గన్నవరం ఎయిర్పోర్ట్లో వైఎస్ జగన్కు స్వాగతం
విజయవాడ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు పార్టీ ఎమ్మెల్యేలు జలీల్ ఖాన్, ప్రతాప్ అప్పారావు, కొడాలి నాని, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాఘగం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గం ద్వారా గుంటూరు జిల్లా బయల్దేరారు.
కాగా గుంటూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపడంతోపాటు, పార్టీ పరిస్థితులను వైస్ జగన్ సమీక్షించనున్నారు. అమరావతి రోడ్డులోని బండ్లమూడి గార్డెన్స్‌లో రెండు రోజులపాటు నియోజక వర్గాల వారీగా పార్టీ పరిస్థితులపై ఆయన చర్చించనున్నారు. ప్రధానంగా స్థానిక ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలపై సమీక్ష జరుగుతుంది.
నేడు గుంటూరు తూర్పు, పశ్చిమ, ప్రత్తిపాడు, తాడికొండ, పొన్నూరు, తెనాలి, వేమూరు, రేపల్లె నేతలతో వైఎస్ జగన్ సమీక్ష జరుపుతారు. శుక్రవారం నరసరావుపేట, చిలకలూరిపేట, గురజాల, మాచర్ల, వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు, బాపట్ల నేతలతో సమీక్ష నిర్వహిస్తారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు,జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు, కార్యకర్తలు పాల్గొననున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఈ సమీక్షా సమావేశాలు జరుగుతాయి.