
'ప్రతి ఒక్కరూ వైఎస్సార్ ను గుండెల్లో పెట్టుకున్నారు'
చిత్తూరు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ప్రతి ఒక్కరూ గుండెల్లో పెట్టుకున్నారని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. సమైక్య శంఖారావంలో భాగంగా అరగొండ సభకు హాజరైన ఆయన ముందుగా వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులు అర్పించారు. అనంతరం అశేష జనవాహినిని ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. ప్రతి ఒక్కరి గుండెల్లో వైఎస్సార్ ఎప్పటికీ నిలిచిపోతారన్నారు. పేదవాడి కొడుకు కలెక్టర్, డాక్టర్ కావాలని వైఎస్సార్ కలలు కన్నారని, ఆ కలలు సాకారమయ్యే దిశగా పయనించాలని ఆయన తెలిపారు. పేదరికం చదువుకు అడ్డుకాకుడదని ఆ మహానేత భావించారని జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
పేదరికాన్ని వైఎస్సార్ అర్ధం చేసుకున్నట్లుగా ఎవరూ అర్ధం చేసుకోలేదన్నారు. రాముని రాజ్యం ఎలా ఉంటుందో ఎవరూ చూడకపోయినా, రాజన్న సువర్ణయుగాన్ని అందరూ చూశారన్నారు. ఆనాటి సువర్ణయుగాన్ని తిరిగి తీసుకొద్దామని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.