దరి చేర్చని దారి!.. గ్రేటర్‌లో 80లక్షలు దాటిపోయిన వాహనాల సంఖ్య | Problem with lack of coordination between Metro, MMTS and Citybuses | Sakshi
Sakshi News home page

దరి చేర్చని దారి!.. గ్రేటర్‌లో 80లక్షలు దాటిపోయిన వాహనాల సంఖ్య

Published Sun, Jun 16 2024 12:52 AM | Last Updated on Sun, Jun 16 2024 12:53 AM

Problem with lack of coordination between Metro, MMTS and Citybuses

ఫస్ట్‌మైల్, లాస్ట్‌మైల్‌ రవాణా సదుపాయం లేక అవస్థలు 

మెట్రో, ఎంఎంటీఎస్, సిటీబస్సుల మధ్య సమన్వయ లేమితో సమస్య 

ప్రజారవాణాను వదిలేసి సొంత వాహనాలతో రోడ్డెక్కుతున్న జనం 

ఇప్పటికే గ్రేటర్‌లో 80లక్షలు దాటిపోయిన వాహనాల సంఖ్య 

భారీగా పెరిగిపోతున్న ట్రాఫిక్‌ రద్దీ.. కాలుష్యం

నగరంలో ప్రజా రవాణాకు కనెక్టివిటీ ‘కట్‌’కట

ఏడేళ్లుగా ఇదే తీరు

సాక్షి, హైదరాబాద్‌: ఉప్పల్‌ మెట్రోరైల్‌స్టేషన్‌కు 2 కిలోమీటర్ల దూరంలో సుమారు 1500కుపైగా కాలనీలు ఉంటాయి. ఆ కాలనీల నుంచి ప్రతి రోజూ వేలాది మంది నగరంలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారు. కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే మెట్రో ఉన్నా వినియోగించుకొనే పరిస్థితి లేదు. దానికి కారణం ఫస్ట్‌మైల్, లాస్ట్‌మైల్‌ కనెక్టివిటీ సరిగా లేకపోవడమే. అంటే కాలనీ నుంచి మెట్రో స్టేషన్‌కు.. రైలు దిగాక మెట్రోస్టేషన్‌ నుంచి ఆఫీసుకో, మరేదైనా చోటికో వెళ్లడానికి సరైన ప్రజా రవాణా సదుపాయాలు లేకపోవడమే. మెట్రోలో అయితే త్వరగా వెళ్లగలిగినా.. ఇంటి నుంచి స్టేషన్‌కు, స్టేషన్‌ నుంచి ఆఫీసుకు వెళ్లడానికి ఆటో ఎక్కితే ఖర్చు అడ్డగోలుగా పెరిగిపోతోంది. దీంతో జనం సొంత వాహనాలతో రోడ్డెక్కుతున్నారు. ఇది నగరంలో భారీగా ట్రాఫిక్, పొల్యూషన్‌ పెరిగిపోవడానికి కారణమవుతోంది.

ఉదాహరణకు..: ఉప్పల్‌ సమీపంలోని కాలనీ వ్యక్తి రాయదుర్గంలోని ఆఫీసుకు వెళ్లాలంటే.. కాలనీ నుంచి మెట్రోస్టేషన్‌కు వెళ్లేందుకు రూ.75 నుంచి రూ.100 చార్జీతో ఆటోలో ప్రయాణించాలి. అక్కడి నుంచి మెట్రోలో రాయదుర్గం వరకు రూ.55 చార్జీ ఉంటుంది. రైలు దిగి ఆఫీసుకు చేరేందుకు మరో రూ.50 వెచ్చించాలి. తిరిగి ఇంటికి వెళ్లడానికి మళ్లీ ఖర్చు తప్పదు. ఉప్పల్‌ మెట్రోస్టేషన్‌కు ఫస్ట్‌మైల్, లాస్ట్‌మైల్‌ కనెక్టివిటీ లేకపోవడం వల్ల వచి్చన దుస్థితి ఇది. ఒక్క ఉప్పల్‌ మెట్రోస్టేషన్‌ మాత్రమే కాదు. మూడు మెట్రో కారిడార్లలోని అన్ని మెట్రో స్టేషన్లు, ప్రధాన రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్లు, ఎంఎంటీఎస్‌ స్టేషన్లకు సరైన కనెక్టివిటీ లేకపోవడం వల్ల ప్రయాణం భారంగా మారుతోంది. దీంతో నగరవాసులు సొంత వాహనాల వినియోగానికే మొగ్గుచూపుతున్నారు.

సవాల్‌గా మారిన సమన్వయం..
గ్రేటర్‌లో మొదటి నుంచీ ప్రజారవాణా సదుపాయాల మధ్య సమన్వయం లేదు. సిటీబస్సులు, ఎంఎంటీఎస్‌ రైళ్లు, మెట్రో రైళ్ల సేవలు ఇప్పటికీ విడివిడిగానే ఉన్నాయి. 2017లో మెట్రో సేవలను ప్రారంభించినప్పుడు అన్ని స్టేషన్లకు చేరేందుకు బస్సులను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు. చుట్టుపక్కల కాలనీలకు చెందిన ప్రయాణికులను స్టేషన్లకు చేరవేసేందుకు ఆర్టీసీ మినీ బస్సులను ప్రతిపాదించింది. ఫీడర్‌ చానళ్లను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. కానీ ఇప్పటివరకు అవేవీ అమల్లోకి రాలేదు. గతంలో ఎంఎంటీఎస్‌ స్టేషన్లకు అనుసంధానంగా ప్రత్యేకంగా సిటీబస్సులను ప్రవేశపెట్టినా ఎంతో కాలం కొనసాగలేదు. దీంతో ఫస్ట్‌మైల్, లాస్ట్‌మైల్‌ కనెక్టివిటీ సమస్య అలాగే ఉండిపోయింది.

మెట్రోకు అనుసంధానం లేక..
నాగోల్‌–రాయదుర్గం, ఎల్‌బీనగర్‌–మియాపూర్, జేబీఎస్‌–ఎంజీబీఎస్‌ మధ్య ప్రస్తుతం ప్రతిరోజూ 5 లక్షల మంది మెట్రో రైళ్లలో ప్రయాణం చేస్తున్నారు. రోజుకు 1,000 ట్రిప్పులకుపైగా మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. కానీ ఫస్ట్‌మైల్, లాస్ట్‌మైల్‌ కనెక్టివిటీ లేక ఇంకా లక్షలాదిమంది మెట్రోకు దూరంగానే ఉంటున్నారు. మెట్రోస్టేషన్‌కు కనీసం 5 కిలోమీటర్ల పరిధిలో ఫీడర్‌ చానల్స్‌ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన పూర్తిగా అటకెక్కింది.

ఓలా, ఉబర్, ర్యాపిడో,యారీ వంటి యాప్‌ ఆధారిత క్యాబ్‌లు, ఆటోలు మినహాయిస్తే మెట్రోస్టేషన్ల నుంచి ఫస్ట్‌మైల్, లాస్ట్‌మైల్‌ కనెక్టివిటీ చాలా తక్కువ. 16 ఆర్టీసీ సైబర్‌ లైనర్‌ బస్సులు, 135 మెట్రో సువిధ (12 సీట్లవి) వాహనాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. హైటెక్‌సిటీ, రాయదుర్గం స్టేషన్ల నుంచి ఐటీ కారిడార్‌లోని ప్రాంతాలకు వెళ్లే సైబర్‌ లైనర్లు, సువిధ వాహనాలకు డిమాండ్‌ ఉంది.

