‘సీఎం జగన్‌ నిండు నూరేళ్లు వర్థిల్లాలి’ | YS Jagan Mohan Reddy Birthday Celebrations Air Show At Vijayawada | Sakshi
Sakshi News home page

‘సీఎం జగన్‌ నిండు నూరేళ్లు వర్థిల్లాలి’

Published Thu, Dec 19 2019 8:07 PM | Last Updated on Thu, Dec 19 2019 8:25 PM

YS Jagan Mohan Reddy Birthday Celebrations Air Show At Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించడం చాలా సంతోషదాయకమని హోం మంత్రి సుచరిత అన్నారు. సీఎం జగన్‌ జన్మదినోత్సవ ముందస్తు వేడుకలను సిమ్స్ కళాశాలల డైరెక్టర్ భరత్‌రెడ్డి పద్మావతిఘాట్‌లో ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో సీఎం జగన్‌కు ఎయిర్ షో విన్యాసాలతో శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ‘దిశ చట్టం’పై అవగాహన కల్పిస్తూ విద్యార్ధినులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న హోంశాఖ మంత్రి సుచరిత మాట్లాడుతూ.. ‘దిశ చట్టం’ ద్వారా సీఎం జగన్‌ మహిళల్లో భరోసా నింపారని.. ‘దిశ చట్టం’ తీసుకువచ్చినందుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారని ఆమె అన్నారు. రోజురోజుకు దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని.. నేటికి మహిళలు అర్ధరాత్రి తిరిగే స్వాతంత్రo రాలేదన్నారు. ప్రపంచంలోనే మనదేశం.. మహిళపై జరిగే దాడులు, కేసుల్లో ముందున్నదని తెలిపారు. నిర్భయ, దిశ లాంటి ఘటనలు మన రాష్ట్రంలో చోటుచేసుకోకుండా మహిళ పట్ల చిత్తశుద్ధితో సీఎం జగన్‌ ‘దిశ చట్టం’ తీసుకు వచ్చారని హోంమంత్రి సుచరిత గుర్తు చేశారు.

ప్రతి ఏడాది ఏపీలో మహిళలపై దాడులకు సంబంధించి 15వేల కేసులు నమోదు అవుతున్నాయని ఆమె చెప్పారు. చట్టాలపై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలని ఆమె సూచించారు. ‘దిశ చట్టం’ ద్వారా ఏడు రోజుల్లో దర్యాప్తు పూర్తిచేసి.. 21రోజుల్లో శిక్ష ఖరారు అవుతుందని ఆమె వివరించారు. ఫోన్‌లో అసభ్య సందేశాలు పంపితే రెండేళ్లు, మళ్లీ పాల్పడితే నాలుగేళ్లు శిక్షపడేలా 354(ఈ) చట్టాన్ని తెచ్చామని సుచరిత తెలిపారు. మైనర్లపై  హత్యాచార దాడులు చేస్తే 14ఏళ్లు, మరణశిక్ష కూడా పడుతుందని ఆమె పేర్కొన్నారు. జగన్ ప్రవేశపెట్టిన ‘దిశ చట్టం’ అమలుకు ఇతర రాష్ట్రాలు కూడా ఆసక్తి చూపించడం‌ విశేషం అన్నారు. మహిళల పట్ల సోదరిభావంతో మెలగాలని.. లేకుంటే జీవితం నాశనం అవుతుందని హోం మంత్రి సుచరిత వ్యాఖ్యానించారు. మహిళలు రక్షణకోసం ఉన్న 100, 112, 182 నెంబర్లు ప్రతి మహిళ వినియోగించుకోవాలని ఆమె సూచించారు. సీఎం జగన్‌ నిండు నూరేళ్లు వర్థిల్లాలి అని కోరుకున్నారు.

