిచే అవకాశం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పట్లో ప్రజా రవాణానే వద్దు.. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి కొంత సానుకూలంగా మారి జనం రోడ్లపైకి వచ్చేందుకు ఆంక్షలతో కూడిన అనుమతి వచ్చినా.. ప్రజా రవాణాను మాత్రం ఎట్టి పరిస్థితిలో అనుమతించొద్దని నిపుణులు కేంద్రం దృష్టికి తెచ్చారు. రైళ్లతో పాటు బస్సులను కూడా నడపొద్దని పేర్కొంటున్నారు. లక్షల మంది జనం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లటం ఇప్పట్లో మంచిది కాదని పేర్కొంటున్నారు. మహారాష్ట్ర, రాజస్తాన్, గుజరాత్, ఢిల్లీతో పాటు తెలంగాణ, ఏపీ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున, ఈ రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాల ప్రజలు తమ స్వస్థలాలకు వెళ్తారని, అప్పుడు కొత్త ప్రాంతాలకు కరోనా విస్తరించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. లాక్డౌన్ ఎత్తేసినా, రాష్ట్రాల సరిహద్దులను తెరిచే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతంలోనే ఉండేలా చూడాలని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజా రవాణా విషయంలో ఆచీతూచీ వ్యవహరించే అవకాశం ఉంది. తెలంగాణ ఆర్టీసీ కూడా బస్సులను నడిపే అవకాశం లేదని సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సూర్యాపేట, భువనగిరి లాంటి ప్రాంతాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. మిగతా ప్రాంతాల్లో వాటి సంఖ్య తక్కువగా ఉండటంతో పాటు సిద్దిపేట లాంటి ప్రాంతాల్లో అసలు లేవు. బస్సులు మొదలైతే, పాజిటివ్ కేసులు లేని ప్రాంతాలను సురక్షితంగా భావించి.. ఆయా ప్రాంతాలకు కేసులెక్కువ ఉన్న ప్రాంతాల నుంచి జనం రాకపోకలు సాగిస్తే కొత్త ప్రాంతాలకు కరోనా విస్తరించే ప్రమాదం ఉందని ఆర్టీసీ కూడా భావిస్తోంది. ఈ విషయంలో ఇప్పటి వరకు ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోకున్నా.. బస్సులు నడపకపోవటమే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. లాక్డౌన్ ముగిసే మే ఏడో తేదీ నాటికి కొత్త కేసుల సంఖ్య తగ్గినా, వైరస్ పూర్తిగా పోయినట్లు కాదు. దీంతో బస్సులు నడిపితే పరిస్థితి చేయిదాటి పోయే ప్రమాదం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. -
భారత్‌లో నాలుగో మరణం
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మృతుల సంఖ్య నాలుగుకి చేరింది. పంజాబ్‌కు చెందిన ఒక వ్యక్తి గురువారం కోవిడ్‌తో మృతి చెందాడు. ఆ వ్యక్తి వృద్ధుడని, అతడికి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనా వైరస్ సోకినవారి సంఖ్య భారత్‌లో గురువారానికి 173కి చేరింది. ఇందులో 20కి పైగా కేసులు కొత్తగా నిర్ధారణ అయినవే. ఛత్తీస్‌గఢ్, చండీగఢ్‌ల్లో గురువారం తొలి కేసులు నమోదయ్యాయి. మార్చి 22 నుంచి వారం రోజుల పాటు అన్ని అంతర్జాతీయ విమానాలు భారత్‌లో దిగవద్దని కేంద్రం నిషేధం విధించింది. అత్యవసరంకాని సేవల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసుకునే వెసులుబాటు కల్పించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కోరింది. ప్రజా రవాణా బంద్ పలు రాష్ట్రాలు దాదాపు లాక్డౌన్ స్థాయిలో ఆంక్షలు విధించాయి. కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ప్రజా రవాణాను నిషేధించారు. పంజాబ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌పై నిషేధం విధించింది. రెస్టారెంట్లు, హోటళ్లు, ఫంక్షన్ హాళ్లను మూసేయాలని ఆదేశించింది. హోం డెలివరీ, టేక్ అవే సర్వీసులకు మాత్రం మినహాయింపునిచ్చింది. 20కి మించిన సంఖ్యలో ప్రజలు గుమికూడదని స్పష్టం చేసింది. ఢిల్లీ ప్రభుత్వం కూడా రెస్టారెంట్లు మూసేయాలని ఆదేశించింది. అత్యవసరంకాని విధులను వాయిదా వేసుకోవాలని అన్ని ప్రభుత్వ, స్వతంత్ర సంస్థలకు, పీఎస్‌యూలకు విజ్ఞప్తి చేసింది. అత్యవసరం కాని ప్రభుత్వ సేవలను కూడా శుక్రవారం నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఢిల్లీలోని ప్రముఖ సుందర్ నగర్ మార్కెట్‌ను కూడా మూసేయాలని వ్యాపారులు నిర్ణయించారు. ముంబైలోని ప్రముఖ భోజన సరఫరాదారులైన ‘డబ్బావాలాలు’ కూడా తమ సేవలను శుక్రవారం నుంచి మార్చి 31 వరకు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. భారత్‌లో కరోనా వైరస్ సోకిన 173 మందిలో 25 మంది విదేశీయులు ఉన్నారు. గురువారం నాటికి మహారాష్ట్రలో 45, కేరళలో 27, హరియాణాలో 17, కర్ణాటకలో 14, రాజస్తాన్‌లో 7, లద్దాఖ్‌లో 8 కేసులు నమోదయ్యాయి. పలు ఇతర రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ నుంచి రక్షణ పొందేందుకుగాను ప్రజలు రోజూ కనీసం 15 నిమిషాలపాటు ఎండలో గడపాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అశ్విని కుమార్ చౌబే సూచించారు. సూర్య రశ్మి ద్వారా శరీరానికి కావాల్సినంత విటమిన్ డీ లభిస్తుందని, తద్వారా శరీరరోగ నిరోధక శక్తి పెరిగి కరోనా వంటి వైరస్‌లను నిరోధించే అవకాశాలు పెరుగుతాయని అన్నారు. -
ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కల సాకారం
సాక్షి, అమరావతి: ప్రభుత్వంలో ఏపీఎస్ ఆర్టీసీ విలీనానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో 52,813 మంది ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కల సాకారం కానుంది. బుధవారం సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ ఆర్టీసీ ఉద్యోగులను రీ డిజిగ్నేట్ చేయాలన్న మాజీ ఐపీఎస్ అధికారి ఆంజనేయరెడ్డి కమిటీ సిఫార్సులను ఆమోదించడంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దీంతో ఇకపై ఆర్టీసీలోని ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తారు. వీరంతా కొత్తగా ఏర్పాటయ్యే ప్రజా రవాణా శాఖ కిందకు వస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే అన్ని సౌకర్యాలు, నియమ నిబంధనలు ప్రజా రవాణా శాఖలో విలీనం తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకు వర్తిస్తాయి. ఈ ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలని రవాణా, ఆర్థిక, న్యాయ, సాధారణ పరిపాలన శాఖలను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. కొనసాగనున్న సర్వీస్ రూల్స్ డైరెక్టర్ జనరల్ నేతృత్వంలో ప్రజా రవాణా శాఖ పని చేయనుంది. ఆర్టీసీకి వీసీ అండ్ ఎండీ ఎక్స్ అఫీషియోగా కొనసాగుతారు. ఆర్టీసీలో ఈడీలు అడిషనల్ డైరెక్టర్లుగా, రీజనల్ మేనేజర్లు జాయింట్ డైరెక్టర్లుగా, డివిజనల్ మేనేజర్లు డిప్యూటీ డైరెక్టర్లుగా, డిపో మేనేజర్లు అసిస్టెంట్ డైరెక్టర్లుగా రీ డిజిగ్నేట్ కానున్నారు. ప్రజా రవాణా శాఖ ఏర్పాటయ్యాక ఓ తీర్మానం చేస్తారు. ఆర్టీసీ ఆస్తులను, సంస్థను ప్రజా రవాణా శాఖకు బదిలీ చేస్తూ ఈ తీర్మానం ఉంటుంది. ఈ శాఖలో సర్వీస్ రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ కొనసాగుతాయి. ప్రస్తుతం ఉన్న ఇంటెన్సివ్లు, పే స్కేళ్లలో ఎలాంటి నష్టం లేకుండా కొనసాగుతాయి. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచుతారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే వీఆర్ఎస్ ఆప్షన్ వర్తిస్తుంది. ప్రస్తుతం ఆర్టీసీ ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాలను పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)లో ఉంచాలా? లేక నోషన్ పెన్షన్ స్కీంలో ఉంచాలా? అనేది వారి ఇష్టానికి వదిలేస్తారు. ఆంజనేయరెడ్డి కమిటీ నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు – విభజన తర్వాత కూడా ఏపీఎస్ఆర్టీసీ మంచి పనితీరు కనపరుస్తోంది. ప్రమాణాలను అందుకుంటోంది. – 108 మేజర్, 311 మైనర్ బస్ స్టేషన్ల ద్వారా 12,027 బస్సులను నడుపుతోంది. – మొత్తం 14,123 గ్రామాలకు బస్సులు నడుస్తున్నాయి. – రోడ్డు ప్రమాదాల రేటు కూడా ఆర్టీసీలో చాలా తక్కువ. లక్ష కిలోమీటర్ల దూరంలో ప్రమాదాలు 0.08 శాతం మాత్రమే. – ప్రతి పది వేల కిలోమీటర్లకు బ్రేక్ డౌన్స్ రేటు 0.04 శాతం – ప్రస్తుతం ఆక్యుపెన్సీ రేటు 78 శాతం – ప్రతి రోజూ 43.02 లక్షల కిలోమీటర్ల మేర సర్వీసులు తిప్పుతూ 62 లక్షల మంది ప్రయాణికుల్ని వారి గమ్యస్థానాలకు చేరుస్తోంది. – ప్రతి రోజూ నిర్వహణ ఆదాయం రూ.15 కోట్లు. – దేశంలోని ఇతర రవాణా సంస్థల కన్నా ఏపీఎస్ ఆర్టీసీ మంచి ప్రమాణాలు సాధిస్తోంది. – ప్రస్తుతం ప్రతి కిలోమీటరుకు అవుతున్న ఖర్చు రూ.44.72.. ఆదాయం రూ.38.19 – 2019 జూన్ 30 నాటికి ఆర్టీసీపై అప్పులు ఇతరత్రా భారం రూ.6,639 కోట్లు – ప్రతి నెలా ఆర్టీసీకి వాటిల్లుతున్న నష్టం రూ.100 కోట్లు – డీజిల్ ధర నాలుగేళ్లలో రూ.49 నుంచి రూ.71కి పెరిగింది. ప్రతి ఏటా డీజిల్‌పై భారం రూ.660 కోట్లు – ఇప్పుడున్న బస్సుల స్థానంలో దశల వారీగా విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టాలి. చంద్రబాబు ఆర్టీసీ విలీనం కుదరదన్నారు ఆర్టీసీలో ఓ పెద్ద యూనియన్ గతంలో చంద్రబాబును పిలిచి సత్కరించి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయండని కోరితే అస్సలు కుదరదన్నారని రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. అయితే పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సీఎం వైఎస్ జగన్ తన వంద రోజుల పాలనలోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారన్నారు. బుధవారం ఆయన వెలగపూడిలోని సచివాలయంలో కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరించారు. బస్ చార్జీలపై స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన నియంత్రణ కమిటీని ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదించిందన్నారు. ఈ విలీనం ద్వారా రూ.3,300 కోట్ల ఆర్టీసీ ఆర్థిక భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసే సమయానికి ఎంత మంది కాంట్రాక్టు కార్మికులు సంస్థలో పని చేస్తున్నారో.. వారంతా ప్రజా రవాణా శాఖలో కాంట్రాక్టు కార్మికులుగా కొనసాగుతారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం తాత్కాలిక రాజధాని నిర్మాణ భవనాలను రూ.6 వేల కోట్లతో నారాయణ కళాశాలల హాస్టల్స్ మాదిరిగా కట్టిందని, అసెంబ్లీలో బాత్రూమ్ కోసం పై అంతస్తుకు వెళ్లాల్సి వస్తోందన్నారు. రూ.4 వేల కోట్లకు 8.5 శాతం వడ్డీ, రూ. 2 వేల కోట్లకు 10.50 శాతం వడ్డీ చెల్లించాలని, ప్రతి ఏడాది రూ.570 కోట్ల వడ్డీ తమ ప్రభుత్వం కట్టాల్సి వస్తుందన్నారు. తాత్కాలిక నిర్మాణాలే కదా.. ఆ తర్వాత నారాయణ కళాశాలల హాస్టల్స్‌కు వాడుకోవచ్చన్న ఉద్దేశంతోనే చంద్రబాబు తాత్కాలిక రాజధాని నిర్మాణం చేపట్టినట్లు ఉందని మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. గతంలో ఎన్నడూ, ఏ ప్రభుత్వం చేయలేని విధంగా మూడు నెలల్లో 1.30 లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం జగన్‌కు దక్కుతుందన్నారు. ‘చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం అంటారు.. గడచిన ఐదేళ్లలో మెగా డీఎస్సీ, పవర్ స్టార్ డీఎస్సీలని ఊదరగొట్టారు? ఏమైనా చేశారా?’ అని ప్రశ్నించారు. -
ప్రజారవాణా వాహనాల్లో సీసీ కెమెరాలు
న్యూఢిల్లీ: మహిళల రక్షణ కోసం పలు చర్యలకు కేంద్రప్రభుత్వం నడుం బిగించింది. ప్రజా రవాణా వ్యవస్థలో వారికి భద్రత కల్పించే దిశగా రూ.1,405 కోట్ల పథకానికి గురువారం ఆమోదముద్ర వేసింది. ఈ పథకంలో భాగంగా ప్రజారవాణా వాహనాల్లో జీపీఎస్(గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) ఆధారిత వ్యవస్థ, క్లోజ్డ్ సర్క్యూట్) కెమెరాలు, అవాంఛనీయ ఘటన జరిగినప్పుడు పోలీసులకు సమాచారం అందించేలా అలారం బటన్లను ఏర్పాటు చేస్తారు. వాహనాల ప్రయాణ మార్గాలను పర్యవేక్షిస్తారు. పదిలక్షల జనాభా దాటిన 53 నగరాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తారు. మొదటిదశలో 32 నగరాల్లోని ప్రజా రవాణా వాహనాల్లో పై చర్యలు చేపడ్తారు. జాతీయ స్థాయిలో ‘నేషనల్ వెహికల్ సెక్యూరిటీ అండ్ ట్రాకింగ్ సిస్టమ్’గా, రాష్ట్ర స్థాయిలో ‘సిటీ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్’గా వ్యవస్థలను ఏర్పాటు చేసి, నిధులు సమకూర్చిన రెండు సంవత్సరాల్లోగా ఈ పథకం కార్యరూపం దాలుస్తుందని కేబినెట్ భేటీ అనంతరం ఆర్థికమంత్రి పి.చిదంబరం వెల్లడించారు. ఈ వ్యవస్థ ఆధారంగా ప్రయాణాల సందర్భంగా ఆపదలో ఉన్న మహిళ ఉన్న ప్రాంతాన్ని అతి తక్కువ సమయంలో చేరుకుని, వారికి సాయం అందించడానికి వీలవుతుందన్నారు. మహిళల రక్షణ ‘నిర్భయ నిధి’ని ఏర్పాటు చేసిన తరువాత ప్రభుత్వ ఆమోదం పొందిన మొదటి పథకం ఇదే కావడం విశేషం. అన్ని మొబైల్ ఫోన్లలో తప్పకుండా ‘ప్యానిక్ బటన్(ప్రమాద సమయంలో పోలీసులు, ఇతర సంబంధీకులను అప్రమత్తం చేసే బటన్)’ ఉండాలన్న ప్రతిపాదనకు కూడా సూత్రప్రాయంగా ఆమోదం తెలిపామన్నారు. ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) దీనితో పాటు పలు ఇతర అంశాలపై నిర్ణయాలు తీసుకుంది. అవి.. 58 నూతన వైద్య కళాశాలల ఏర్పాటుకు ఆమోదం: కేంద్ర ఆర్థిక సాయంతో రాష్ట్రాల్లో ఈ కాలేజీలను ఏర్పాటుచేస్తారు. ఇందులో భాగంగా పలు జిల్లా ఆసుపత్రులను బోధనాసుపత్రులుగా మారుస్తారు. వీటిలో ప్రతి కాలేజీలో 100 ఎంబీబీఎస్ సీట్లు ఉంటాయి. దీనికి సంబంధించిన నిధుల్లో కేంద్రం వాటా రూ. 8,457 కోట్లు కాగా, రాష్ట్రాలు రూ. 2,513 కోట్లు సమకూర్చాల్సి ఉంటుంది. ఒక్కో కాలేజీ ఏర్పాటుకు రూ. 189 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 381 మెడికల్ కాలేజీల్లో ఇప్పటివరకు దాదాపు 50 వేల ఎంబీబీఎస్ సీట్లు ఉండగా, ఈ నిర్ణయం కార్యరూపం దాల్చిన తరువాత ఆ సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఐఎల్డీపీకి ఆమోదం: 12వ పంచవర్ష ప్రణాళిక కాలం(2012-17)లో దేశంలో తోలు పరిశ్రమ అభివృద్ధి కోసం రూ. 990 కోట్లతో ‘ఇండియన్ లెదర్ డెవలప్మెంట్ ప్రొగ్రామ్’ను అమలు చేస్తారు. ఈ పథకం కింద దాదాపు 2 లక్షల మందికి శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పిస్తారు. భారీ ఓడరేవులకు సంబంధించిన భూముల నిర్వహణకు సంబంధించిన విధాన మార్గదర్శకాలకు కూడా సీసీఈఏ ఆమోదం తెలిపింది. వీటివల్ల వాటి అధీనంలో ఉన్న భూములను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి వీలవుతుంది. విద్యుత్ వ్యవస్థ అభివృద్ధి నిధిని వినియోగించే ఉద్దేశంతో విద్యుత్ శాఖ పేర్కొన్న పలు ప్రతిపాదనలకు సీసీఈఏ ఆమోదం తెలిపింది. పంపిణీ వ్యవస్థను ఆధునీకరించడం ద్వారా అంతర్రాష్ట్ర పంపిణీ వ్యవస్థలో లోపాలను అధిగమించేందుకు ఆ నిధులను వినియోగిస్తారు.