
పాదయాత్రలో ఆకివీడు మండలం చినకాపవరంలో ఆక్వా చెరువు వద్ద మేత జల్లుతున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, ఆకివీడు(పశ్చిమగోదావరి) : మాట తప్పని, మడమ తిప్పని నాయకుడినని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి నిరూపించుకున్నారు. కష్టాలలో ఉన్న ఆక్వా రంగాన్ని ఆదుకునేందుకు విద్యుత్ చార్జీలు తగ్గిస్తానని పాదయాత్ర సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఆక్వాకు వినియోగించే విద్యుత్ చార్జీలను తగ్గించారు. యూనిట్ ధర రూ.1.50 చేసి ఆటుపోట్లతో ఉన్న ఆక్వా రంగానికి భరోసా కల్పించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఆక్వా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 90 వేల ఎకరాల్లో రొయ్యల సాగు కొనసాగుతోంది. రొయ్యల చెరువులకు ప్రధానంగా విద్యుత్ అవసరం. కొన్నేళ్లుగా ఆక్వా రైతులు విద్యుత్ బిల్లులు యూనిట్‌కు రూ.3.86 చెల్లించేవారు. పైగా అంతంత మాత్రంగానే విద్యుత్ సరఫరా ఉండేది. కోతలతో రైతులు తలలు పట్టుకునేవారు. ఒక పక్క విద్యుత్ బిల్లులు, మరో పక్క డీజిల్ బిల్లులు తడిసి మోపుడయ్యేవి. దీంతో రైతులు ఆర్థికంగా తీవ్ర నష్టానికి గురవుతున్న తరుణంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్షనాయకుడి హోదాలో చేపట్టిన పాదయాత్ర జిల్లాలో ప్రవేశించింది. జిల్లాలోని ఆక్వా రైతులు తమను ఆదుకోవాలని జగన్‌కు విన్నవించారు. ఆక్వా తీవ్ర నష్టాలతో ఉందని, విద్యుత్ చార్జీల భారాన్ని మోయలేకపోతున్నామని మొరపెట్టుకున్నారు.
రొయ్యల చెరువులో విద్యుత్ మోటార్లు సహాయంతో తిరుగుతున్న ఏరియేటర్లు
ఇదే సమస్యను తూర్పుగోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో ఆక్వా రైతాంగం జగన్ దష్టికి తీసుకువెళ్లారు. ఆయన వెంటనే స్పందించి, ఆకివీడులో జరిగిన బహిరంగ సభలో ఆక్వా విద్యుత్ చార్జీలు తాను అధికారంలోకి వస్తే యూనిట్ ధర రూ.1.50లకు మాత్రమే చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. జగన్ ప్రకటనకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు బెంబేలెత్తి ఆక్వా విద్యుత్ చార్జీలు రూ.1.75 తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆ చర్య రైతుల్లో సంతృప్తిని కలిగించలేదు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన నెలరోజుల్లోనే ఆక్వాకు మంచి రోజులు తీసుకువచ్చారని రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తోంది.
జిల్లాలో సబ్సిడీ రూ.22 కోట్లు
జిల్లాలో 90 వేల ఎకరాల్లో ఆక్వా సాగు కొనసాగుతోంది. ఆక్వా చెరువుల్లో ఏరియేటర్లు నిరంతరం నడిపేందుకు అవసరమ్యే విద్యుత్ సరఫరా కోసం జిల్లాలో 14,300 విద్యుత్ కనెక్షన్లను రైతులు పొందారు. తగ్గించిన విద్యుత్ చార్జీల ప్రకారం జిల్లాలో ప్రభుత్వంపై రూ.22 కోట్ల భారం పడనుంది. ఆక్వా ద్వారా విద్యుత్ బిల్లుల ఇప్పటి వరకూ రూ.40 కోట్ల మేర వస్తుండగా దీనిపై ప్రభుత్వం రూ.22 కోట్లు సబ్సిడీ కల్పించింది. సబ్సిడీ సొమ్మును ప్రభుత్వం చెల్లించగా, మిగిలిన బిల్లులను ఆక్వా రైతులు చెల్లిస్తారు.
ఎంతో ప్రయోజనం
ఆక్వా రైతులకు విద్యుత్ చార్జీలు తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆక్వా రైతులకు ఎంతో ఊరట కలిగిస్తోంది. ఇప్పటికే సీడ్, ఫీడ్ ఇతర ఖర్చులు పెరగడం, రొయ్యల ధరలు హెచ్చతగ్గులు కారణంగా అనేక మంది రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇటువంటి తరుణంలో విద్యుత్ చార్జీలను తగ్గించడం వల్ల పెట్టుబడులు తగ్గి సన్న, చిన్నకారు రైతులు సైతం ఆక్వా సాగుచేయడానికి అనుకూలం ఏర్పడింది.
– తోట బుజ్జి, రొయ్య రైతు, కొత్తపాడు
పూర్వ వైభవం
ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో జగన్‌కు జగనే సాటి. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని
అప్పుల ఊబిలో కూరుకుపోయే విధంగా చేసినా జగన్ రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం ప్రశంసనీయం. రొయ్యల సాగు ద్వారా ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో విదేశీ మారకద్రవ్యం వస్తున్నా గత ప్రభుత్వం రైతుల సమస్యలను ఇప్పటివరకు పట్టించుకోలేదు. జగన్ ప్రభుత్వంలో రైతులకు మంచిరోజులు వచ్చినట్లే.
–మల్లుల చంద్రరావు, రాయకుదురు
Comments
Please login to add a commentAdd a comment