
సెక్యురిటీ లేకుండా తిరగగలరా?
సెక్యురిటీ లేకుండా చంద్రబాబు గ్రామాల్లో తిరగగలరా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.
కాదలూరు: బేషరతుగా రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరిచారని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించారని ధ్వజమెత్తారు. రైతు భరోసా యాత్రలో భాగంగా అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని కాదలూరులో రైతులు, మహిళలతో వైఎస్ జగన్ ముఖాముఖి సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... రుణమాఫీ కాకపోవడంతో రైతులపై అదనపు వడ్డీ పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ పుట్ సబ్సిడీ, పంటలబీమా ఏ ఒక్కరికీ అందలేదని తెలిపారు. హామీల అమలులో విఫలమైన చంద్రబాబు రైతులు, మహిళలు ఆనందంగా ఉన్నారని అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. సెక్యురిటీ లేకుండా చంద్రబాబు గ్రామాల్లో తిరగగలరా అని జగన్ ప్రశ్నించారు. సెక్యురిటీ లేకుండా చంద్రబాబు గ్రామాల్లో తిరిగితే ప్రజలు రాళ్లతో కొడతారని, తిడతారని చెప్పారు. హంద్రీ-నీవా ప్రాజెక్టు పూర్తిచేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు.