హోదానే మాకు ప్రధానం | YS Jagan Comments On Special Status To AP | Sakshi
Sakshi News home page

హోదానే మాకు ప్రధానం

Published Thu, Jan 17 2019 3:04 AM | Last Updated on Thu, Jan 17 2019 4:48 AM

YS Jagan Comments On Special Status To AP - Sakshi

బుధవారం లోటస్‌ పాండ్‌లో కేటీఆర్‌తో కలసి మీడియాతో మాట్లాడుతున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. చిత్రంలో ఎంపీలు వినోద్‌ కుమార్, సంతోష్‌కుమార్, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు

హైదరాబాద్‌ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి:  ఆంధ్రప్రదేశ్‌కు అత్యంత ఆవశ్యకమైన ప్రత్యేక హోదా కోసం తెలుగు ఎంపీలంతా ఏకతాటిపైకి వస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అత్యంత ముఖ్యమని, ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరగాలంటే మనకు మద్దతుగా పార్లమెంట్‌లో తెలుగు రాష్ట్రాల ఎంపీల సంఖ్యా బలం పెరగడమే మార్గమని స్పష్టం చేశారు. ఏపీకి హోదా కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. జాతీయ స్థాయిలో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటులో భాగంగా టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు తనయుడు కె.తారకరామారావు(కేటీఆర్‌) బుధవారం హైదరాబాద్‌లోని లోటస్‌ పాండ్‌లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలసి చర్చించారు. అనంతరం వైఎస్‌ జగన్, కేటీఆర్‌ సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంట్‌లో తమ అభిప్రాయాన్ని ఇప్పటికే స్పష్టంగా చెప్పామని, ఇందులో రెండో మాటకు తావులేదని ఈ సందర్భంగా కేటీఆర్‌ పేర్కొన్నారు. ఉభయ రాష్ట్రాల్లో తెలుగు వారి ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఫెడరల్‌ ఫ్రంట్‌ కృషి చేస్తుందని చెప్పారు.
 
రాష్ట్రాల హక్కులను సాధించుకుందాం...
ఈ చర్చలకు ఒక రోజు ముందు కేసీఆర్‌ మంగళవారం సంక్రాంతి నాడు వైఎస్‌ జగన్‌కు ఫోన్‌ చేసి ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుపై చర్చిద్దామని కోరారు. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం తన ఇంటికి భోజనానికి రావాల్సిందిగా జగన్‌ కోరారు. కేసీఆర్‌ సూచన మేరకు ఆయన తనయుడు కేటీఆర్, పార్టీకి చెందిన పలువురు సీనియర్‌ నేతలు లోటస్‌పాండ్‌కు వచ్చి గంటకు పైగా చర్చలు జరిపారు. జాతీయ స్థాయిలో సమాఖ్య స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ రాష్ట్రాల హక్కులను సాధించుకోవడంపై ఇద్దరు నేతల సారథ్యంలోని ప్రతినిధుల బృందం ప్రాథమికంగా సంప్రదింపులు జరిపింది. రాష్ట్రాల ప్రయోజనాలను పరిరక్షించుకోవడం, పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీల అమలు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ ప్రయత్నాల కొనసాగింపులో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ త్వరలో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి వైఎస్‌ జగన్‌ను స్వయంగా కలిసి సంప్రదింపులు జరపనున్నారు.  
 
42 మంది ఎంపీలతో కలసి ఈ అన్యాయాన్ని ఎదిరిద్దాం: వైఎస్‌ జగన్‌
‘తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుతో ఫోన్‌లో మాట్లాడిన తరువాత కేటీఆర్‌ వచ్చి ఫెడరల్‌ ఫ్రంట్‌ గురించి మాతో సంప్రదింపులు జరిపారు. రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాలు, దీనిపై గట్టిగా నిలబడాల్సిన అవసరం గురించి చర్చించారు. అన్యాయాలు జరగకూడదంటే రాష్ట్రాలన్నీ కలవాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు పంచుకున్నాం. ఉదాహరణకు మన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశం ఉంది. పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీకే దిక్కూ దివాణం లేకుండా పోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక్కో రాష్ట్రం పరిధిలో వారికి ఉన్న ఎంపీలను సంఖ్యాపరంగా చూస్తే దీన్ని అధిగమించే పరిస్థితులు ఉండవు. మన రాష్ట్రంలోని 25 మంది లోక్‌సభ ఎంపీలతో మనం ప్రత్యేక హోదా కోసం డిమాండ్‌ చేసినా పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఈ అన్యాయాన్ని ఎదిరించాలంటే ఏపీకి చెందిన ఎంపీల బలం మాత్రమే సరిపోదు. మన 25 మందికి మరో 17 మంది తెలంగాణ ఎంపీలు తోడయితే... మొత్తం 42 మంది ఒక్క తాటిపైకి వచ్చి ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయంపై స్పందించగలిగితే, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నిస్తే బాగుంటుంది.

ఈ 42 మంది ఎంపీలు ఒకేసారి మన రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ... ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి, పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి అని చెప్పగలిగితే రాష్ట్రానికి తప్పకుండా మేలు జరుగుతుంది. కాబట్టి ఇది స్వాగతించదగ్గ విషయం. రాష్ట్రాల హక్కులు నిలబడాలి, పరిరక్షించుకోవాలి అంటే సంఖ్యాపరంగా పెరగాలి. అప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అన్యాయం చేసేందుకు జంకుతుంది. ఈ దిశగా అడుగులు వేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలన్నింటితో కూడిన, కేసీఆర్‌ ప్రతిపాదించిన జాతీయ వేదిక పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ఎంపీల పరంగా ఏకమై తమకు జరుగుతున్న అన్యాయాలపై ఎలుగెత్తి చాటే పరిస్థితి రావాలి. రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా ఒక వేదికను ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ ప్రయత్నించడం హర్షించదగ్గ విషయం. కేటీఆర్‌ కూడా మా వద్దకు వచ్చి ఆ విషయాలే చెప్పారు. తరువాత కేసీఆర్‌ నాతో ఫోన్‌లో మాట్లాడారు. తదుపరి చర్చల కోసం తానే స్వయంగా వచ్చి మాట్లాడతానని చెప్పారు. ఈ నేపథ్యంలో మా పార్టీ నేతలతో కలసి చర్చించి ఎలా ముందుకు వెళ్లాలో ఆలోచిస్తాం. ఇదే అంశంపై ఇంకా నాలుగడుగులు ముందుకు వెళ్లేందుకు కృషి చేస్తాం’
 
మన ఎంపీల సంఖ్యా బలం పెరగాలి...
ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు వైఎస్‌ జగన్‌ సమాధానం ఇస్తూ ప్రస్తుతం జరిగినవి ప్రాథమిక చర్చలేనని తెలిపారు. పార్లమెంట్‌ సాక్షిగా ప్రకటించిన ప్రత్యేక హోదాను కూడా ఇచ్చే పరిస్థితులు లేవని, అందుకే పక్క రాష్ట్రమైన తెలంగాణ మనకు మద్దతునిస్తామన్నందుకు స్వాగతిస్తున్నామని జగన్‌ చెప్పారు. ‘క్రమంగా పరిణామాలు రూపుదిద్దుకునే కొద్దీ మేం మరిన్ని అంశాలపై చర్చిస్తాం. ఇక్కడ మీకు చెప్పాల్సింది ఒకటి ఉంది. పార్లమెంట్‌లో మన ఎంపీల సంఖ్యాబలం పెరగాలి. రాష్ట్రాలకు అన్యాయం జరిగే పరిస్థితుల నుంచి రాష్ట్రాలకు మేలు జరిగే పరిస్థితులు రావాలి. రాష్ట్రాల తరపున మాట్లాడగలిగే వారి సంఖ్యా బలం పెరగాల్సిన అవసరం ఉంది. ఇవాళ 25 మందితో అనుకున్నది సాధించలేని పరిస్థితి ఉన్నపుడు దాన్ని 42కు పెంచి మరింత ఎక్కువగా ఒత్తిడి చేసే పరిస్థితులు తేవాలి’అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.
 
ఫెడరల్‌ ఫ్రంట్‌కు మద్దతులో భాగంగానే: కేటీఆర్‌
‘టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఏడాదిన్నరగా దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు రావాలని కోరుకుంటున్నారు. కేంద్రం అన్ని రకాల అధికారాలను తన వద్దే పెట్టుకుని రాష్ట్రాల పట్ల నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తోంది. ఈ విధానం మారాలనే ఆలోచనతో, సమాఖ్య స్ఫూర్తితో జాతీయ స్థాయిలో కేసీఆర్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అందులో భాగంగానే పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్, కర్ణాటక సీఎం కుమారస్వామి, డీఎంకే అధినేత స్టాలిన్‌లను కలిశారు. అజిత్‌ జోగి సహా పలువురితో సంప్రదింపులు జరిపి తన ప్రయత్నానికి మద్దతునివ్వాలని కోరారు. ఆ పరంపరలో భాగంగానే మంగళవారం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఫోన్‌ చేసి కలసి మాట్లాడదామని కోరాం. మా బృందంతో ఇక్కడకు వచ్చి అన్ని విషయాలూ వారితో పంచుకున్నాం. గతంలో కేసీఆర్‌ ఎలా అయితే అన్ని రాష్ట్రాలకు వెళ్లి అక్కడి ప్రధాన రాజకీయ పార్టీల అధ్యక్షులు, ముఖ్యమంత్రులతో సంప్రదింపులు జరిపారో అదేవిధంగా త్వరలోనే ఏపీకి కూడా వెళతారు. కేసీఆర్‌ స్వయంగా వెళ్లి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశమై మిగతా అన్ని విషయాలు మాట్లాడి ఈ చర్చలను మరింత ముందుకు తీసుకెళతారు.’
 
ఏపీకి హోదాపై మా వైఖరి స్పష్టం..
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో టీఆర్‌ఎస్‌ వైఖరిని తమ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ ఇప్పటికే స్పష్టం చేశారని కేసీఆర్‌ తెలిపారు. ‘రాజ్యసభలో మా పార్టీ నేత కె.కేశవరావు, లోక్‌సభలో మా ఎంపీ కవిత, ఇంకా పలు వేదికల మీద మేమంతా చాలా స్పష్టంగా చెప్పాం. ఏపీ ప్రజలకు అప్పటి ప్రధాని ఇచ్చిన మాటను నిలబెట్టాలని చెప్పాం. కనుక ఆ విషయంలో రెండో అభిప్రాయంగానీ, ఆలోచనగానీ మాకు లేదు. కేసీఆర్‌ ఏపీకి వెళ్లి జగన్‌తో సమావేశమై మిగతా అంశాలపై మాట్లాడతారు. అన్ని విషయాలపై ఆయన స్వయంగా స్పందిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఉమ్మడిగా ఎలా పోరాడాలి అనే విషయంపై కూడా కూలంకషంగా చెబుతారు.’(ఈ సందర్భంగా విలేకరులు మరిన్ని ప్రశ్నలు అడిగేందుకు ప్రయత్నించగా.. ‘ఈరోజే ఇప్పుడే అన్నీ చెప్పేస్తే ... తరువాత మీరు అడగడానికి ఏమీ ఉండదు. మాకు కూడా చెప్పడానికి ఏమీ ఉండదు’అని కేటీఆర్‌ నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఈ రోజు ఇక ఇక్కడితో వదిలేద్దామని మీడియాను కోరారు.  
 
చర్చల్లో పాల్గొన్న నేతలు...
వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి, పార్టీ రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి, వి.ప్రభాకర్‌రెడ్డి, లోక్‌సభ మాజీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, పి.వి.మిథున్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, టీఆర్‌ఎస్‌ తరపున ఆ పార్టీ ఎంపీలు వినోద్, సంతోష్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్‌రెడ్డి తదితరులు లోటస్‌ పాండ్‌లో జరిగిన చర్చల్లో పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement