దీక్షలో జగన్
ఆదివారం ఉదయం 6 గంటల నుంచే చంచల్‌గూడ జైలులో నిరవధిక నిరాహార దీక్ష
సాక్షి, హైదరాబాద్: ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ముందెన్నడూ ఎరుగని విధంగా జైలులో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. రాష్ట్ర విభజన ప్రకటనతో కోట్లాది మంది ప్రజల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిన అధికార కాంగ్రెస్ నిరంకుశ వైఖరికి, అందుకు సహకరించిన ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం ధోరణికి నిరసనగా, తమకు న్యాయం చేయాలని కోరుతున్న ప్రజల పక్షాన ఆయన ఆదివారం నుంచి ఈ దీక్ష ప్రారంభించారు. బయట ఉన్నన్ని రోజులూ ప్రజా సమస్యలపై జగన్‌మోహన్‌రెడ్డి పలుసార్లు నిరాహార దీక్షలు చేపట్టారు.
జల దీక్ష, జన దీక్ష, లక్ష్య దీక్ష, ఫీజు పోరు, వ్యాట్ నిరసన, రైతు దీక్ష.. ఇలా పలు శాంతియుత దీక్షలతో ప్రజల గోడును ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఆయన ప్రయత్నించారు. అయితే విభజనపై కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష నిరంకుశ నిర్ణయం తీసుకోవడం, దీనికి నిరసనగా పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టిన ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేయడం, నాలుగు వారాలుగా సీమాంధ్రలో ఆందోళనలు హోరెత్తుతున్నా ప్రభుత్వం స్పందించని నేపథ్యంలో.. ప్రజల కోసం జగన్‌మోహన్‌రెడ్డి నేరుగా నిరవధిక నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఇది ఇటు రాజకీయ వర్గాల్లో, అటు ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.
ఉదయం 6 నుంచే దీక్ష మొదలు..
తానున్న చంచల్‌గూడ జైలులో ఆదివారం తెల్లవారుజాము నుంచే జగన్‌మోహన్‌రెడ్డి నిరవధిక నిరాహార దీక్షను చేపట్టారు. ప్రతి రోజూ ఉదయం తీసుకునే అల్పాహారాన్ని ఆదివారం ఉదయం ఆయన ముట్టుకోలేదు. మధ్యాహ్నం భోజనం చేయలేదు. రాత్రి భోజనం చేయలేదు. వీఐపీ కేటగిరీ ఉన్న జగన్ తన బ్యారక్‌లోనే సొంతగా వంట చేయించుకుంటారు. కానీ దీక్ష కారణంగా ఆదివారం ఎలాంటి వంటా చేయించుకోలేదు. దాంతో మధ్యాహ్నం భోజనం చేయాల్సిందిగా జైలు అధికారులు కోరగా ఆయన సున్నితంగా తిరస్కరించారు. మళ్లీ సాయంత్రం కూడా జైలు అధికారులు ఆయన బ్యారక్‌కు వెళ్లి ఆహారం తీసుకోవాలని కోరినా జగన్ అంగీకరించలేదు. రోజంతా ఏమీ తీసుకోకపోవడంతో వైద్యులు వచ్చి ఆయనకు పరీక్షలు నిర్వహించారు. జగన్ ఆరోగ్యం నిలకడగానే ఉందని జైలు వైద్యులు చెప్పారు. ఆహారం తీసుకోని కారణంగా వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతుందని జైలు అధికారులు వెల్లడించారు.
సమన్యాయం చేయలేనపుడు...
అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయలేనపుడు రాష్ట్రాన్ని యథాతథంగా కొనసాగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రధానంగా డిమాండ్ చేస్తోంది. ఇదే డిమాండ్‌తో ఈ నెల 19 నుంచి పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ గుంటూరులో ఆమరణ నిరాహారదీక్షకు దిగారు. 24వ తేదీతెల్లవారుజామున పోలీసులు ఒక్క ఉదుటున దీక్షా శిబిరంలోకి దూసుకొచ్చి ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడ కూడా దీక్షను కొనసాగిస్తున్న విజయమ్మకు జగన్ నచ్చ జెప్పి విరమింపజేశారు. శనివారం జైలులో తనను కలిసిన పార్టీ ముఖ్య నేతలు కొణతాల రామకృష్ణ, ధర్మాన కృష్ణదాస్, భూమా నాగిరెడ్డితో జరిపిన సంప్రదింపుల్లో తానే ఆమరణ దీక్షను చేపట్టాలన్న అభిమతాన్ని జగన్ వారికి వెల్లడించారు. ఆ ప్రకారం ఆదివారం ఉదయం 6 గంటల నుంచి ఆయన ఏమీ తీసుకోకుండా దీక్షను కొనసాగిస్తున్నారు.
జగన్‌ను కలిసేందుకు సాధారణ ఖైదీలకూ అనుమతివ్వలేదు
చంచల్‌గూడ జైల్లో జగన్‌ను కలిసి మద్దతు తెలిపేందుకు కొందరు సాధారణ ఖైదీలు ప్రయత్నించగా అధికారులు వారించినట్లు సమాచారం. చంచల్‌గూడ జైల్లో కృష్ణా, గోదావరి, గంగా బ్యారక్‌లలో సాధారణ ఖైదీలను ఉంచుతారు. పాత ఆస్పత్రి బ్యారక్‌ను వీఐపీ ఖైదీల బ్యారక్‌గా వినియోగిస్తున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సహా ఏడుగురు వీఐపీ కేటగిరీ ఖైదీలను పాత ఆస్పత్రి బ్యారక్‌లో ఉంచుతున్నారు. జైలు అధికారులు అనుమతించినపుడు మాత్రమే సాధారణ ఖైదీలు వీఐపీ బ్యారక్‌లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. సాధారణ ఖైదీలుండే మూడు బ్యారక్‌లూ నూతనంగా నిర్మించినవి. వీఐపీ బ్యారక్‌లోకి సాధారణ ఖైదీలు వచ్చే వీలులేకుండా పటిష్ట భద్రతా చర్యలను తీసుకుంటున్నారు.
అప్రకటిత నిషేధం..
జగన్ దీక్షలో ఉన్న తరుణంలో చంచల్‌గూడ జైలు చుట్టుపక్కల ప్రాంతాలలో పోలీసులు అప్రకటిత నిషేధాన్ని అమలు చేశారు. జైలు వద్దకు వెళ్లే దారులను ముళ్లకంచెలతో మూసివేశారు. చంచల్‌గూడ జైలు బయట ఏకంగా పెద్ద సంఖ్యలో పారా మిలటరీ బలగాలను మోహరించారు. ఆదివారం ఉదయం నుంచి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్‌ఎఫ్) బలగాలను రంగంలోకి దించారు. చంచల్‌గూడ జైలు వద్ద ఇంతభారీస్థాయిలో పారా మిలటరీ బలగాలను మోహరించడం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి. జగన్‌మోహన్‌రెడ్డి నిరాహార దీక్షకు మద్దతుగా జైలు వద్దకు చేరుకునేందుకు ప్రయత్నించిన కార్యకర్తలు, అభిమానులను పోలీసులు, పారా మిలటరీ బలగాలు అడ్డుకున్నాయి. అయినప్పటికీ ఉదయం నుంచి సాయంత్రం వరకూ అభిమానులు, కార్యకర్తలు చంచల్‌గూడ జైలు వద్దకు చేరుకుని జగన్ దీక్షకు మద్దతు పలికారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రచార కమిటీ రాష్ట్ర కోఆర్డినేటర్ విజయచందర్, మాజీ మంత్రి ఎం మారెప్ప, నగర మహిళా నాయకురాలు సూరజ్ నేతృత్వంలో పలు దఫాలుగా కార్యకర్తలు జైలు వద్దకు చేరుకునే యత్నం చేశారు.
ఇతర నాయకులు ఎండీ అబీద్‌ఖాన్(తాండూరు), ఎస్.గోవిందనాయుడు(అనంతపురం), పోరెడ్డి నరసింహారెడ్డి(ప్రొద్దుటూరు), బి.మోహన్‌కుమార్(ఓల్డ్ సిటీ) జైలు వద్దకు చేరుకున్నారు. వారిని పోలీసులు పలు దఫాలుగా అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి పంపేశారు. పోలీసు భద్రతను ఛేదించుకుని మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో జైలు ప్రధాన గేటు వద్దకు చేరుకున్న జి.క్రిస్టోలైట్ (విద్యానగర్), లలిత(నల్లగొండ) అనే ఇద్దరు మహిళలు అక్కడే జగన్‌కు మద్దతుగా నిరాహారదీక్షకు దిగారు. వారిని వారించేందుకు పోలీసులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సాయంత్రం వరకూ రోడ్డుపై దీక్ష చేసిన అనంతరం స్వచ్ఛందంగా విరమించారు. జంగంమెట్‌కు చెందిన పార్టీ యువజన విభాగం నేత రషీద్ నేతృత్వంలో కూడా పలువురు మైనారిటీ యువకులు అడ్డంకులకు తొలగించుకుంటూ ప్రధాన ద్వారం వద్ద జగన్‌కు సంఘీభావంగా కొద్ది సేపు బైఠాయించారు. ‘జగనన్నా.. సంఘర్ష్ కరో... హమ్ తుమ్హారా సాథ్ హై!’ అని నినాదాలు చేశారు.
సీమాంధ్రవ్యాప్తంగా సంఘీభావం..
జైల్లో జగన్ చేపట్టిన దీక్ష యావత్ సీమాంధ్ర ప్రజలను కదిలించింది. జగన్‌మోహన్‌రెడ్డి దీక్షకు మద్దతుగా ఆదివారం సీమాంధ్ర వ్యాప్తంగా పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు, అభిమానులు కూడా నిరవధిక నిరాహార దీక్షలకు దిగారు. జగన్ దీక్షకు మద్దతుగా ప్రజలు ఎక్కడికక్కడ రాస్తా రోకోలు, ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. యువకులు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజా సంఘాల ప్రతినిధులు వీటిలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జైలులో జగన్ దీక్ష నేపథ్యంలో అనేక ప్రాంతాల నుంచి పార్టీ కార్యాలయానికి ప్రజలు, కార్యకర్తలు పెద్దఎత్తున ఫోన్లు చేసి వాకబు చే స్తున్నారు.