సాక్షి, విశాఖపట్నం: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో దర్యాప్తును ప్రభుత్వం వ్యూహాత్మకంగా అటకెక్కించేసింది. సంచలనం సృష్టించిన ఈ హత్యాయత్నం కేసులో విచారణను ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) దాదాపుగా చాప చుట్టేసినట్టే కనిపిస్తోంది. కొన్ని రోజులుగా విచారణ ప్రక్రియ ముందుకు సాగకపోవడం వెనుక ప్రభుత్వ పెద్దల ఒత్తిడి ఉన్నట్లు స్పష్టమవుతోంది. హత్యాయత్నంగా నమోదు చేసిన ఈ కేసులో సిట్ ఉద్దేశ్యపూర్వకంగానే కుట్ర కోణాన్ని విస్మరించింది. మొదట్లో కొంత హడావుడిగా కనిపించిన సిట్ అధికారులు ఇటీవల సీఎం చంద్రబాబు విశాఖపట్నం విమానాశ్రయంలో చేసిన ‘కర్తవ్యబోధ’తో అస్త్రసన్యాసం చేశారు. కేసు దర్యాప్తును మమ అనిపించే దిశగా విచారణ తంతును సాగదీస్తున్నారు.
తెరవెనుక పెద్దలను ఎందుకు గుర్తించడం లేదు?
ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం కేసు దర్యాప్తును కేవలం నిందితుడు శ్రీనివాసరావుకే పరిమితం చేయాలన్న ప్రభుత్వ పెద్దల మార్గదర్శకత్వంలోనే సిట్ నడుచుకుంటోంది. హత్యాయత్నం జరిగి రెండు వారాల తరువాత కూడా శ్రీనివాసరావును తప్ప మరో నిందితుడిని గుర్తించకపోవడమే ఇందుకు నిదర్శనం. కట్టుదిట్టమైన భద్రత ఉండే విమానాశ్రయంలో పక్కాగా హత్యాయత్నానికి పాల్పడటం శ్రీనివాసరావు ఒక్కడి వల్ల సాధ్యం కాదన్నది అందరికీ తెలిసిందే. పోలీసులు మాత్రం శ్రీనివాసరావును తప్ప తెరవెనుక ఉన్న అసలు కుట్రదారులను ఎందుకు గుర్తించలేకపోతున్నారన్నది సందేహాస్పదంగా మారింది. టీడీపీ నేత, ఎయిర్‌పోర్ట్ రెస్టారెంట్ యజమాని హర్షవర్థన్ ప్రసాద్ చౌదరి నిందితుడు శ్రీనివాసరావుకు ఉద్యోగం, ఆశ్రయం ఇచ్చారు.
హర్షవర్థన్ ప్రసాద్ చౌదరిని కూడా నిందితుడిగా చేర్చి పూర్తిస్థాయిలో విచారిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కానీ, సిట్ అధికారులు మాత్రం ఆ దిశగా ఎలాంటి ముందుకు కదలడం లేదు. హర్షవర్థన్ ప్రసాద్ చౌదరిని ఒకసారి పిలిచి తూతూమంత్రంగా విచారించి విడిచిపెట్టారు. అంతేకాదు శ్రీనివాసరావుకు సహాయ సహకారాలు అందించిన ఇతర వ్యక్తులను గుర్తించడంపై సిట్ దృష్టి పెట్టడం లేదు. అతడిని హర్షవర్థన్ చౌదరి వద్దకు తీసుకొచ్చింది ఎవరు? ఆర్థిక సాయం అందించింది ఎవరు? ఆ నిధులు ఎవరి నుంచి ఎవరికి వెళ్లాయి? హర్షవర్థన్ చౌదరి కాల్‌డేటాలో ఏయే వివరాలున్నాయి? తదితర కీలక కోణాలను సిట్ అధికారులు ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నట్లు తెలుస్తోంది.
తీవ్ర సంచలనం సృష్టించిన ఈ హత్యాయత్నం కేసులో అసలు దోషులను గుర్తించలేకపోవడం సిట్ వైఫల్యమేనని స్పష్టమవుతోంది. ‘‘నిందితుడు శ్రీనివాసరావు హత్యాయత్నానికి పాల్పడి విమానాశ్రయంలో పోలీసులకు చిక్కాడు. అతడిని పట్టుకోవడంలో పోలీసుల ఘనత ఏమీ లేదు. కానీ, తెరవెనుక దాక్కున్న అసలు కుట్రదారులను కనిపెట్టలేకపోవడం మాత్రం కచ్చితంగా పోలీసుల వైఫల్యమే’’ అని ఓ రిటైర్డ్ పోలీసు అధికారి చెప్పారు. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే సిట్ అధికారులు నడుచుకుంటున్నారని, ఈ కేసులో హర్షవర్థన్ ప్రసాద్ చౌదరితోపాటు ఇతరుల ప్రమేయాన్ని బట్టబయలు చేసే దిశగా దర్యాప్తు చేయడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
కుట్ర కోణాన్ని ఛేదించడంపై శ్రద్ధ ఏది?
సిట్ దర్యాప్తు కొన్ని రోజులుగా పడకేసిందనే చెప్పాలి. నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు పోలీసు కస్టడీ ముగియడంతోనే ఈ కేసు దర్యాప్తులో వేగం ఒక్కసారిగా నెమ్మదించింది. ఈ కేసులో అనుమానితులను గుర్తించి, విచారించే ప్రక్రియకు మంగళం పాడేశారు. సిట్ కార్యాలయంలో కార్యకలాపాలు నిలిచిపోయాయి. అనుమానితులను విచారించిన దాఖలాలు కనిపించడం లేదు. సిట్ విచారణ ప్రక్రియ పర్యవేక్షకుడుగా ఉన్న డీసీపీ నయీం కొన్ని రోజులుగా సిట్ కార్యాలయం వైపు కన్నెత్తి చూడడం లేదు. సిట్ విచారణ అధికారి అయిన ఏసీపీ నాగేశ్వరరావు, ఇతర అధికారులు న్యాయస్థానానికి సమర్పించే సీల్డ్ కవర్ నివేదిక రూపకల్పనలోనే నిమగ్నమయ్యారు.
అంతేతప్ప కేసు విచారణను వేగవంతం చేసి కొత్త కోణాలను గుర్తించడం, కుట్ర కోణాన్ని ఛేదించడంపై దృష్టి సారించడం లేదని పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. నిందితుడు శ్రీనివాసరావు నేర చరిత్రను ఆరా తీసేందుకు అతడు గతంలో పనిచేసిన వివిధ రాష్ట్రాల్లోని ప్రదేశాలకు దర్యాప్తు బృందాన్ని పంపుతామని అధికారులు చెప్పారు. కానీ, ఆ దిశగా ఎలాంటి కార్యాచరణ చేపట్టలేదని ఓ అధికారి వ్యాఖ్యానించారు. కొన్నిరోజులుగా ఈ కేసులో సిట్ అధికారులు చెప్పుకోదగ్గ పురోగతి ఏదీ సాధించలేదని ఆయన చెప్పారు. సీఎం చంద్రబాబు విశాఖ ఎయిర్‌పోర్టుకు వచ్చి వెళ్లిన తర్వాతే సిట్ దర్యాప్తు నిలిచిపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment