సాక్షి, పశ్చిమగోదావరి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా మత్స్య, ఆక్వా కల్చర్ సుస్థిర అభివృద్ధికి ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై) పథకాన్ని నిర్వహిస్తున్నాయి. ఇందులో ఆక్వా రైతులు, ఔత్సాహికులకు సబ్సిడీ అందిస్తూ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. మత్స్యశాఖ అధికారులు ఈ పథకంపై మత్స్యకార సొసైటీలు, రైతులకు అవగాహన కలిగిస్తున్నారు. మొత్తం 14 రకాల ఆక్వా సంబంధిత ఉత్పత్తులకు ప్రభుత్వాలు సబ్సిడీలు అందిస్తున్నాయి.
చేపలు, రొయ్యల వినియోగాన్ని మరింత పెంచడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 2,50,045 ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది. ప్రతి ఏటా 17,15,362 టన్నుల ఆక్వా ఉత్పత్తి జరుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2024 వరకు ఐదేళ్ల కాలానికి గాను రూ.20,050 కోట్లు పీఎంఎంఎస్‌వై పథకానికి కేటాయించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.9407 కోట్లు ఉండగా, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.4880 కోట్లు, లబ్ధిదారుల వాటా రూ.5763 కోట్లుగా ఉంది.
ప్రోత్సాహకాలు ఇలా..
పీఎంఎంఎస్‌వై పథకంలో 14 అంశాలకు సంబంధించిన వివిధ పథకాలు ఉన్నాయి. ఇందులో ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఎంచుకున్న యూనిట్‌లకు కేంద్రం 36 శాతం, రాష్ట్రం 24 శాతం కలిపి 60 శాతం సబ్సిడీని అందిస్తున్నాయి. లబ్ధిదారులు 40 శాతం చెల్లించాలి. ఇతరులకు కేంద్రం 24 శాతం, రాష్ట్రం 16 శాతం కలిపి మొత్తం 40 శాతం సబ్సిడీ అందిస్తున్నాయి. లబ్ధిదారులు 60 శాతం నగదు చెల్లించాలి.
యూనిట్ల విషయానికి వస్తే చేప, రొయ్య పిల్లల నర్సరీకి రూ.7 లక్షలు, రిజర్వాయర్లలో కేజ్ కల్చర్‌కు రూ.3 లక్షలు, ఆక్వా ల్యాబ్ ఏర్పాటుకు రూ.25 లక్షలు, బతికిన చేపల అమ్మకాల యూనిట్‌కు రూ.20 లక్షలు, చేపల రవాణా రిఫ్రిజిరేటెడ్ వాహనానికి రూ.25 లక్షలు, ఫిష్ కియోస్క్ యూనిట్‌కు రూ.10 లక్షలు, రోజుకు 20 టన్నుల ఆక్వా ఉత్పత్తులు చేసే కర్మాగారానికి రూ.2 కోట్లు సైతం అందించనున్నారు.
ఫలిస్తున్న సీఎం జగన్ కల..
ప్రపంచంలోనే చేపల ఉత్పత్తిలో మన దేశం రెండో స్థానంలో ఉంది. సింహభాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి సరఫరా అవుతోంది. మత్స్యరంగాన్ని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనేక పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆక్వా హబ్‌లను ఏర్పాటు చేసి ఫిష్ ఆంధ్రా పేరుతో తాజా చేపలు, పీతలు, రొయ్యలను విక్రయించడానికి ఏర్పాట్లు చేశారు. ఏలూరు జిల్లాలో మొత్తం 101 వివిధ యూనిట్లకు గాను మొత్తం రూ.327.60 లక్షలు మంజూరయ్యాయి. వీటిలో రాష్ట్ర వాటా రూ.131.04 లక్షలు, కేంద్ర వాటా రూ.196.56 లక్షలుగా ఉంది. ఈ పథకం ద్వారా మంజూరైన వాహనాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి.
పథకంపై అవగాహన కలిగిస్తున్నాం...
పీఎంఎంఎస్‌వై పథకంపై రైతులకు మత్స్య శాఖ ద్వారా అవగాహన కలిగిస్తున్నాం. ఈ పథకాలకు భూమి వివరాలు, ఆధార్ కార్డు, హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్, డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టులు, రుణ మంజూరుకు బ్యాంకు నుంచి జారీ చేసిన పత్రం, లబ్ధిదారుని వాటా భరించు డిక్లరేషన్ పత్రం ఉండాలి. మరిన్ని వివరాలకు కావాల్సినవారు స్థానిక మత్స్యశాఖ కార్యాలయాల్లో సంప్రదించాలి.
– ఈశ్వర చంద్ర విద్యాసాగర్, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి, ఏలూరు
Comments
Please login to add a commentAdd a comment