సాక్షి ప్రతినిధి, ఒంగోలు: బిడ్డను ఆశీర్వదించండి... తోడుగా ఉండి చల్లని దీవెనలు అందించండి.. మీ ఆశీస్సులతో అధికారంలోకి వచ్చి అన్ని సమస్యలు పరిష్కరించి అందరి కన్నీళ్లు తుడుస్తా’నంటూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జనానికి భరోసా ఇచ్చారు. కనిగిరి నియోజకవర్గంలో ఎనిమిదో రోజు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్రకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. అడుగడుగునా పూలు చల్లి జగన్‌కు స్వాగతం పలికారు. ఆయన వద్ద సమస్యలు ఏకరువు పెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పిన హామీలు తుంగలో తొక్కి అందరినీ మోసగించిందని జగన్ దృష్టికి తెచ్చారు. రైతులను, మహిళలను, యువకులతో పాటు అన్ని వర్గాల ప్రజలకిచ్చిన హామీలు ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. జనం కష్టాలు విని స్పందించిన జగన్ మీ అందరి
ఆశీర్వాదంతో అధికారంలోకి వస్తూనే సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కనిగిరి ప్రాంతంలో ఫ్లోరైడ్‌ను తొలగించేందుకు వెలిగొండ నీటిని తరలిస్తామన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, మహిళలకు అన్ని విధాలా ప్రభుత్వం సాయమందిస్తుందని ఆడబిడ్డల చదువులకు తానే ఆర్థికసాయం అందిస్తానని వృద్ధులు బాగోగుల కోసం రూ.2 వేలు పింఛన్ ఇస్తానని జగన్ అందరికీ భరోసానిచ్చారు.
జగన్‌తో కలిసి నడిచిన బాలినేని, వై.వి.సుబ్బారెడ్డి
ఎనిమిదో రోజు ప్రజా సంకల్పయాత్రలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి, కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్త బుర్రా మధుసూదన్‌యాదవ్‌లతో పాటు పలువురు పాదయాత్రలో కలిసి నడిచారు.
జగన్‌కు సమస్యల ఏకరువు
► అగ్రిగోల్డ్ సంస్థ తమకు చెల్లించాల్సిన రూ.20 లక్షలను ఇప్పించేం దుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఏరువారిపల్లి గ్రామానికి చెందిన బాధిత మహిళలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి విన్నవించారు.
►కనిగిరి పాలకేంద్రం రైతులకు చెల్లించాల్సిన పాల డబ్బులు రూ.కోటి, రవాణా ఖర్చులు రూ.67 లక్షలు ప్రభుత్వం ఎగవేసిందని రైతులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు.
►చింతలపాలెం గ్రామానికి చెందిన కనిగిరి మున్సి పల్ పారిశుద్ధ్య కార్మికుడు వెలిగొండయ్య (32) సర్వీస్ చేసి మరణిస్తే ప్రభుత్వం అతనికి ఇవ్వాల్సిన మొత్తాన్ని ఇవ్వలేదని ఆయన సతీమణి సానం ఆదిలక్ష్మి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి విన్నవించారు.
►మతిస్థిమితం లేని కుమారుడు తాళ్లూరి చిన్నయ్యకు ప్రభుత్వం పింఛన్ ఇవ్వడం లేదని శంఖవరం ఎస్సీ కాలనీకి చెందిన చిన్నయ్య తల్లి జగన్ దృష్టికి తెచ్చారు.
►మంగళగిరికి చెందిన చిడిపూడి జయలక్ష్మి దంపతులు శనివారం ప్రజాసంకల్పయాత్రలో జగన్‌ను కలిసి కూతురు పెళ్లి శుభలేఖను అందజేశారు.
►శనివారం ప్రజాసంకల్పయాత్రలో చింతలపాలెం మహిళలు 101 గుమ్మడికాయలతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి దిష్టి తీశారు.
►పీసీపల్లి మండలం గుంటుపల్లి గ్రామానికి చెందిన పండ్ల తోటల రైతులు తమకు సాగు నీరు అందించడంతో పాటు ఈ ప్రాంతంలో జ్యూస్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పాదయాత్రలో వైఎస్ జగన్‌ను కలిసి కోరారు.
►అధికార పార్టీకి చెందిన కార్యకర్తలకు తప్ప అర్హత ఉన్న మిగిలిన వారికి ప్రభుత్వం పక్కా గృహాలు ఇవ్వడం లేదని వాగుపల్లికి చెందిన ముద్దా సుశీల మరికొందరు పాదయాత్రలో వైఎస్ జగన్‌ను కలిసి విన్నవించారు.
►భర్త చనిపోయి ఐదేళ్లు అవుతున్నా టీడీపీ ప్రభుత్వం వితంతు పింఛన్ అందించకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఏరువారిపల్లెకు చెందిన బల్లి నర్సమ్మ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అర్జీ ఇచ్చారు.
►భార్యభర్తలిద్దరూ పక్షవాతానికి గురై ఆరోగ్యం సరిగా లేక ఆర్థిక ఇబ్బందులతో అవస్థలు పడుతున్నామని మలి వయస్సులో ఉన్న తమను ఆదుకుని ఆరోగ్యశ్రీ కల్పించాలని వీర్ల వెంకట సుబ్బమ్మ, సుబ్బయ్యలు వైఎస్ జగన్‌ను కలిసి అర్జీ ఇచ్చారు.
ఎనిమిదో రోజు యాత్ర ఇలా..
ఎనిమిదో రోజు కనిగిరి నియోజకవర్గంలోని హాజీస్‌పురం నుంచి ప్రారంభమైన యాత్ర కంఠంవారిపల్లి క్రాస్, చినఇర్లపాడు క్రాస్, పేరంగుడిపాడు, చింతలపాలెం మీదుగా శంఖవరం వరకు సాగింది. భోజన విరామం అనంతరం కనిగిరి బహిరంగ సభలో పాల్గొని జగన్ మాట్లాడారు. సాయంత్రానికి టకారిపాలెం వద్దకు యాత్ర చేరుకుంది. ఎనిమిదో రోజు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 12.7 కి.మీ. మేర నడిచారు.
Comments
Please login to add a commentAdd a comment