సాక్షి, విజయవాడ/అమరావతి : రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న మన పాలన-మీ సూచన కార్యక్రమంలో భాగంగా నేడు విద్యారంగంపై తాడేపల్లిలోని క్యాంపు ఆఫీస్‌లో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పాఠశాలల్లో నాడు-నేడు, ఇంగ్లిష్ మీడియం విద్య, అమ్మఒడి, జగనన్న విద్యాకానుక, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చించారు. కార్యక్రమంలో భాగంగా విజయవాడకు చెందిన రమ్య అనే 10వ తరగతి విద్యార్థిని మాట్లాడిన మాటలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కదిలించాయి. కృష్ణా జిల్లా కానూరు ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న యు. రమ్య అనే విద్యార్థిని తనకు అందుతున్న పథకాలకు సంబంధించిన విషయాలను చక్కగా వివరించింది. తన తల్లికి ఆరోగ్యం బాలేదన్న విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చింది.
ఈ సందర్భంగా సీఎం జగన్‌ను మామయ్య అని సంబోధిస్తూ .. 'నాకు మా నాన్న లేరు సార్.. మా అమ్మ నన్ను కూలీ పని చేస్తూ చదివిస్తోంది. నేను సీఐడీ ఆఫీసర్ కావాలనే లక్ష్యం ఉండేది.. కానీ పేదవాళ్లం కావడంతో అది నెరవేరుతుందనే నమ్మకం లేదు. కానీ మీరు నాకు మామయ్యలాగా అండగా ఉంటూ నా చదువుకు భరోసా కల్పించారు సార్.. దీంతో నేను లక్ష్యాన్ని చేరుకుంటాననే నమ్మకం వచ్చింది సార్.. మీలాంటి వ్యక్తి మాకు ముఖ్యమంత్రిగా రావడం నిజంగా అదృష్టం సార్.. వీ ఆర్ లక్కీ అండర్ యువర్ రూల్ సార్.. ఒక మామయ్యగా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా సార్.. నా తల్లి ఆరోగ్య పరిస్థితి అస్సలు బాగోలేదు.. ఆమె ఎప్పుడు చనిపోతుందో కూడా నాకు తెలియదు. ఒక వారం ఉంటుందో.. నెల ఉంటుందో తెలియదు కానీ.. నాకు మా అమ్మ కావాలి సార్.. ఎలాగైనా ఆమెను బతికించండి సార్' అంటూ కన్నీటి పర్యంతమైంది. రమ్య మాటలకు చలించిపోయిన సీఎం జగన్ వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి రమ్య తల్లిని ఆసుపత్రికి తరలించాలని సూచించారు. సీఎం ఆదేశాలతో తక్షణమే స్పందించిన హెల్త్ ఆఫీసర్ వైద్య సిబ్బందితో రమ్య ఇంటికి చేరుకొని ఆమె తల్లిని ఆసుపత్రికి తరలించారు. తన తల్లిని ఆస్పత్రికి తరలించడానికి సీఎం జగన్‌కు రమ్య కృతజ్ఞతలు తెలిపింది. (సీఎం జగన్ పండుగలా దిగివచ్చారు)
Comments
Please login to add a commentAdd a comment