ఈ వేడుకల్లో పాల్గొన్నమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఒక్క రాష్ట్రంలో జరిగిన దారుణం మరోసారి జరగకూడదని సీఎం జగన్ భావించారని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ‘దిశ చట్టం’ తెచ్చారని సీఎం జగన్‌ను కొనియాడారు. ఈ చట్టాన్ని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు చేసేందుకు ఆసక్తి చూసిస్తున్నాయని తెలిపారు. వైఎస్సార్ ఫీజు రీయంబర్స్‌మెంట్ ద్వారా ఉన్నత చదువులు చెప్పించారని పేర్కొన్నారు. వారందరికీ ఇప్పుడు సీఎం జగన్‌.. ఉద్యోగ అవకాశాలు కల్పించారని గుర్తు చేశారు. స్థానికంగా ఉన్నవారికి ఉద్యోగాలు కల్పిపించేందుకు 75శాతం స్థానికత చట్టం తీసుకువచ్చారని ఆయన తెలిపారు. కాని చంద్రబాబు కేవలం ఓట్ల కోసమే పధకాలు ప్రవేశపెట్టారని ఆయన మండిపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు కోసం సీఎం జగన్‌ కృషి చేస్తున్నారని వెల్లంపల్లి శ్రీనివాస రావు చెప్పారు. జగన్ వంటి నాయకుని నాయకత్వంలో పని చేయడం తనకు చాలా ఆనందంగా ఉందని  పేర్కొన్నారు. ‘దిశ చట్టం’ వివరిస్తూ విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆలోచింపచేసేలా ఉన్నాయని వెల్లంపల్లి శ్రీనివాస రావు అన్నారు. ‘అబ్బాయిలు ఈవ్టీజింగ్‌కు పాల్పడవద్దు.. జీవితాలను నాశనం‌ చేసుకోవద్దు ’ అని ఆయన పేర్కొన్నారు.

ఎమ్మెల్యే మల్లాది విష్ణు  మాట్లాడుతూ.. దిశ చట్టాన్ని దేశం మొత్తం స్వాగతించిందని అన్నారు. అందరూ చట్టం అమలుకు సానుకూలంగా స్పందించారని తెలిపారు. కానీ చంద్రబాబుకు మాత్రం ‘దిశ చట్టం’ ఉద్దేశం అర్ధం కాలేదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో దిశపై చర్చ పెడితే.. ఉల్లి కోసం లొల్లి చేశారని మండిపడ్డారు. చట్టాలు రావడం కాదు.. వాటిపై అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు. మహిళలు కూడా టోల్ ఫ్రీ నెంబర్లను దగ్గరే ఉంచుకోవాలని మల్లాది విష్ణు చెప్పారు.

దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని‌ విధంగా సీఎం జగన్‌ ‘దిశ యాక్ట్’ తీసుకువచ్చారని ఆయన ప్రశంసించారు. ఆడపిల్లల రక్షణ కోసం ధైర్యం ఉన్న నాయకునిగా సీఎం జగన్‌ నిరూపించారని ఆయన తెలిపారు. టీడీపీ హయాంలో మహిళా తహశీల్దారుపై దాడి చేశారని ఆయన మండిపడ్డారు. కాల్ మనీ వ్యాపారం ద్వారా మహిళలను ఇబ్బందులు పెట్టారని దేవినేని అవినాష్‌ టీడీపీని దుయ్యబట్టారు. ఆడపిల్లలకు అండగా, అన్నగా సీఎం జగన్‌ దిశ చట్టాన్ని తెచ్చారని అవినాష్‌ గుర్తు చేశారు. దిశ చట్టం మహిళలల్లో భరోసా నింపి.. దశ మారుస్తుందని ఆయన పేర్కొన్నారు.

భరత్‌రెడ్డి మాట్లాడూ.. జగనన్న జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా రెండు రోజుల పాటు ఎయిర్ షో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆరు దేశాల ప్రతినిధులు ఈ ఎయిర్ షో పాల్గొన్నారని ఆయన వెల్లడించారు. గత ప్రభుత్వ పాలనలో వైస్సార్‌ కుటుంబాన్ని విశ్వసించిన వారిపై కేసులు పెట్టి ఇబ్బందులు గురిచేశారని మండిపడ్డారు. ప్రజలకు సంక్షేమపాలన అందించాలన్నదే సీఎం జగన్‌ లక్ష్యం అని భరత్‌రెడ్డి పేర్కొన్నారు. తండ్రిని మించిన పాలన అందివాలన్నది సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఉద్దేశమని భరత్‌రెడ్డి పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement