ఏం జరుగుతుందంటే...?
రూ.100 కోట్లు అంతకంటే ఎక్కువ విలువైన పనులకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేయటానికి ముందుగానే సంబంధిత డాక్యుమెంట్‌ను న్యాయ పరిశీలన కోసం హైకోర్టు న్యాయమూర్తికి పంపిస్తారు.
న్యాయమూర్తి దీనిపై ప్రజల నుంచి సూచనలు, సలహాల కోసం వారం రోజుల పాటు డాక్యుమెంట్‌ను అందరికీ అందుబాటులో ఉంచుతారు.
అనంతరం న్యాయమూర్తి ఆధ్వర్యంలో నిపుణుల బృందం వీటిని క్షుణ్నంగా పరిశీలించి 8 రోజుల పాటు సమీక్షిస్తుంది. ప్రజల సలహాల మేరకు తగిన మార్పులు చేర్పులు సూచిస్తుంది. వీటిని కచ్చితంగా అమలు చేస్తూ టెండర్ నోటిఫికేషన్ జారీ అవుతుంది.
సాక్షి, అమరావతి: దేశ చరిత్రలో తొలిసారిగా టెండర్ల ప్రక్రియలో అత్యుత్తమ విధానానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అవినీతి, అక్రమాలకు ఏమాత్రం తావులేకుండా ముందుగా న్యాయపరమైన పరిశీలన తరువాతే పారదర్శకంగా టెండర్లను ఆహ్వానించే చరిత్రాత్మక ఘట్టం శుక్రవారం ఆవిష్కృతమైంది. ఇందుకు సంబంధించిన బిల్లును కూలంకషంగా చర్చించిన అనంతరం శాసనసభ ఆమోదించింది. ప్రతిష్టాత్మకమైన ఈ బిల్లును ఆమోదిస్తున్నట్లు సభ్యుల హర్షధ్వానాల మధ్య స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే టెండర్లను పారదర్శకంగా ఖరారు చేసేందుకు న్యాయ పరిశీలనను ఏర్పాటు చేస్తామని అదే వేదిక నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా టెండర్ల విధానాన్ని సమూలంగా ప్రక్షాళన చేసి పారదర్శకత, ప్రజాధనం ఆదాకు పెద్దపీట వేస్తూ అక్రమాలు, పక్షపాతం, అవినీతి నిర్మూలనే లక్ష్యంగా కొత్తగా ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల (న్యాయపరమైన ముందస్తు సమీక్ష ద్వారా పారదర్శకత) చట్టం–2019 బిల్లు రూపుదిద్దుకుంది. ఈ బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందడంతో త్వరలోనే చట్ట రూపం దాల్చనుంది.
పారదర్శకతకు పెట్టపీట
ఈ బిల్లు ద్వారా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ టెండర్ల ప్రక్రియలో పారదర్శకతకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. హైకోర్టు జడ్జి లేదా రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో టెండర్ల డాక్యుమెంట్ ముందస్తు పరిశీలన జరుగుతుంది. ప్రజల నుంచి అందిన సూచనల మేరకు, న్యాయమూర్తి పరిశీలన అనంతరం మార్పులు, చేర్పులతో టెండర్ల ప్రతిపాదనలను ఖరారు చేస్తూ బిడ్డింగ్‌కు వీలుగా బిల్లులో ప్రొవిజన్స్ ప్రతిపాదించారు. అందరికీ సమాన అవకాశాలు, నాణ్యతా ప్రమాణాలు, ఖర్చు విషయంలో జాగ్రత్త పాటించడమే లక్ష్యంగా బిల్లుకు ప్రభుత్వం రూపకల్పన చేసింది.
అందరికీ సమాన అవకాశాలు..
కొత్త విధానంలో ఏదైనా పనిని ప్రతిపాదిస్తున్న ప్రతిశాఖ ఆ పత్రాలను న్యాయమూర్తికి సమర్పించాల్సి ఉంటుంది. టెండర్లను పిలవడానికి ముందుగానే అన్ని పీపీపీ, జాయింట్ వెంచర్లు, స్పెషల్ పర్సస్ వెహికల్స్ సహా ప్రభుత్వం చేపట్టే అన్ని ప్రాజెక్టులపైనా జడ్జి పరిశీలన చేయనున్నారు. పనులను ప్యాకేజీలుగా విభజించినా సరే మొత్తం పని విలువ రూ.100 కోట్లు దాటితే న్యాయపరిశీలన పరిధిలోకి రావాల్సిందేనని బిల్లులో స్పష్టం చేశారు. న్యాయమూర్తికి సూచనలు, సలహాలు అందిస్తున్న వారికి తగిన రక్షణను ప్రభుత్వమే కల్పించనుంది. జడ్జి సిఫార్సులను తప్పనిసరిగా సంబంధిత శాఖలన్నీ పాటించాల్సిందేనని బిల్లులో పేర్కొన్నారు. మొత్తం 15 రోజుల్లో టెండర్ ప్రతిపాదనలను ఖరారు చేయాలని, ఆ తరువాతే బిడ్డింగ్‌కు వెళ్లాలనే నిబంధన బిల్లులో పొందుపరిచారు.
అర్హత ఉన్న కాంట్రాక్టర్లందరికీ సమాన అవకాశాలు కల్పించాలని బిల్లులో స్పష్టం చేశారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఈ విధానం ఉంటుంది. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా, పనిగట్టుకుని ఈ ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే నిరోధించడానికి తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకునేలా న్యాయమూర్తికి వెసులుబాటు కల్పించారు. జడ్జి, జడ్జి వద్ద పనిచేస్తున్న సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా భావిస్తారు. ఈ చట్టం ద్వారా తీసుకునే నిర్ణయాలు, ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం లేదా ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, ప్రతినిధులపై ఎట్టి దావా క్లెయిమ్ లేదా ఇతర న్యాయ ప్రొసీడింగ్స్ ఏవీ వేయకూడదు. బిల్లులోని ఆర్థిక మెమోరాండంలో నెలవారీ వ్యయం కోసం రూ.3 కోట్లు, ఇతర ఖర్చుల కోసం రూ.ఐదు కోట్లను ప్రాధమికంగా కేటాస్తున్నట్లు పేర్కొన్నారు.
బిల్లులో కీలక అంశాలు ఇవీ...
1. ఏ టెండరైనా, ఏ పనైనా విలువ రూ.100 కోట్లు దాటితే టెండర్ పత్రాలను న్యాయమూర్తి పరిశీలనకు పంపుతారు.
2. తరువాత దాన్ని ప్రజా బాహుళ్యం (ఇంటర్నెట్, వెబ్ సైట్)లో 7 రోజుల పాటు అందరికీ అందుబాటులో ఉంచి ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు.
3. న్యాయమూర్తికి సాంకేతిక తోడ్పాటు కోసం టెక్నికల్ టీమ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. జడ్జి కోరితే వేరేవారిని కూడా నియమిస్తుంది. వారికి జీతభత్యాలు ప్రభుత్వమే చెల్లిస్తుంది.
4. ప్రజల నుంచి అందే సూచనలు, సలహాలను న్యాయమూర్తి ఆధ్వర్యంలోని టెక్నికల్ బృందం 8 రోజుల పాటు సమీక్షిస్తుంది. సంబంధిత శాఖల అధికారులను పిలిచి అందుకు అనుగుణంగా టెండర్లలో మార్పులు చేర్పులు సూచిస్తుంది.
5. వారం రోజులు ప్రజా బాహుళ్యంలో, 8 రోజుల పాటు న్యాయమూర్తి పరిశీలనలో టెండర్ డాక్యుమెంట్ ఉంటుంది.
6. మొత్తం 15 రోజుల్లో ప్రక్రియ పూర్తవుతుంది.
7. న్యాయమూర్తి సూచించిన మార్పుచేర్పులను తప్పనిసరిగా అమలు చేస్తూ టెండర్లను పిలుస్తారు.
ఇదీ ప్రభుత్వ ఉద్దేశం...
‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకతతో కూడిన వేగవంతమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తోంది. సమాన అవకాశాలు, వ్యయం, నాణ్యతా సూత్రాలను పాటిస్తూ సమర్ధవంతమైన రీతిలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను కల్పించాలని ధృఢంగా నిర్ణయించింది. ఈ లక్ష్యాలను సాధించేందుకు యావత్తు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను మరీ ముఖ్యంగా రూ.100 కోట్లు అంతకు మించిన విలువ గల ప్రాజెక్టుల పర్యవేక్షణ కోసం సమగ్ర చట్టం తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇందుకోసం ఉన్నత న్యాయస్థానానికి చెందిన గౌరవ న్యాయమూర్తి ఆధ్వర్యంలో తగిన యంత్రాంగం ఏర్పాటుకు చట్టం తేవాలని నిర్ణయించింది. గౌరవ న్యాయమూర్తి విధులు నిర్వర్తించడానికి అవసరమైన నిపుణులు, సిబ్బందిని ఆయన కోరిన విధంగా సమకూర్చుతుంది’’
కొత్త చట్టం పరిధిలోకి వచ్చేవి (పీపీపీ ప్రాజెక్టులతో సహా )
1.రోడ్లు (రాష్ట్ర రహదారులు, మేజర్ జిల్లా రోడ్లు, ఇతర జిల్లా రోడ్లు, గ్రామీణ రోడ్లు) వంతెనలు, బైపాస్‌లు
2. ఆరోగ్యం
3. భూమిని తిరిగి తీసుకొనుట
4. కాలువలు, ఆనకట్టలు
5. నీటిని సరఫరా చేయటం, శుభ్రపరచటం, పంపిణీ చేయుటం
6. వ్యర్ధ పదార్థాల నిర్వహణ
7. మురుగు, మురుగుపారుదల
8. పబ్లిక్ మార్కెట్లు
9. వర్తక ప్రదర్శన, సమ్మేళం, వస్తు ప్రదర్శన, సాంస్కృతిక కేంద్రాలు
10. పబ్లిక్ భవనాలు
11. దేశీయ జల రవాణా
12. గ్యాస్, గ్యాస్ పనులు
13. క్రీడలు, విహారాల మౌలిక సదుపాయాలు, పబ్లిక్ ఉద్యానవనములు, పార్కులు
14. రియల్ ఎస్టేట్
15. ఇ–గవర్నెన్స్ ప్రాజెక్టులు, ఐటీ మౌలిక సదుపాయాలు
16. ప్రైవేట్ రంగ కంపెనీలు, కంపెనీల కన్సార్టియంతో ఉమ్మడి అభివృద్ధి ఒప్పందం, జాయింట్ వెంచర్ ద్వారా పట్టణాభివృద్ధి
17. ఫైబర్ గ్రిడ్, వై–ఫై సర్వీసులతో సహా టెలి కమ్యునికేషన్, బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసులు
18. పునరుత్పాదక (సౌర–పవన) ఇంధన ప్రాజెక్టులతో సహా విద్యుత్ ఉత్పాదన, ప్రసారం, పంపిణీ
19. హై–వే ప్రాజెక్టులలో ఏకీకృత భాగంగా ఉన్న గృహ నిర్మాణం లేదా ఇతర కార్యకలాపాలతో సహా ఇతర హై–వే ప్రాజెక్టులు
20. ట్రాన్స్‌పోర్ట్ టెర్మినల్స్, డిపోలు
21. పట్టణ రవాణా ప్రాజెక్టులతో సహా రైల్వే వ్యవస్థ
22. ఓడ రేవులు, అంతర్‌దేశీయ ఓడరేవులు
23. లాజిస్టిక్ హబ్‌లు స్వేచ్ఛా వాణిజ్య ప్రదేశాలతో సహా పరిమితి లేకుండా వాటికి విమానాశ్రయాలు
24. ఆకర్షణీయ నగర ప్రాజెక్టులతో సహా పట్టణాభివృద్ధి ప్రాజెక్టులు
25. విద్యా సంస్థలు
Comments
Please login to add a commentAdd a comment