3న రాజధాని గ్రామాల్లో వైఎస్ జగన్ పర్యటన
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం భూములను కోరిన నేపథ్యంలో రాజధాని ప్రాంత రైతుల నుంచి వ్యతిరేకత నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్చి 3న రాజధాని గ్రామాల్లో పర్యటించనున్నట్టు వైఎస్ఆర్ సీపీ నేతలు అంబటి రాంబాబు, ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే), మర్రి రాజశేఖర్లు పేర్కొన్నారు. శనివారం వారు మీడియాతో మాట్లాడారు. ప్రజల అభిప్రాయం మేరకే రాజధాని గ్రామాల్లో వైఎస్ జగన్ పర్యటిస్తున్నారని చెప్పారు.
రైతులను భయబ్రాంతులకు గురిచేసి ప్రభుత్వాధికారులు ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజస్వామ్యంలో ఇంత దారుణంగా ప్రవర్తించడం సమంజసమా? అంటూ ఘాటుగా ప్రశ్నించారు. ఇది ప్రజస్వామ్యమా? లేక రాజరికమా? అంటూ మండిపడ్డారు. రైతాంగానికి వైఎస్ఆర్ సీపీ అండగా నిలబడుతుందని స్పష్టం చేశారు. చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారిలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. రైతుల కోసం ప్రాణాలిస్తున్న చంద్రబాబు ఇప్పుడు రైతుల ప్రాణాలు తీస్తున్నారని విమర్శించారు. రైతులు, రైతు కూలీలు, కౌలురైతుల తరపున మహోద్యమం చేస్తామని వైఎస్ఆర్సీపీ నేతలు అంబటి, ఆర్కే, మర్రి రాజశేఖర్లు తెలిపారు.