సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజా రవాణా విభాగం డిపోలు త్వరలో ‘జనతా గ్యారేజ్’లుగా మారి.. ఆర్టీసీతో పాటు ప్రైవేటు వాహనాలకు కూడా సర్వీసింగ్ సేవలందించనున్నాయి. ఆదాయ వనరులను పెంపొందించుకునే ప్రణాళికలో భాగంగా జనతా గ్యారేజ్ విధానానికి ఆర్టీసీ రూపకల్పన చేసింది. రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా ఉన్న మౌలిక వసతులను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక స్వయం సమృద్ధి సాధించేందుకు ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో దాదాపు 1.50 కోట్ల వాహనాలుండగా.. వాటిలో సుమారు 17 లక్షల వరకు ప్రైవేటు వాణిజ్య వాహనాలే ఉన్నాయి. వాటి యజమానులు ప్రస్తుతం ప్రైవేటు సెంటర్లలో తమ వాహనాలకు సర్వీసింగ్ చేయిస్తున్నారు. ఈ భారీ ‘సర్వీసింగ్’ మార్కెట్‌లోకి ఇప్పుడు ఆర్టీసీ కూడా జనతా గ్యారేజ్‌ల ద్వారా ప్రవేశించబోతోంది. నిపుణుల కమిటీ సూచనల మేరకు కార్యాచరణ చేపట్టింది.
మూడు దశల్లో 12 డిపోల్లో..
జనతా గ్యారేజ్ విధానాన్ని మూడు దశల్లో 12 డిపోల్లో ప్రవేశపెట్టాలని ఆర్టీసీ నిర్ణయించింది. మొదటి దశలో విజయనగరం, విజయవాడ, నెల్లూరు, కడప డిపోల్లో ప్రైవేటు వాహనాలకు సర్వీసింగ్ సేవలందిస్తారు. ఈ డిపోల్లో ఇప్పటికే ఆర్టీసీ బస్సు టైర్ల రీట్రేడింగ్ యూనిట్లున్నాయి. వీటి ద్వారా ప్రైవేటు వాహనాల టైర్లను కూడా రీట్రేడింగ్ చేసే సేవలను ప్రవేశపెడతారు.
వాహనాల సాధారణ సర్వీసింగ్, అన్ని రకాల రిపేర్లు, బాడీ పెయింటింగ్, వాటర్ సర్వీసింగ్ తదితర సేవలను అందుబాటులోకి తెస్తారు. ఇందుకోసం అవసరమైన అదనపు యంత్ర పరికరాలను కొనుగోలు చేయనున్నారు. ఇప్పటికే ఆర్టీసీ టెక్నికల్ స్టాఫ్‌కు శిక్షణ కార్యక్రమం కూడా పూర్తయ్యింది. ఇతర సేవల కోసం అవుట్ సోర్సింగ్ విధానంలో సిబ్బందిని నియమించాలని భావిస్తున్నారు.
అవకతవకలకు ఆస్కారం లేకుండా ఆర్టీసీ వాహనాల స్పేర్ పార్టులు, ప్రైవేటు వాహనాల స్పేర్ పార్టులకు వేర్వేరుగా స్టోర్ రూమ్‌లు, రికార్డులు నిర్వహిస్తారు. తొలి దశలో భారీ వాహనాలకు సర్వీసింగ్ సేవలందిస్తారు. అనంతరం కార్లు, ఎస్‌యూవీలు, ఇతర వాహనాలకు సర్వీసింగ్ సేవలందుబాటులోకి వస్తాయి.
రాష్ట్రంలో ఐటీఐ, ఆటోమొబైల్ డిప్లొమా విద్యార్థులకు అప్రెంటీస్ విధానాన్ని మరింత విస్తృతంగా అందుబాటులోకి తెచ్చేందుకు ఈ డిపోలు ఉపయోగపడతాయి. రెండో దశలో విశాఖ, కాకినాడ, రాజమహేంద్రవరం, గుంటూరు, తిరుపతి డిపోల్లో, మూడో దశలో శ్రీకాకుళం, అనంతపురం, కర్నూలు డిపోల్లో జనతా గ్యారేజ్ విధానాన్ని ప్రవేశపెడతారు. మూడు నెలల్లో జనతా గ్యారేజ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీసీ కృషి చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment