నేడు చెన్నైకి వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వివిధ రాజకీయ పార్టీల మద్దతు కూడగడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి, అందులో భాగంగా బుధవారం చెన్నై వెళ్లనున్నారు. అక్కడి రాజకీయపార్టీల అధినేతలను కలిసి రాష్ట్ర విభజనపై కేంద్రం అనుసరిస్తున్న అడ్డగోలు తీరును వివరించి, వారికి వినతిపత్రం అందజేయనున్నారు. జగన్ రాక నేపథ్యంలో చెన్నైలో భారీగా స్వాగత ఫ్లెక్సీలు వెలిశారుు. అలాగే ఈ నెల 6న లక్నో వెళ్లి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ను కలవనున్నట్లు మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
హాజరుకు మినహాయింపునకు జగన్ వినతి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, ఎంపీగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాల్సి ఉందని, ఈ దృష్ట్యా కోర్టు వాయిదాలకు తన హాజరును మినహాయింపు ఇవ్వాలని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీబీఐ ప్రత్యేక కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జగన్ తరఫున న్యాయవాది అశోక్‌రెడ్డి మంగళవారం పిటిషన్ (స్పెషల్ వకాలత్) దాఖలు చేశారు. ప్రజా సమస్యలపై పార్టీ చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్త పర్యటనలతో పాటు ఎంపీగా తరచూ ఢిల్లీ వెళ్లాల్సి వస్తోందని జగన్ ఆ పిటిషన్‌లో వెల్లడించారు.
ప్రజాప్రతినిధిగా నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించాల్సి ఉందని, అయితే కోర్టు విచారణలకు హాజరుకావాల్సి రావడంతో ఆ బాధ్యతలకు సరైన న్యాయం చేయలేకపోతున్నానని కోర్టుకు నివేదించారు. నిందితునికీ ప్రాథమిక హక్కులు ఉంటాయని, వాటిని పరిరక్షించాలని కోరారు. ఈ కేసు విచారణలో భాగంగా కోర్టు వాయిదాలకు తన తరఫున న్యాయవాది అశోక్‌రెడ్డి హాజరవుతారని, ఆయన కోర్టు ముందు వెల్లడించే అభిప్రాయంతో తాను ఏకీభవిస్తానని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషన్‌ను విచారించిన సీబీఐ కోర్టుల ఇన్‌చార్జ్ న్యాయమూర్తి లక్ష్మణ్... సీబీఐ అభిప్రాయాన్ని కోరుతూ విచారణను జనవరి 3కు వాయిదా వేశారు.
సీబీఐ కోర్టుకు హాజరైన జగన్
తన కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సీబీఐ ప్రత్యేక కోర్టుల ఇన్‌చార్జ్‌గా ఉన్న నాంపల్లి ఎనిమిదో అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి లక్ష్మణ్ ముందు హాజరయ్యారు. అలాగే ఈ వ్యవహారంలో సీబీఐ దాఖలు చేసిన పది చార్జిషీట్లలో నిందితులుగా ఉన్న వారంతా హాజరయ్యారు. వీరి హాజరును నమోదు చేసుకున్న న్యాయమూర్తి... తదుపరి విచారణను జనవరి 3కు వాయిదా వేశారు. కాగా రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమాజ్‌వాదీ పార్టీ మద్దతు కూడగట్టేందుకు ఉత్తరప్రదేశ్ సీంఎ అఖిలేష్ యాదవ్‌ను కలిసేందుకు లక్నో వెళ్లడానికి జగన్‌కు సీబీఐ కోర్టుల ఇన్‌చార్జ్ న్యాయమూర్తి లక్ష్మణ్ అనుమతి ఇచ్చారు.