అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం
నారాయణ రెడ్డి కుటుంబానికి వైఎస్ జగన్ భరోసా
- సాంబశివుడి కుటుంబానికీ ప్రతిపక్ష నేత పరామర్శ
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ‘‘అధికార పార్టీ హత్యా రాజకీయాలకు భయపడాల్సిన అవసరం లేదు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి పోరాడుతూ నారాయణ రెడ్డి మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన అభివృద్ధిని చూసి ఓర్వలేకనే హత్య చేశారు. మీరెవ్వరూ అధైర్యపడొద్దు. అండగా మేమున్నాము’’ అని చెరుకులపాడు నారాయణరెడ్డి కుటుంబ సభ్యులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసానిచ్చారు. నారాయణ రెడ్డి అమర్ రహే అనే నినాదాలు, భారీ జనసందోహం మధ్య నారాయణ రెడ్డి అంత్యక్రియలు ఆయన స్వగ్రామం చెరుకులపాడులో సోమవారం జరిగాయి. అంత్యక్రియలకు హాజరైన సందర్భంగా వారి కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించారు. ‘ఏం భయపడొద్దు అమ్మా నేనున్నాను’ అని నారాయణ రెడ్డి కూతురు స్నేహా రెడ్డికి ధైర్యం చెప్పారు. అన్నా మీరే మాకు దిక్కు అని కుమారుడు మోహన్ రెడ్డి.. జగన్‌ను పట్టుకుని భోరున విలపించారు. పిల్లలను జాగ్రత్తగా చూసుకోమ్మా అని నారాయణ రెడ్డి భార్య శ్రీదేవికి జగన్ ధైర్యం చెప్పారు. నారాయణ రెడ్డితో పాటు హత్యకు గురైన సాంబశివుడు కుటుంబాన్ని కూడా జగన్ ఈ సందర్భంగా పరామర్శించారు.
భారీగా హాజరైన జనసందోహం: నారాయణరెడ్డి, సాంబశివుడుల మృతదేహలకు కర్నూలులోని ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ప్రారంభించి 11 గంటలకు పూర్తి చేశారు. అనంతరం ఆయన మృతదేహాన్ని పోలీసు బందోబస్తు మధ్య స్వగ్రామానికి తరలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వద్దకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. మృత దేహాంతో పాటు ప్రజలు నినాదాలు చేస్తూ చెరుకులపాడుకు తరలివెళ్లారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అంత్యక్రియలు ముగిశాయి.