
'మాటమీద నిలబడిన వ్యక్తి వైఎస్సార్ ఒక్కరే'
చిత్తూరు: పేదరికంతో వైద్యం అందక ఎవరూ చనిపోకూడదని ఆరోగ్యశ్రీ అనే పథకంతో వైద్యం కల్పించిన మహా నాయకుడు ఎవరైనా ఉంటే అది ఆ దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖర రెడ్డి ఒక్కరేనని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. సమైక్య శంఖారావంలో భాగంగా చంద్రగిరి సభకు హాజరైన జగన్..అశేష జనవాహినిని ఉద్దేశించి మాట్లాడారు. పేదవాడి గుండె చప్పుడు, మనసెరిగి వారి సంక్షేమం కోసం వైఎస్సార్ పాటు పడిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అక్కా, చెల్లెల్లకు కోసం వైఎస్సార్ పావలా వడ్డీకి రుణాలు ఇచ్చి ఆదుకున్నారన్నారు. విశ్వసనీయతకు, ఆప్యాయతకు మారుపేరు వైఎస్సార్ అని, మాట ఇస్తే..కష్టమైనా, నష్టమైనా ఆ మాట మీదే నిలబడేవారని జగన్ తెలిపారు.
రైతన్నల ఆత్మహత్యల గురించి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు. మద్యపాన నిషేదం చేస్తానని చెప్పిన బాబు.. అధికారం చెపట్టిన తరువాత బెల్టుషాపులు తెరిపించాడన్నారు.కాంగ్రెస్ కు డిపాజిట్ లేకుండా చేసి, ప్యాకేజీలు అడుగుతున్న బాబును తరిమికొట్టినపుడే సమైక్య వాదం గెలుస్తుందన్నారు. ఎవరైతే రాష్ట్రాన్ని సమైక్యం ఉంచుతారో వారినే ప్రధానిని చేద్దామని జగన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.