గురువారం సచివాలయంలో 2020–21కు సంబంధించిన నాబార్డు స్టేట్ ఫోకస్ పేపర్‌ను విడుదల చేస్తున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం, మంత్రి కన్నబాబు, సీఎస్ నీలం సాహ్ని, వివిధ బ్యాంకుల అధికారులు
రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులను అందించాలి. ఈ కార్డులను రైతు భరోసా కేంద్రాలకు లింక్ చేసేలా చూడాలి. దీనివల్ల వ్యవసాయ రంగానికి ఆర్థిక తోడ్పాటు అందుతుంది. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి రుణాలు ఇవ్వాలి. ప్రభుత్వం వైపు నుంచి కట్టాల్సిన వడ్డీలు కడతాం. ఒక్కో నియోజకవర్గంలో కనీసం 5 వేల మందికి క్రెడిట్ కార్డులు ఇచ్చి, రూ.10 వేల చొప్పున రుణాలు అందిస్తే వారి జీవితాలు మెరుగు పడతాయి. వీరిని గ్రామ సచివాలయాలకు లేదా స్వయం సహాయక సంఘాలకు లింక్ చేయొచ్చు.
–ముఖ్యమంత్రి వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: దేశంలో ఆర్థిక మాంద్యం నెలకొన్న తరుణంలో దాని ప్రభావం మొదట ప్రాథమిక రంగాలపైనే.. అంటే వ్యవసాయంపైనే ఎక్కువగా ఉంటుందని, అందువల్ల ఈ రంగాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఇప్పటి వరకు నాబార్డు, రాష్ట్ర ప్రభుత్వం కలిసి పని చేస్తున్నాయని, ఇక ముందు కూడా మరింత సమన్వయంతో కలిసి పని చేయడం ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాల్సి ఉందని చెప్పారు. మరిన్ని కార్యక్రమాలకు నాబార్డు సహకారం అందించాలని కోరారు. గురువారం ఆయన సచివాలయంలో 2020–2021కు సంబంధించిన నాబార్డు స్టేట్ ఫోకస్ పేపర్‌ను విడుదల చేశారు. (2020–21లో ప్రాథమిక రంగానికి రూ.2,11,865.38 కోట్ల రుణాలు ఇవ్వాలనేది నాబార్డు లక్ష్యం. చదవండి: రైతులకు అన్ని విధాలా భరోసా
ఇందులో రూ.1,34,402.52 కోట్లు వ్యవసాయ రుణాలు) ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్రం వ్యవసాయ ఆధారితమని, 62 శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం, అనుబంధ రంగాలకు అపారమైన అవకాశాలున్నాయని, ఆక్వా, ఫిషరీస్ లాంటి వ్యవసాయ అనుబంధ రంగాల్లో నంబర్ వన్‌గా ఉన్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు గతంలో ఎక్కడా అమలు చేయలేదని సీఎం పేర్కొన్నారు. రైతు భరోసా కింద 46 లక్షల మంది రైతులను ఆదుకున్నామని, 69 శాతం మంది రైతులకు ఒక హెక్టార్ కంటే తక్కువ భూమి ఉందని, సగం హెక్టార్ కన్నా తక్కువ ఉన్న రైతులు 50 శాతం మంది ఉన్నారని, వీరికి ఏటా రూ.13,500 రైతు భరోసా కింద అందిస్తున్నామని చెప్పారు.
వారికి 80 శాతం వ్యవసాయ పెట్టుబడులు సమకూరుస్తున్నామని వివరించారు. ఇది వారికెంతో ఊరటనిచ్చే అంశమని, అలాగే వడ్డీలేని రుణాలు అందిస్తున్నామన్నారు. రైతులు కట్టాల్సిన బీమా ప్రీమియంను ప్రభుత్వమే కడుతోందని, ఆ భారం రైతుల మీద లేకుండా చేశామని చెప్పారు. ఏ రైతు కూడా నష్టపోకుండా రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, ప్రకృతి వైపరీత్యాల నుంచి ఆదుకునేందుకు విపత్తు నిధి పెట్టామన్నారు. అన్ని పంటలకూ కనీస మద్దతు ధరలు ప్రకటించామని, ఈ ధరల కన్నాతక్కువకు అమ్ముకునే పరిస్థితి ఉంటే ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని సీఎం తెలిపారు. చదవండి: ఏపీకి రూ.21,000 కోట్ల ఏఐఐబీ రుణం
రైతు భరోసా కేంద్రాలకు నాబార్డు సహకారం కావాలి
ప్రతి 2 వేల జనాభాకు 10 మంది ఉద్యోగులతో ఒక గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేశామని, వీటి పక్కనే వచ్చే ఖరీఫ్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 11 వేలకుపైగా రైతు భరోసా కేంద్రాలను పెడుతున్నామని, వీటికి నాబార్డు సహకారం అందించాలని సీఎం వైఎస్ జగన్ కోరారు. అగ్రికల్చర్ అసిస్టెంట్, హార్టికల్చర్ అసిస్టెంట్, ఫిషరీస్ అసిస్టెంట్, ఆక్వా అసిస్టెంట్లను గ్రామ సచివాలయాల్లో పెట్టామని, వీరు ఉత్తమ యాజమాన్య పద్ధతులపై రైతులకు మార్గనిర్దేశం చేస్తారన్నారు.
రైతు భరోసా కేంద్రాల్లో కియోస్క్, ఇంటర్నెట్ ఉంటుందని, నాణ్యమైన, ప్రభుత్వం పరీక్షించిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అమ్ముతారని సీఎం వివరించారు. ఈ మేరకు ప్రభుత్వం వివిధ కంపెనీలతో ఒప్పందం చేసుకుందన్నారు. ఈ కంపెనీలు మండలాల వారీగా హబ్‌లను ఏర్పాటు చేస్తాయని, ఆర్డర్ ఇచ్చిన 24 నుంచి 48 గంటల్లోగా రైతులకు కావాల్సినవి అందుతాయని సీఎం పేర్కొన్నారు. సేకరణ కేంద్రాలుగా కూడా రైతు భరోసా కేంద్రాలు పని చేస్తాయని, ఏ పంట వేసుకోవాలన్న దానిపై సలహాలు కూడా ఇస్తాయన్నారు. ఈ కార్యక్రమాలకు నాబార్డు సహకారం కావాలని కోరారు.
కోల్డ్ స్టోరేజీల సంఖ్య పెరగాలి
నాబార్డు ఇప్పటికే కొన్ని కార్యక్రమాలకు సహకారం అందిస్తోందని, ఇప్పుడు ఏర్పాటు చేస్తున్న అగ్రిల్యాబ్స్‌కు కూడా సహకరిస్తున్నందుకు ధన్యవాదాలని సీఎం అన్నారు. రాష్ట్రంలో సరిపడా గోదాములు అందుబాటులో లేవని, కొనుగోలు చేసిన వ్యవసాయ ఉత్పత్తులను ఉంచడానికి సరైన స్థలం లేదని, కోల్డ్ స్టోరేజీ సదుపాయాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టామని, తర్వాత నెమ్మదిగా అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం వివరించారు.
పోలవరంపై దృష్టి సారించాలి
పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి గుండెకాయ లాంటిదని ముఖ్యమంత్రి అన్నారు. కృష్ణాలో నీళ్లు రావడం లేదని, మరోవైపు గోదావరిలో నీళ్లు సముద్రంలోకి వృథాగా పోతున్నాయని చెప్పారు. రూ.5 వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తే.. దానిపై వడ్డీ సుమారుగా రూ.500 కోట్లకుపైగా కడుతున్నామని, సకాలానికి డబ్బులు రావడం లేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇప్పుడు ఇచ్చిన సుమారు 1,800 కోట్లకుపైగా డబ్బులు నాబార్డు నుంచి పీపీఏకు వెళ్లాయని, అవి ఇంకా రాలేదన్నారు. ఈ సమస్య తీర్చడానికి నాబార్డు పూర్తి స్థాయి సహకారం అందించాలని ముఖ్యమంత్రి జగన్ కోరారు.
2021 నాటికి ప్రాజెక్టు పూర్తి కావాలంటే శరవేగంగా పనులు పూర్తి చేయాలని, కనీసం ఏడాదికి రూ.10 వేల కోట్ల చొప్పున ఆర్ అండ్ ఆర్ కింద కావాల్సి వస్తుందన్నారు. సివిల్ పనుల కోసం ఈ ఏడాదే రూ.6 వేల కోట్లు కావాల్సి ఉన్నందున, ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి మానస పుత్రికలైన రైతు భరోసా కేంద్రాలకు నాబార్డు సహకారం అందించాలని కోరారు. బలమైన గ్రామ సచివాలయ వ్యవస్థను నాబార్డు ఉపయోగించుకోవాలని ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయకల్లం సూచించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ నీలం సాహ్ని, నాబార్డ్ జనరల్ మేనేజర్ ప్రభాకర్ బెహరా, వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.
పూర్తి సహకారం అందిస్తాం
రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. నవరత్నాల కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. రైతు భరోసా, వడ్డీలేని రుణాలు ఇతరత్రా కార్యక్రమాలను రైతుల కోసం అమలు చేస్తోంది. ఇవన్నీ రైతుల ఆదాయాలను రెట్టింపు చేసే కార్యక్రమాలే. ధరల స్థిరీకరణ నిధి, ప్రకృతి వైపరీత్యాల నిధితో రాష్ట్రం మార్గదర్శకంగా నిలిచింది. ప్రాథమిక రంగం బలోపేతానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం.
– సెల్వరాజ్, నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్
Comments
Please login to add a commentAdd a comment