వైఎస్‌ జగన్‌ చొక్కాను ఫోరెన్సిక్‌కు అప్పగించొద్దు | YS Jagan Lawyer Filed Counter In Visakha Court | Sakshi
Sakshi News home page

ఆ రిట్‌ తేలేదాకా జగన్‌ చొక్కాను ఫోరెన్సిక్‌కు అప్పగించొద్దు

Published Thu, Nov 29 2018 9:29 AM | Last Updated on Thu, Nov 29 2018 9:30 AM

YS Jagan Lawyer Filed Counter In Visakha Court - Sakshi

విశాఖ విమానాశ్రయంలో వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగినప్పటి ఫొటో

అల్లిపురం(విశాఖ దక్షిణం): ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో.. కోర్టుకు సమర్పించిన రక్తపు మరకలతో ఉన్న ఆయన చొక్కాను అప్పుడే ఫోరెన్సిక్‌ లేబొరేటరీకి పంపవద్దని, వైఎస్సార్‌సీపీ అధినేత దాఖలు చేసిన రిట్‌ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున.. అది తేలేవరకు వేచి ఉండాలని జగన్‌ తరఫు న్యాయవాది విశాఖ కోర్టును కోరారు. సంఘటన సమయంలో ప్రతిపక్ష నేత ధరించిన షర్టును సీల్డు కవర్లో ఈ నెల 23న ఆయన తరఫు న్యాయవాదులు 7వ అదనపు మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో అందజేసిన విషయం తెలిసిందే. ఈ షర్టును పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీకి పంపించాలని కోర్టును కోరుతూ సిట్‌ పోలీసులు గత సోమవారం మెమో దాఖలు చేశారు. దీనికి జగన్‌మోహన్‌రెడ్డి న్యాయవాది నీలాపు కాళీదాసురెడ్డి బుధవారం కౌంటర్‌ మెమో దాఖలు చేశారు.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయాన్ని కోర్టువారికి గుర్తుచేశారు. రిట్‌ పిటిషన్‌ ఈ నెల 27న విచారణకు రావాల్సి ఉండగా డిసెంబర్‌ 3వ తేదీకి వాయిదా పడిందని విన్నవించారు. హత్యాయత్నం కేంద్ర బలగాల అధీనంలో ఉన్న చోట జరిగినందున సివిల్‌ ఏవియేషన్‌ యాక్ట్‌ 1982కు విరుద్ధంగా స్థానిక పోలీసుల విచారణ జరిగే అవకాశముందని, అందువల్ల కేసు విచారణను కేంద్ర విచారణ సంస్థకు అప్పగించాలని కోరుతూ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసి ఉన్నందున.. దానిపై ఉన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించేవరకు షర్టును రాష్ట్ర ప్రభుత్వ హయాంలో నిర్వహించే ఫోరెన్సిక్‌ లేబొరేటరీకి అప్పగించవద్దని, హైకోర్టు తీర్పు వెల్లడించే వరకు పెండింగ్‌లో ఉంచాలని కోరారు. ఆయన వాదనను విన్న న్యాయమూర్తి ఏపీపీకి నోటీసు ఇమ్మని కోరగా.. నోటీసు ఇచ్చారు. దీంతో డిసెంబర్‌ 3న ఇరు పార్టీలు వాదనలు వినిపించాలని న్యాయమూర్తి పేర్కొంటూ కేసు విచారణను వాయిదా వేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement