సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘నాడు–నేడు’ కార్యక్రమానికి నాబార్డు చేయూత అందిస్తోంది. ‘నాడు–నేడు’ ద్వారా మూడు దశల్లో ఆస్పత్రులు, పాఠశాలల రూపురేఖలు మార్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ కార్యక్రమానికి ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి జగన్ కోరిన నేపథ్యంలో తొలిసారిగా ఎక్కువ మొత్తంలో సాయం అందించేందుకు నాబార్డు ముందుకు వచ్చింది.
స్కూళ్లకు రూ.515.06 కోట్లు.. ఆస్పత్రులకు రూ.533.76 కోట్లు
ఆస్పత్రులు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నాబార్డు రూ.1,048.82 కోట్లు మంజూరు చేసింది. తొలిదశలో నాడు–నేడు ద్వారా 15,715 పాఠశాలలను అభివృద్ధి చేస్తుండగా 510 స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పనకు నాబార్డు రూ.515.06 కోట్లు మంజూరు చేసింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలకు సంబంధించి తొలి దశలో చేపట్టే 44 పనులకు రూ.533.76 కోట్లను మంజూరు చేసినట్లు నాబార్డు అధికారులు పేర్కొన్నారు.
ఫోకస్ పత్రంలో నాడు – నేడు
నాబార్డు గతంలో చాలా తక్కువ మొత్తంలో ఈ కార్యక్రమాలకు నిధులు మంజూరు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నేపథ్యంలో ఎక్కువ మొత్తంలో నిధులు ఇస్తోందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. నాబార్డు 2020–21 రాష్ట్ర ఫోకస్ పత్రంలో మనబడి నాడు–నేడు కార్యక్రమాన్ని ప్రస్తావించింది. దీనివల్ల విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వస్తాయని తెలిపింది. వైఎస్సార్ ఆరోగ్యశ్రీతో పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పనను నాబార్డు ఫోకస్ పత్రంలో పేర్కొంది. సామాజిక రంగ అభివృద్ధిలో భాగంగా నాడు–నేడు కార్యక్రమానికి ఇక ముందు కూడా నాబార్డు ఆర్థిక సాయాన్ని కొనసాగించనుందని ఓ ఉన్నతాధికారి చెప్పారు. నాడు–నేడు కార్యక్రమానికి నాబార్డు రూ.వెయ్యి కోట్లకు పైగా నిధులను మంజూరు చేసిందని ముఖ్యమంత్రి అదనపు సీఎస్ పీవీ రమేశ్ ‘సాక్షి’కి తెలిపారు.
పశు వైద్యానికి రూ.150.33 కోట్లు
క్షేత్రస్థాయిలో పశు వైద్యానికి రూ.159.33 కోట్ల ఆర్థిక సాయాన్ని మంజూరు చేసినట్లు నాబార్డు అధికారులు తెలిపారు. వెటర్నరీ ఇన్‌స్టిట్యూషన్‌కు ఈ ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. పశువుల టీకాలు, ఇతర వైద్య చికిత్సలకు ఈ నిధులను వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment