
పేదవాడి చదువు రాజశేఖరుని స్వప్నం
నెల్లూరు: పేదవాడు చదువు కోవడమనేది ఆ దివంగత నేత రాజశేఖర రెడ్డి స్వప్నమని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. సమైక్య శంఖారావంలో భాగంగా జిల్లాలోని గూడూరు సభకు హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి జగన్ మాట్లాడారు.ప్రతీ పేదవాడు ఉన్నత చదువులు చదువుకుని గొప్పవాడు కావాలని రాజశేఖర రెడ్డి ఎప్పుడూ తాపత్రాయపడేవారన్నారు. నేటి పరిస్థితులు చూస్తే బాధేస్తుందన్నారు. అసలు ప్రజల గురించి ఆలోచించే నాయకుడే లేడని జగన్ తెలిపారు.
తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో నలభై నాలుగు రోజుల పాటు చర్చ జరిగినా, చంద్రబాబు రెండు చేతుల సిద్ధాంతాన్ని పాటించారని, అసెంబ్లీలో ఒక చేతితో సీమాంధ్ర, మరో చేతితో తెలంగాణ నినాదాలు చేయించారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రాన్నికాపాడుకోవడానికి ప్రజలంతా ఒక్కటి కావాలని జగన్ పిలుపునిచ్చారు.