
'అధికారం అండతో మా ఎమ్మెల్యేలపై కేసులు'
హైదరాబాద్ : అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలపై కేసులు బనాయిస్తున్నారని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజల తరపున పోరాడుతున్న వారిని ఇబ్బంది పెడుతున్నారని ఆయన గురువారమిక్కడ అన్నారు. పార్టీలో కీలకంగా ఉన్న నలుగురు ఎమ్మెల్యేలపై కేసులు పెట్టారని వైఎస్ జగన్ అన్నారు. నగరి ఎమ్మెల్యే రోజా, పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ కుమార్, మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి...తాజాగా భూమా నాగిరెడ్డిపై కూడా కేసులు పెట్టారని గుర్తు చేశారు.
నిమ్స్లో చికిత్స పొందుతున్న భూమా నాగిరెడ్డిని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఏ స్థాయికి దిగజారారో భూమా నాగిరెడ్డి అరెస్ట్ వ్యవహారంతో అర్థం అవుతోందన్నారు. భూమా సహా నలుగురు ఎమ్మెల్యేలపై అక్రమ కేసులు బనాయించారని తెలిపారు. సమస్యలపై భూమా మున్సిపల్ సమావేశంలో మాట్లాడుతుంటే టీడీపీ సభ్యులే గొడవ సృష్టించారన్నారు. భూమాపై ఏకంగా హత్యాయత్నం కేసులు పెట్టారని వైఎస్ జగన్ అన్నారు. ఎవరెన్ని కుతంత్రాలు చేసినా అన్యాయంపై తమ పోరాటం సాగుతుందని ఆయన స్పష్టం చేశారు.