
‘దీక్షాధారి’ దారిలో.. ఉప్పొంగిన అభిమాన ఝరి
తమ పక్షాన పోరాడే యోధునికి జనం సైదోడన్నారు. తమ మేలు కోరే వాడికి మనసారా జేజేలు పలికారు. ఎక్కడైనా, ఎన్నడైనా.. తమ కోసం నిలిచే, తాము పిలిస్తే పలికే ఆ జననేతపై తాము పెంచుకున్న గురిని అడుగడుగునా చాటారు. ‘రైతుదీక్ష’ చేపట్టడానికి.. మధురపూడి విమానాశ్రయం నుంచి తణుకు వెళ్లిన జగన్‌పై దారి పొడవునా జనం జేజేలు పలికారు. వాగూవంకా, చెలమాఏరూ కలిసి నదిగా విస్తరించినట్టు.. 16వ నంబరు జాతీయ రహదారిపై సాగిన ఆయన కాన్వాయ్ తణుకు చేరే సరికి అఖండ జనవాహినిగా గోచరించింది.
సాక్షి, రాజమండ్రి :అన్నదాతలకు, ఆడపడుచులకు అన్యాయం చేస్తే ఊరుకోనంటూ వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా తణుకులో శనివారం రెండు రోజుల దీక్షను ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి ఆయన విమానంలో ఉదయం 10.45 గంటలకు మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి కారులో తణుకు బయలుదేరి వెళ్లారు. రుణమాఫీ చేస్తానని ఆశలు కల్పించి, అధికారం వచ్చాక దగా చేసిన చంద్రబాబు తీరును ఎండగట్టేందుకు, రైతులు,మహిళల పక్షాన నిలిచి పోరాటం చేసేందుకు దీక్షోన్ముఖుడైన జననేతకు మద్దతు తెలిపేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి తరలి వచ్చారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారితో విమానాశ్రయం పరిసరాలు కిక్కిరిశాయి. వారంతా వెంట రాగా ఉదయం 11.00 గంటలకు విమానాశ్రయం నుంచి బయలు దేరి జగన్ రాజమండ్రి, వేమగిరి, రావులపాలెం మీదుగా తణుకు చేరుకున్నారు.
మార్మోగిన జేజేలు..
రావులపాలెం దాటాక గోపాలపురం జంక్షన్ వద్ద కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో వేలాదిగా రైతులు, మహిళలు, అభిమానులు జగన్‌కు స్వాగతం పలికారు. జిల్లాకు చెందిన నేతలతో కలిసి ఉన్న జగన్ వాహన సముదాయం గోపాలపురం రాగానే అభిమానులు బిగ్గరగా ‘జై జగన్’ అంటూ నినాదాలు చేస్తూ ఎదురేగారు. అక్కడి నుంచి 500 ఆటోలు, 100 మోటారు సైకిళ్లు, 50 కార్లలో సుమారు ఐదు వేల మంది జగన్ వెంట భారీ ర్యాలీగా తణుకు చేరుకున్నారు. దీంతో 16వ నంబరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఒక్కసారిగా జామ్ అయింది. జగన్‌కు స్వాగతం చెప్పడానికి వచ్చిన సందర్భంగా విమానాశ్రయంలో పార్టీ శాసన సభాపక్ష ఉపనేత, జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఎన్నికల ముందు రైతులు, డ్వాక్రా మహిళలకు ఇచ్చిన వాగ్దానాలను చంద్రబాబు అమలు చేయడం లేదన్నారు. నాడు బాబును నమ్మి నేడు మోసపోయామని వేదనతో ఉన్న రైతులు, మహిళల పక్షాన నిలబడేందుకే జగన్ తణుకులో 48 గంటల దీక్ష చేపట్టారన్నారు. ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు మోసపూరిత వైఖరిని విడమరిచేందుకు తమ పార్టీ అధ్యక్షులు దీక్ష బూనారన్నారు. మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు మాట్లాడుతూ తమ పార్టీ.. ప్రజలు, రైతులు, డ్వాక్రా సంఘాల పక్షాన పనిచేస్తోందన్నారు. చంద్రబాబు మోసాలను ప్రజలు ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నారన్నారు.
జగన్‌కు స్వాగతం పలికిన నేతలు
కోరుకొండ : మధురపూడి విమానాశ్రయంలో జిల్లా నలుమూలల నుంచీ వచ్చిన నేతలు జగన్‌కు స్వాగతం పలి కారు. వీరిలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్యేలు వంతల రాజేశ్వరి, దాడిశెట్టి రాజా, మాజీ మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, పినిపే విశ్వరూప్, సీజీసీ సభ్యులు జ క్కంపూడి విజయలక్ష్మి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి జక్కంపూడి రాజా, కొల్లి నిర్మల కుమారి, సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి సుంకర చిన్ని, మాజీ ఎంపీ గిరజాల వెంకటస్వామినాయుడు, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, రౌతు సూర్యప్రకాశరావు, కుడుపూడి చిట్టబ్బాయి, అధికార ప్రతినిధులు పి.కె.రావు, గొల్లపల్లి డేవిడ్, రాజు, నియోజక వర్గ కో ఆర్డినేటర్లు చెల్లుబోయిన వేణు, ఆకుల వీర్రాజు, కొండేటి చిట్టిబాబు, గుత్తుల సాయి, బొంతు రాజేశ్వరరావు, వివిధ విభాగాల రాష్ట్ర కమిటీ సభ్యులు పుత్తా ప్రతాప్‌రెడ్డి, మాసా రాంజోగ్, వివిధ జిల్లా సెల్‌ల కన్వీనర్లు కర్రి పాపారాయుడు, అనంత ఉదయ్‌భాస్కర్, శెట్టిబత్తుల రాజబాబు, యనమదల మురళీకృష్ణ, మార్గన గంగాధర్, రాజమండ్రి నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ మే డపాటి షర్మిలారెడ్డి, జిల్లా నేతలు విప్పర్తి వేణుగోపాల్, మిండగుదిటి మోహన్, నక్కా రాజబాబు, అల్లూరు కృష్ణంరాజు, రావిపాటి రామచంద్రరావు, గిరజాల బాబు, పోలు కిరణ్‌మోహన్‌రెడ్డి, అడపా హరి, చెల్లుబోయిన శ్రీ ను, గుర్రం గౌతమ్, కానుబోయిన సాగర్, శెట్టిబత్తుల రా జబాబు, వట్టికూటి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
దీక్షలో నేడు జిల్లా నేతలు..
తణుకులో జగన్ చేపట్టిన దీక్షలో రెండోరోజైన ఆదివారం జిల్లాలోని అన్ని నియోజక వర్గాల్లోని పార్టీనేతలు, అభిమానులు పాల్గొననున్నారు. వీరితో పెద్ద ఎత్తున రైతులు, మహిళలు కూడా దీక్షలో జగన్‌కు మద్దతు పలికేందుకు బయలుదేరుతున్నారు. ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వివిధ జిల్లా సెల్‌ల కన్వీనర్లు, నియోజక వర్గాల కో ఆర్డినేటర్లు, ఇతర జిల్లా నేతలు ఈ మేరకు శనివారం సాయంత్రానికే ఏర్పాట్లు పూర్తి చేశారు.