మీ పిల్లలకు మామగా అండగా ఉంటా: సీఎం జగన్‌ | YS Jagan Gives Assurance To Parents On Rajanna-Badi Bata Program | Sakshi
Sakshi News home page

చదువుల విప్లవం తీసుకొస్తా: వైఎస్‌ జగన్

Published Fri, Jun 14 2019 12:09 PM | Last Updated on Fri, Jun 14 2019 12:26 PM

YS Jagan Gives Assurance To Parents On Rajanna-Badi Bata Program  - Sakshi

సాక్షి, గుంటూరు : రాష్ట్రంలో చదువుల విప్లవం తీసుకొస్తామని, రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖల్ని మార్చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ప్రైవేట్‌ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. గుంటూరు జిల్లా పెనుమాక జెడ్పీ స్కూల్‌లో ఏర్పాటు చేసిన రాజన్న బడిబాట–సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. పాదయాత్రలో ప్రతి తల్లికి, చెల్లికి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సందర్భంగా ఇవాళ చాలా సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి అన్నారు. ‘మీ పిల్లలను బడికి పంపిస్తే చాలు..వారికి మామగా అండగా ఉంటాను’ అని భరోసా ఇచ్చారు. పిల్లలను బడికి పంపించిన తల్లులకు అమ్మ ఒడి పథకం కింద ప్రతి ఏటా రూ.15 వేలు అందజేస్తామని సీఎం జగన్‌ ప్రకటన చేశారు.  

చదవండిరాజన్న బడిబాటలో పాల్గొన్న సీఎం వైఎస్‌ జగన్‌

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ..‘ఇవాళ  చాలా సంతోషంగా ఉంది. కారణం ఏమిటంటే ఈరోజు నా మనసుకు అన్నింటికన్నా నచ్చిన కార్యక్రమం చేస్తున్నాను కాబట్టి.  నా కోరిక ఒక్కటే. పిల్లలు బడికి వెళ్లాలి. బడుల నుంచి కాలేజీలకు వెళ్లాలి. కాలేజీ నుంచి వాళ్లు డాక్టర్లు, ఇంజినీర్లు కావాలి. ఉన్నత విద్యావంతులు కావాలి. అయితే ఆ చదువుల కోసం ఏ తల్లి, తండ్రి కూడా అప్పులు పాలు కాకూడదనే నా ఆశ. నా పాదయాత్ర సందర్భంగా పేదల కష్టాలను చూశాను. వారు పడుతున్న బాధలు విన్నా.బిడ్డలను చదివించాలన్న ఆరాటం ఉన్నా...చదవించలేని పరిస్థితిలో ఉన్న తల్లిదండ్రులను చూశాను. పిల్లలను ఇంజినీరింగ్‌ చదవించాలని, ఆ చదువుల కోసం ఖర్చులు భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి చూశాం. ఈ విద్యా వ‍్యవస్థలో సంపూర్ణమైన మార్పులు తెస్తామని ప్రతి తల్లికి, చెల్లికి హామీ ఇచ్చాను. 

మీ పిల్లల చదువును ఇకపై నేను తీసుకుంటానని మాటిచ్చా. ఇవాళ ఆ మాట నిలబెట్టుకునే రోజు వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ప్రతి తల్లికి, చెల్లికి, ఒకే ఒకమాట చెబుతున్నా. మీ పిల్లలను బడులకు పంపించండి. మీరు చేయాల్సిందల్లా కేవలం బడులకు పంపించడమే. బడికి పంపించినందుకు జనవరి 26 తేదీకల్లా... రాష్ట్రవ్యాప్తంగా ఒక పండుగ దినం చేస్తాం. ఏ తల్లి అయితే తమ పిల్లలను బడులకు పంపిస్తుందో...వాళ్లకు రూ.15 వేలు డబ్బులు చేతిలో పెడతాం. ఏ తల్లి కూడా తన పిల్లలను చదవించడానికి అవస్థ పడకూడదనే ఈ కార్యక్రమం. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా నిరక్షరాస్యత 26 శాతం ఉంటే... మన రాష్ట్రంలో 33శాతం ఉంది. ఇలాంటి దారుణ పరిస్థితిలో మన పిల్లలు ఉన్నారు. ఆ పరిస్థితిలో మార్పు రావాలి. మన పిల్లలు దేశంలో ఎవరితో అయినా పోటీ పడేలా ఉండాలి.

ఈ పరిస్థితిలో ఎందుకు ఉన్నామని నా పాదయాత్రలో చూశాను. పిల్లలకు సకాలంలో పుస్తకాలు అందడం లేదు. ఏప్రిల్, మే మాసంలో పుస్తకాలు అందాలి. స్కూల్‌ తెరిచిన వెంటనే పుస్తకాలు, మూడు జతల యూనిఫాం అందజేయాలి. మన ఖర్మ ఏంటంటే..నా పాదయాత్రలో గమనించా..పిల్లలకు సెప్టెంబర్‌ దాటిన కూడా పుస్తకాలు అందలేదు. యూనిఫాం కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి. టీచర్ల ఉద్యోగాల కొరత ఉన్నా రిక్రూట్‌మెంట్‌ చేయలేదు. ప్రభుత్వ స్కూళ్లకు వెళ్తే ఆ పాఠశాలల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. మరుగుదొడ్లు ఉండవు. నీళ్లు ఉండదు. ఫ్యాన్‌ లేదు. కాంపౌండు వాల్‌ ఉండదు. ఇక పిల్లలను చదివించాలంటే ఏ తల్లైనా భయపడాల్సిందే. ప్రైవేట్‌ రంగంలో స్కూళ్లలో ఫీజులు షాక్‌ కొడుతున్నాయి. నారాయణ, శ్రీ చైతన్య వంటి స్కూళ్లలో ఫీజులు విఫరీతంగా వసూలు చేస్తున్నారు. ఇటువంటి అన్యాయమైన పరిస్థితి ఉన్నప్పుడు మన పిల్లలను చదివించాలంటే తల్లిదండ్రులు కష్టపడుతున్నారు. ఇవన్నీ కూడా మార్చేస్తానని మాటిస్తున్నాను. 

ఇవాళ ప్రతి స్కూల్‌ను కూడా ఫోటో తీయండి. రాష్ట్రంలో 40 వేల స్కూళ్లు ఉన్నాయి. రెండేళ్లలో అదే స్కూళ్లు ఎలా ఉన్నాయో చేసి చూపిస్తాం. పాఠశాలలకు కావాల్సిన అన్ని వసతులు కల్పిస్తాం. ప్రైవేట్‌ స్కూళ్లకు ఏమాత్రం తగ్గకుండా తీర్చిదిద్దుతామని మాట ఇస్తున్నాను. ప్రతి స్కూల్‌ కూడా ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడుతాం.  ప్రతి స్కూల్‌లోనూ తెలుగు సబ్జెక్ట్‌ను తప్పని సరి చేస్తాం. ఈ రోజు చదువుల విప్లవాన్ని తీసుకువచ్చి, మంచి స్కూళ్లుగా తీర్చిదిద్దుతాం. ఏ తల్లి కూడా అవస్థలు పడకుండా చేస్తాం. ప్రతి తల్లికి అన్నగా తోడుంటాను. మీ పిల్లలను బడికి పంపించండి. నేనున్నాను.. ఆ పిల్లలకు మామగా ఉంటాను. ఈ స్కూళ్ల పరిస్థితి మారాలి. కాబట్టి ప్రతి పిల్లాడికి స్కూళ్ల బాట పట్టమని అందరికి ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూ ముగిస్తున్నాను.’  అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement