
సొంతింటి కల నెరవేరుస్తా..
‘నంద్యాల వైఎస్‌ఆర్ నగర్ వాసులు ఇళ్లు లేవని ఆందోళన చెందొద్దు. అండగా నేనున్నా
► పేదలకు ఇళ్లు కట్టించి రిజిష్టర్ పత్రాలు అందిస్తా
► మోసపూరిత సీఎంను సాగనంపండి
►12వ రోజు రోడ్‌షోలో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పిలుపు
► జననేతను చూసేందుకు జోరువానలోనూ పోటెత్తిన ప్రజలు
సాక్షి బృందం, నంద్యాల : ‘నంద్యాల వైఎస్‌ఆర్ నగర్ వాసులు ఇళ్లు లేవని ఆందోళన చెందొద్దు. అండగా నేనున్నా. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి పేదవాడికీ ఇళ్లు కట్టించి రిజిష్టర్ పత్రాలు అందిస్తాం’ అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. తన తండ్రి వైఎస్‌ఆర్.. ఈ కాలనీకి 4,500 ఇళ్లు మంజూరు చేశారని, ఇంకా రెండు వేల ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పనులు చేయిస్తామని హామీ ఇచ్చారు. తమ కాలనీని ఖాళీ చేయాలని ప్రభుత్వం హుకుం జారీ చేసిందని ఎస్సార్బీసీ కాలనీకి చెందిన నరసింహారావు .. జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తేగా.. కాలనీ ప్రజలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 12వ రోజు రోడ్‌షో వర్షంలోనూ కొనసాగింది. జోరుగా వర్షం కురుస్తున్నా.. తడిసి ముద్దయినా యధావిధిగా ›ప్రచారం కొనసాగింది. ఆదివారం రోడ్‌షో ప్రారంభమైన సంఘమిత్ర నుంచే వర్షం ప్రారంభమైంది. వర్షాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా జగన్‌మోహన్‌రెడ్డి ప్రచారం కొనసాగించారు. ఈ సమయంలో జగనన్నను కలిసిన ముంతాజ్ అనే అరవైఏళ్ల వృద్ధురాలు ‘జగన్ వచ్చాక వర్షం కురవకుండా ఉంటుందా నాయనా’ అంటూ వానలో నిలిచి పొంగిపోయింది. సుప్రజ అనే విద్యార్థిని వర్షంలోనే తడుస్తూ జగన్‌కు రాఖీ కట్టి సంబరపడింది.
ప్రియాంకనగర్ నుంచి సూరజ్ గ్రాండ్ చేరుకునే సరికి వర్షం మరింత అధికమైంది. దీంతో అక్కడి ప్రజలు ‘జగన్ వచ్చాడు.. వానొచ్చిందం’టూ కేరింతలు కొట్టారు. అక్కడి నుంచి రోడ్ షో డేనియల్‌పురం, సంజీవనగర్, రాణి, మహారాణి టాకీస్ మీదుగా నందమూరి నగర్‌కు చేరుకుంది. జగన్ ఓ వైపు తడుస్తూనే రోడ్‌షో కొనసాగించడంతో మహిళలు, వృద్ధులు, యువకులు అన్న తేడా లేకుండా పెద్ద ఎత్తున ప్రజలు తడుస్తూనే తమ అభిమాన నేతను చూసేందుకు పోటీ పడ్డారు. వర్షంలోనే మహిళలు జగనన్నా అంటూ రాఖీలు కట్టేందుకు పోటీపడ్డారు. యువకులు బాణా సంచా కాలుస్తూ కేరింతలు కొట్టారు. నందమూరి నగర్‌లోని ప్రజలందరూ ‘చంద్రబాబు నంద్యాల వదిలాడు.. జగన్ మన ప్రాంతానికి వచ్చాడు... వర్షం కురిసిందం’టూ నినాదాలు చేశారు.
అండగా ఉంటామంటూ భరోసా..
ప్రియాంక నగర్ రోడ్‌షో నుంచి ముందుకు సాగిన జననేత.. 35వ వార్డు కౌన్సిల్ సభ్యురాలు జిమ్మక్ మహబూబ్‌బీ బేగం ఇంటికి వెళ్లి ఆమె భర్త, మాజీ కౌన్సిలర్ మహబూబ్ బాషాను కలిసి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహబూబ్‌బాషా మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2004లో ముఖ్యమంత్రి అయ్యాక నంద్యాలకు వచ్చిన సమయంలో తన ఇంటికి వచ్చారని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు జగనన్న రావడం సంతోషదాయకమన్నారు. అప్పుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఏం కావాలో కోరుకోమనగా కుందూనది, శ్యామకాలువ, మద్దిలేరు వాగు పొంగిపొర్లి ఇళ్లలోకి నీరు వస్తోందని తెలపడంతో శాశ్వత పనులు చేపడతామని హామీ ఇచ్చారన్నారు.
సీఎం అయిన వెంటనే ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి కృషి చేయాలని జగన్‌ను కోరారు. తనకు మెదడు ఆపరేషన్ జరిగిందని తెలుసుకుని ఇంటికి వచ్చి పరామర్శించడం ఆనందంగా ఉందన్నారు. కార్పెంటర్ దాదావలి ఇంటిలోకి వెళ్లి ఆపరేషన్ చేయించుకున్న దాదావలిని జగన్ పరామర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వైఎస్‌ఆర్‌నగర్‌లో నూర్జహాన్ ఇంటికి వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత అదే నగర్‌లో ఆల్‌జామియతుల్ అరబియా అయిషా నిస్వాన్ సంస్థలోకి జగన్‌ను ముస్లింలు ఆహ్వానించడంతో అక్కడికి చేరుకుని వారితో కలిసి దువా చేశారు. డేనియల్ పురంలో సీఎస్‌ఐ క్రైస్ట్ చర్చిలో పాస్టర్ ప్రసాదరావు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పదకొండు గంటలపాటు సాగిన రోడ్‌షోలో పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత పాల్గొన్నారు.
అడుగడుగునా బ్రహ్మరథం...
జననేత జగన్‌కు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సంఘమిత్ర కాలనీలో సుధాకర్‌రెడ్డి, పూర్ణమ్మ దంపతులు జగన్‌కు హారతులిచ్చి పూలమాల వేసి స్వాగతం పలికారు. చెన్నారెడ్డి, పద్మావతి దంపతులు తమ ఇంటి ముందు జగన్‌కు గుమ్మడికాయతో దిష్టితీశారు. వసుంధర, రుక్జాన, అన్వర్, అభిష్ అశ్విత్, కుమారి, యామిని, సుజాత, వైఎస్‌ఆర్ నగర్‌లో వాసంతి, రామేశ్వరమ్మ ఇలా పలువురు మహిళలు జగన్‌కు గజమాలలు వేసి హారతులు ఇచ్చి వీరతిలకం దిద్ది రాఖీ కట్టారు. ఇలా అన్ని కాలనీల్లో పెద్ద ఎత్తున మహిళలు, యువకులు జగన్‌కు బ్రహ్మరథం పట్టారు. గంటల తరబడి ప్రజలు ఎదురుచూసి జననేతపై అభిమానం చాటుకున్నారు.
భయపడకుండా వైఎస్‌ఆర్‌సీపీకి ఓటు వేయండి: శిల్పా
నంద్యాల ఓటర్లు భయపడకుండా వైఎస్‌ఆర్‌సీపీకి ఓటు వేసి గెలిపించాలని పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి కోరారు. నందమూరి నగర్, వైఎస్‌ఆర్‌నగర్‌లో జరిగిన రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ ఏ కాలనీలోని ప్రజల ఇళ్ల పట్టాలు రద్దు కావని, రేషన్‌కార్డులు, పింఛన్లు తొలగించరని తెలిపారు. ఈ విషయంలో టీడీపీ నాయకుల బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని, అండగా ఉంటామన్నారు. 2004లో ఈ కాలనీలకు రహదారులు, మంచినీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం లేదని, మూడు బోర్లు వేసి నీరందించానని అప్పటి నుంచి ఈ కాలనీ అభివృద్ధికి కృషి చేశానని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ చలువతో ఈ రెండు కాలనీలను మున్సిపాల్టీలో కలిపారని పేర్కొన్నారు. ధర్మంవైపు నిలిచి ఓటు వేయాలని ప్రజలను కోరారు.
మోసపూరిత చంద్రబాబును ఇంటికి సాగనంపుదాం..
మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను మభ్యపెడుతున్న చంద్రబాబును ఇంటికి సాగనంపాలని నందమూరినగర్, వైఎస్‌ఆర్ నగర్‌లో నిర్వహించిన రోడ్‌షోలో ప్రతిపక్ష నేత జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు. వైఎస్‌ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిత్యావసర దుకాణాల్లో 9 రకాల సరుకులు అందేవని, నేడు బియ్యం తప్ప ఏమీ అందడం లేదన్నారు. ప్రజలు రెండు కారణాల వల్ల పేదలవుతారన్నారు.
ఉన్నత చదువులు చదువుకునే సమయంలో ఫీజులు కట్టలేక చదువు మధ్యలో ఆగిపోతుందని, ప్రతి పేదవాడు అస్వస్థతకు గురైతే ఆసుపత్రులకు వెళ్లి చికిత్స చేయించుకోవాలంటే అప్పులు చేయాల్సి ఉందని గుర్తించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలు చేసి డాక్టర్, లాయర్, ఇంజినీర్, ఇలా ఏ ఉన్నత చదువు చదువుకోవాలన్నా ఉచిత విద్యనందించారన్నారు. కేన్సర్, కిడ్నీ, గుండె వంటి ప్రాణాంతక వ్యాధులకు ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్యం అందించి చిరునవ్వుతో వారిని ఇంటికి పంపించారన్నారు. నేడు అధికారంలో ఉన్న చంద్రబాబు ఈ పథకాలకు చరమగీతం పాడారని, ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారన్నారు.