భవిష్యత్ మనదే
సాక్షి ప్రతినిధి, విజయనగరం: సార్వత్రిక ఎన్నికల గెలుపోటములు, గ్రామస్థాయిలో పార్టీ నిర్మాణంపై వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆ పార్టీ జిల్లా నేతలతో రాజమండ్రిలో గురువారం సమీక్షించారు. అరకు పార్లమెంట్ పరిధిలోని కురుపాం, సాలూరు, పార్వతీపు రం నియోజకవర్గాలతో పాటు విజయనగరం పార్లమెంట్ పరిధిలోని నెల్లిమర్ల, విజయనగరం, చీపురుపల్లి బొబ్బిలి, గజపతినగరం నియోజకవర్గ నేతలతో ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి గంట సేపు చర్చించారు. తొలుత అరకు పార్లమెంట్ పరిధిలోని కురుపాం, సాలూరు, పార్వతీపురం నియోజకవర్గ నేతలతో వేర్వేరుగా సమీక్ష చేశారు. ఎన్నికల్లో ఎక్కడెక్కడ పార్టీకి నష్టం వాటిల్లింది, ఏయే ప్రాంతాల్లో వెనకబడ్డాం, జరిగిన లోపాలు, నాయకుల పనితీరు, ప్రచార తీరు తదితర అంశాలపై లోతుగా సమీక్షించారు. కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరి తోనూ వ్యక్తిగతంగా మాట్లాడేందుకు ప్రయత్నించారు. అందరి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
గెలిచిన చోట ఏయే అంశాలు ప్రభావితం చేశాయన్న దానిపై కూడా ఆరాతీశారు. ఎన్నికలపై నేతల మనోగతం తెలుసుకోవడమే కాకుండా పార్టీ నిర్మాణం కోసం తీసుకోవాల్సిన చర్యలపై కూడా అడిగి తెలుసుకున్నారు. అనంతరం విజయనగరం పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష ప్రారంభమైంది. తొలుత నెల్లిమర్ల నియోజకవర్గంపై సమీక్షించారు. మండలాల వారీగా పార్టీకొచ్చిన ఓట్లు, ప్రభావితం చేసిన అంశాలపై చర్చించారు. ఆశించిన విధంగా ఓట్లు రాకపోవడానికి గల కారణాలను తెలుసుకున్నారు. ప్రత్యర్థి గెలుపునకు దోహద పడ్డ అంశాలపైనా ఆరాతీశారు. బలం, బలహీనతలపై లోతుగా చర్చించారు. భవిష్యత్‌లో అనుసరించాల్సిన విధానాలను సూచించారు.
తదుపరి విజయనగరం నియోజకవర్గ సమీక్ష చేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు లోపాలను వివరించారు. భవిష్యత్‌లో పలు జాగ్రత్తలు తీసుకోవాలని అధినేత దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం చీపురుపల్లి, బొబ్బిలి, గజపతినగరం నియోజకవర్గాల సమీక్ష చేశారు. అసెంబ్లీ సమీక్ష చేస్తూనే పార్లమెంట్ అభ్యర్థికొచ్చిన ఓట్లు, ఇతరత్రా అంశాలపై చర్చించారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన నాయకుల గురించి ఆరాతీశారు. ఎక్కువగా నేతలు అభిప్రాయాలను, వాదనలను, మనోభావాలను తెలుసుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చారు. ప్రతి ఒక్కరూ చెప్పినదాన్ని సావధానంగా విన్నారు. పార్టీ నిర్మాణం కోసం నాయకుల సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఒక్కొక్క నియోజకవర్గంపై గంట సేపు సమీక్ష చేయడంతో రాత్రి 10గంటల వరకు విజయనగరం పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల సమీక్షే జరిగింది.
పార్టీ జిల్లా అధ్యక్షుడు పెనుమత్స సాంబశివరాజుతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త, బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ రంగారావు, విజయనగరం పార్లమెంట్ అభ్యర్థి బేబీనాయన, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి, నెల్లిమర్ల అభ్యర్థి డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబు, విజయనగరం నియోజకవర్గం అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి, చీపురుపల్లి అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్, గజపతినగరం అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు, పార్వతీపురం అభ్యర్థి జమ్మాన ప్రసన్నకుమార్‌తో పాటు నియోజకవర్గాల ద్వితీయశ్రేణి నేతలతో వైఎస్ జగన్ సమీక్ష చేశారు. సమీక్ష అనంతరం నాయకులకు ధైర్యం చెబుతూ, తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చి ప్రసంగించారు. ఏ ఒక్కరికి ఆపదొచ్చినా అందరూ కలిసి నిలబడాలని సూచించారు. నాయకులంతా సమన్వయంతో పనిచేసి, పార్టీని గ్రామస్థాయిలో నిర్మాణం చేసుకుని ముందుకెళ్లాలన్నారు. ప్రజల పక్షాన నిలబడి, సమస్యలపై పోరాడదామని పిలుపునిచ్చారు.