జనాభా పెరుగుతున్నా.. సదుపాయాలు అంతే! 
గ్రేటర్‌ హైదరాబాద్‌ జనాభా సుమారు 2 కోట్లకు చేరువైంది. ఏటా లక్షలాది మంది నగరానికి వచ్చి స్థిరపడుతున్నారు. అన్ని వైపులా పెద్ద సంఖ్యలో కొత్త కాలనీలు ఏర్పడుతున్నాయి. కానీ ఇందుకు తగినట్టుగా ప్రజారవాణా సదుపాయాలు పెరగడం లేదు. బెంగళూరు వంటి నగరాల్లో సుమారు 6,000 బస్సులు అందుబాటులో ఉంటే.. గ్రేటర్‌ హైదరాబాద్‌లో 2,550 బస్సులే ఉన్నాయి. ఇక 70 ఎంఎంటీఎస్‌ సర్వీసులు మాత్రమే నడుస్తున్నాయి. నగర అవసరాల మేరకు మరో 100 ఎంఎంటీఎస్‌ రైళ్లను నడపాల్సి ఉంది. మెట్రో రైళ్లు కూడా మూడు కోచ్‌లతోనే నడుస్తున్నాయి. అన్ని సర్వీసులు కిటకిటలాడుతున్నాయి.

‘వాహన విస్ఫోటనం’!
హైదరాబాద్‌ నగరంలో వాహన విస్ఫోటనం ఆందోళన కలిగిస్తోంది. ఏటా 2 లక్షలకు పైగా కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. ప్రస్తుతం వాహనాల సంఖ్య 
80 లక్షలకుపైనే ఉంది. వీటిలో 70 శాతానికిపైగా వ్యక్తిగత వాహనాలే కావడం గమనార్హం.

కోవిడ్‌ అనంతరం 2022 నుంచి ఫస్ట్‌మైల్, లాస్ట్‌మైల్‌ కనెక్టివిటీ అవసరం బాగా పెరిగింది. మొదట 15 రూట్లలో ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టారు. ప్రస్తుతం 58 స్టేషన్లకు విస్తరించినట్లు అధికారులు చెప్తున్నారు. మెట్రో రైడ్‌ ఆఫ్‌ ఇండియా (ఎంఆర్‌ఐ), ఈవీ ఆటోలు నడుపుతున్నట్టు పేర్కొంటున్నారు. కానీ ఫస్ట్‌మైల్, లాస్ట్‌మైల్‌ కనెక్టివిటీ సదుపాయం ఉన్న మెట్రో స్టేషన్లు చాలా తక్కువ. కనెక్టివిటీ పెరిగితే మరో 5 లక్షల మందికిపైగా మెట్రోలో ప్రయాణం చేసేందుకు అవకాశం ఉంది.

నగరంలో ప్రతి కిలోమీటర్‌కు 1,732 ద్విచక్రవాహనాలు, మరో 1,000 కార్లు ప్రయాణిస్తున్నాయి. అన్ని మార్గాల్లో కలిపి ఒకే సమయంలో సుమారు 55,000 బైకులు, మరో 30,000 కార్లు వెళ్తున్నాయి. రవాణా నిపుణుల అంచనా మేరకు రోడ్లపై వాహనాల సంఖ్య 25,000 దాటితే అత్యధిక వాహన సాంద్రత ఉన్నట్లుగా పరిగణించాలి.  

సొంత బండితోనూ.. తప్పని కష్టాలు
మెట్రోలు, ఎంఎంటీఎస్‌లలో ప్రయాణించలేక.. చాలా మంది సొంత కారు, ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. దీనితో వాహనాల రద్దీ భారీగా పెరిగిపోతోంది. గంటల తరబడి రోడ్లపైనే ఉండాల్సి వస్తోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో మెట్రోలో నాగోల్‌ నుంచి రాయదుర్గం చేరుకొనేందుకు 45 నిమిషాల సమయం పడితే.. బైక్‌ జర్నీకి గంటన్నర, కారులో అయితే 2 గంటలకుపైగా సమయం పడుతుంది. పైగా మానసిక ఒత్తిడి, పొల్యూషన్‌ సమస్య. ముంబైలో కనెక్టివిటి బాగుండటంతో.. ఎక్కువ దూరం ప్రయాణించేవారిలో చాలా మంది రైళ్లలోనే వెళ్తారు.

కామన్‌ మొబిలిటీ టికెట్‌ ప్రవేశపెట్టాలి 
ప్రజారవాణా సదుపాయాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకొనేలా ప్రభుత్వం ప్రోత్సహించాలి. నేషనల్‌ కామన్‌ మొబిలిటీ టికెట్‌ (ఎన్‌సీఎంటీ)ను ప్రవేశపెట్టాలి. సిటీ బస్సులు, మెట్రో, ఎంఎంటీఎస్, క్యాబ్‌లు, ఆటోలు, బైక్‌ ట్యాక్సీలు తదితర అన్ని రవాణా సదుపాయాలను ఒకే కార్డుతో వినియోగించుకొనే అవకాశం ఉండాలి. దాని వల్ల ప్రయాణికులు ఒక రవాణా సదుపాయం నుంచి మరో రవాణా సదుపాయానికి ఈజీగా మారుతారు. ప్రస్తుతం మెట్రో కనెక్టివిటీ లేని ఎల్‌బీనగర్‌– నాగోల్‌ వంటి రూట్లలో ఆర్టీసీ ఉచిత బస్సులను ప్రవేశపెడితే ప్రయాణికులకు ఎంతో సదుపాయంగా ఉంటుంది. 
– మురళి వరదరాజన్, ఎల్‌అండ్‌టీ మెట్రో చీఫ్‌ స్ట్రాటజీ అధికారి 


రవాణా అవసరాలు తేల్చేందుకు ఇంటింటి సర్వే.. 
గ్రేటర్‌ హైదరాబాద్‌లో ప్రజారవాణా అవసరాలపై హుమ్టా సంస్థ ప్రత్యేక అధ్యయనం చేపట్టింది. లీ అసోసియేషన్‌ ద్వారా ఈనెల 18 నుంచి ఇంటింటి సర్వే నిర్వహించనున్నాం. ప్రతి ఇంటి రవాణా అవసరాలు, వినియోగిస్తున్న వాహనాలపై ఈ అధ్యయనం ఉంటుంది. అలాగే ఏయే ప్రాంతాల్లో ఏ విధమైన ట్రాఫిక్‌ రద్దీ ఉత్పన్నమవుతోందనేది కూడా పరిశీలిస్తాం. లీ అసోసియేషన్‌ ఇచ్చే నివేదిక ఆధారంగా ఏ ప్రాంతంలో ఏ రకమైన రవాణా సదుపాయాలను అభివృద్ధి చేయాల్సి ఉందనేదానిపై స్పష్టత వస్తుంది. తదనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. 3 నెలల్లో లీ అసోసియేషన్‌ నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. 
– జీవన్‌బాబు, హుమ్టా ఎండీ 

ప్రజా రవాణా విస్తరించకపోవడం వల్లే..  
ప్రజారవాణా విస్తరించకపోవడం వల్ల కూడా సొంత వాహనాల వినియోగం పెరిగింది. బ్యాంకుల నుంచి తేలిగ్గా రుణాలు లభించడం, వడ్డీరేట్లు తక్కువగా ఉండటం వల్ల కూడా వాహనాల కొనుగోళ్లు పెరిగాయి. సొంత కారు, సొంత బైక్‌ సిటీ కల్చర్‌లో ఒక భాగంగా మారింది. ఒకప్పుడు సైకిళ్ల నగరంగా పేరొందిన హైదరాబాద్‌ ఇప్పుడు బైక్‌ల నగరంగా మారింది. 
– ఎం.చంద్రశేఖర్‌గౌడ్, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్, రంగారెడ్డి   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement